స్వామి ధర్మదర్శనానికి 8 గంటలు

స్వామి ధర్మదర్శనానికి 8 గంటలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శనం కోసం వచ్చిన భక్తులు కష్టాలు పడ్డారు. కార్తీకమాసానికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి రాత్రి ఆలయాన్ని మూసివేసే వరకు రద్దీ తగ్గలేదు. ధర్మదర్శన, వీఐపీ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కొండపైన క్యూలైన్లు నిండిపోవడంతో..ఆలయ ఆఫీసర్లు తాత్కాలిక లైన్లు ఏర్పాటు చేశారు. రూ.150 టికెట్లు కొన్న భక్తులు కూడా 4 గంటల పాటు స్పెషల్ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీ క్యూలైన్లు కూడా నిండిపోవడంతో..లడ్డూప్రసాద కౌంటర్ నుంచి ప్రధానాలయ ఉత్తర తిరువీధుల్లో రెండు వరుసల్లో తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఉత్తర, పశ్చిమ రాజగోపురాల మధ్య ఉన్న ఎంట్రీ నుంచి అష్టభుజి ప్రాకార మండప మాడవీధుల మీదుగా ప్రత్యేక క్యూలైన్లు నడిపి తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి చేరుకునే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు.  

ధర్మదర్శన భక్తుల కష్టాలు వర్ణనాతీతం

ధర్మదర్శన క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావు. ఊహించని విధంగా భక్తులు రావడంతో మొదటిసారిగా క్యూకాంప్లెక్స్ లోకి అనుమతించారు. ఫస్ట్​ టైం మూడు అంతస్తుల్లో నిర్మించిన మూడు క్యూకాంప్లెక్స్ లు నిండిపోయాయి. దీంతో భక్తులు బస్ బే ప్రాంగణంలో కూడా క్యూ కట్టాల్సి వచ్చింది. క్యూకాంప్లెక్సుల్లోనే గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో చంటిపిల్లలతో వచ్చిన భక్తులు అవస్థలు పడ్డారు. ధర్మదర్శన క్యూలైన్లు, క్యూకాంప్లెక్సులు నిండిపోవడంతో.. రద్దీ తగ్గే వరకు మిగతా భక్తులను క్యూకాంప్లెక్స్ బిల్డింగ్ లోకి అనుమతించలేదు. బ్రేక్ దర్శన టికెట్లు కొన్న భక్తులు కూడా నిరీక్షించారు. స్వామివారి ధర్మదర్శనానికి దాదాపుగా 8 గంటలకు పైగా సమయం పట్టింది. 

అరకొర సదుపాయాలు  

రద్దీకి అనుగుణంగా సరిపడా ఏర్పాట్లు, సదుపాయాలు లేకపోవడంతో భక్తులు నరకయాతన అనుభవించారు. కొండపైకి ప్రైవేట్ వాహనాలను నిలిపివేయడం, రద్దీకి సరిపోను బస్సులు లేకపోవడంతో.. కొండపైకి చేరుకోవడానికి అగచాట్లు పడ్డారు. బస్సులు లేక  కొందరు ఘాట్ రోడ్డు నుంచి నడుచుకుంటూనే కొండపైకి చేరుకున్నారు. కొండపైన టాయిలెట్స్, వాష్ రూమ్స్ సరిపోక వృద్ధులు, మహిళలు ఇక్కట్లు పడ్డారు. దీనికితోడు సైన్ బోర్డులు లేక  ధర్మదర్శనానికి, స్పెషల్ దర్శనానికి, ప్రసాదాల కోసం ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురయ్యారు. ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఆలయ ఆఫీసర్లతో భక్తులు గొడవకు దిగారు.

స్తంభించిన ట్రాఫిక్

భక్తుల వాహనాలతో గుట్ట రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రోడ్లు, ఆరు లైన్ల రింగు రోడ్డు వెహికల్స్​తో నిండిపోయాయి. భక్తుల వాహనాల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియా కూడా నిండిపోవడంతో.. యాగశాల కోసం చదును చేసిన ప్లేస్ లోకి, పాత గోశాలకు వాహనాలను డైవర్ట్ చేశారు. అవి కూడా నిండిపోవడంతో.. వైకుంఠ ద్వారం నుంచి పాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వరకు రింగు రోడ్డుకు రెండు వైపులా పార్క్​ చేయాల్సి వచ్చింది. మరోవైపు రూ.500 టికెట్లు కొన్న భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడంతో.. బస్ బే ప్రాంగణం కూడా ఫుల్లయి పోయింది. దీంతో కొండపైకి వాహనాలను నిలిపివేయడంతో ఎగ్జిట్ ఘాట్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీనికి తోడు రిపేర్ల కోసం ఎంట్రీ ఘాట్ రోడ్డు(పాత ఘాట్ రోడ్డు)ను మూసివేసి ఎగ్జిట్ ఘాట్ రోడ్డు నుంచే కొండపైకి, కిందికి రాకపోకలు జరుపుతుండడంతో ఊహించని ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. దీన్ని క్లియర్​ చేయడానికి పోలీసులు కష్టాలు పడ్డారు. ఆలయ ఆఫీసర్లతో కలిసి పనిచేయడంతో సాయంత్రం లోపు ట్రాఫిక్ అదుపులోకి వచ్చింది.

ఒక్కరోజే రూ.1.09 కోట్ల ఆదాయం 

భక్తుల రద్దీతో దేవస్థానానికి ఆదివారం రికార్డుస్థాయి ఆదాయం వచ్చింది. గత ఆదివారం రూ.85.62 లక్షలు రాగా.. పలు రకాల పూజల ద్వారా ఈ ఆదివారం రూ.1,09,82,446 ఆదాయం సమకూరింది. గుట్ట ఆలయ చరిత్రలో ఇదే అత్యధిక నిత్య ఆదాయమని ఈఓ గీతారెడ్డి చెప్పారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.37,36,550, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.10.50 లక్షలు, వీఐపీ దర్శన టికెట్ల అమ్మకంతో రూ.22.65 లక్షలు, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.13,44,800, బ్రేక్ దర్శనాలతో రూ.6,95,100, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,57,650, ప్రచార శాఖ ద్వారా రూ.2,16,500, పాతగుట్ట ఆలయం ద్వారా రూ.3,37,650, సువర్ణపుష్పార్చనతో రూ.2,83,160, యాదరుషి నిలయం ద్వారా రూ.2,01,332, తలనీలాల టికెట్ల విక్రయంతో రూ.1,91,700, అన్నదానానికి ఇచ్చిన విరాళాల ద్వారా రూ.1,78,827 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. 

నేడు 'కార్తీక తులసీ దామోదర వ్రతం'

సోమవారం 'కార్తీక తులసీ దామోదర వ్రతం' నిర్వహించనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక టికెట్లను అందుబాటులో ఉంచామన్నారు. టికెట్ ధర రూ.516 గా నిర్ణయించామన్నారు. ఒక్క టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. కొండ కింద కొత్తగా కట్టిన సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఈ వ్రతాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు వ్రతాన్ని నిర్వహిస్తామని, భక్తులు గంట ముందుగానే మండపానికి రావాలని సూచించారు.

శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ ​జామ్​

శ్రీశైలం :  కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలానికి భక్తులు క్యూ కట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు శ్రీశైలం టోల్ గేట్​ నుంచి సాక్షి గణపతి, ముఖద్వారం వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. గంటల తరబడి వాహనాలు ఇరుక్కుపోయాయి. శ్రీశైలం డ్యాం సమీపంలోని ఆంధ్ర ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి దోమలపెంట వరకు కూడా ట్రాఫిక్ జామయ్యింది. శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు రాత్రిలోపు ట్రాఫిక్ ను క్లియర్​చేశారు.  

రాజన్న ఆలయంలోనూ రద్దీ

వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  దర్శనానికి 3 గంటల సమయం పట్టింది.