యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. సరిపడా, సౌకర్యాలు లేకపోవడంతో చంటిపిల్లలతో వచ్చిన వారు అవస్థలు పడ్డారు. పెరిగిన సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు లేకపోవడంతో భక్తులకు తిప్పలు తప్పలేదు. అరగంటకోసారి వచ్చే బస్సుల్లోకి ఎలాగో నెట్టుకుంటూ ఎక్కినా సీట్ల కోసం కొట్టుకునే సీన్లు కనిపించాయి. కొంతమంది తమ పిల్లలను కిటికీల నుంచి బస్సులోకి పంపించారు. కొందరైతే ఎందుకొచ్చిన గొడవ అనుకుని నడుచుకుంటూనే కొండపైకి
చేరుకున్నారు.
మాడ వీధుల నీడలో...
ప్రధానాలయ ప్రాంగణంలో సేద తీరడానికి సౌకర్యాలు లేకపోవడంతో మాడవీధుల్లో, మాడవీధుల నీడలో భక్తులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తోంది. వెయిటింగ్ గదులు లేకపోవడం, తాత్కాలిక చలువ పందిళ్ళు ఏర్పాటు చేయని కార ణంగా భక్తుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రద్దీ కారణంగా ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. ఇక వాహనాలతో పార్కింగ్ ఏరియా, రింగు రోడ్డు పరిసరాలు కిక్కిరిశాయి. పార్కింగ్ ఏరియా నిండిపోవడంతో యాగశాల ప్లేస్ లోకి వాహనాలను డైవర్ట్ చేశారు.
నారసింహుడి ఆదాయం రూ.73.97 లక్షలు
ఆదివారం వీఐపీ దర్శనం ద్వారా 9,700 మంది, బ్రేక్ దర్శనాల ద్వారా 1,684 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్కరోజే రూ.73,97,136 ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.31,88,600, వీఐపీ దర్శన టికెట్లతో రూ.14.55 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.7.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.5,05,200, వ్రత పూజలతో రూ.2,78,400, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,21,600 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.