ఆధ్యాత్మికం : అదే కర్తవ్య పాలన : వైరాగ్యానికి తొలిమెట్లు

జీవితంలో అన్నీ చూస్తాం. ఎత్తు పల్లాల్ని, కలిమి లేములని, ఆనందం.. ఆవేదనల్ని ఇలా ప్రతిదీ అనుభవిస్తాం. కానీ, బాధలకు కుంగిపోకుండా.. సంతోషానికి పొంగిపోకుండా అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. దాన్నే కర్తవ్యపాలన అంటారు. అదే జీవితానికి పరమార్థం తీసుకొస్తుంది. ఏం జరిగినా.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కర్తవ్యపాలన చేయాల్సిందే. దానికి కావాల్సిందల్లా అంతఃశుద్ధి మాత్రమే అంటాడు గౌతమ బుద్ధుడు.

అందరూ బౌద్ధంలో "అం చేరుతున్నారు. అసలు ఈ బౌద్ధంలో ఏముంది?
బుద్ధుడు ఏం చెప్తున్నాడు? ప్రజలు ఎందుకు గౌతమ బుద్ధుని పట్ల ఆకర్షిలవుతున్నారు?' అని ఆనాటి ఇతర మత గురువులు తెలుసుకోవాలనుకున్నారు. దానికోసం వెంటనే వాళ్లలో ఒక శిష్యుడిని బౌద్ధం స్వీకరించేలా చేసి.. రహస్యాలు రాబట్టాలనుకున్నారు. అందుకు ప్రతి విషయంలో నెగెటివ్ ను వెతికేవాడైతేనే బాగుంటుందని అనుకున్నారు. అనుకున్నట్టుగానే అలాంటి శిష్యుడిని సెలక్ట్ చేశారు. గౌతమ సుద్ధిడి చెంతకు చేరుకోవాలంటే.. ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? లాంటి విషయాలపై అతడికి ముందుగానే శిక్షణ ఇచ్చి పంపారు. అతడు బౌద్ధ వనానికి వెళ్లి వినయం నటిస్తూ తనని కూడా బౌద్ధ ధర్మంలో చేర్చుకోమని బుద్ధుడిని వేడుకున్నాడు. బుద్దుడు ఒక క్షణం పాటు రెప్పవాల్చకుండా అతనివైపు చూశాడు. అతనిలో అంతఃశుద్ధి లేదని గ్రహించాడు. నిజానికి ఇలాంటి వాళ్లకే జ్ఞానబోధ అవసరమని బుద్దుడి అభిప్రాయం. 

Also Read:-దోమలను తరిమి కొట్టడానికి .. వంటింటి చిట్కాలు ఇవే..

పేషెంటికి కచ్చితంగా ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందే! కాబట్టి వెంటనే అతడికి బౌద్దదీక్ష ఇచ్చాడు. తర్వాత అతను కూడా బుద్ధుని శిష్యులతో కలిసిపోయాడు. శ్రద్ధ, వినయం నటిస్తూ బుద్ధుడి బోధలు వినేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచింది. అందరి శిష్యుల్లా కాకుండా ఇతడు బుద్ధుడు
ఏ బోధ చేసినా.. వింత వింత సందేహాలు అడిగేవాడు. అయితే, వాటికి కూడా బుద్ధుడు ఎంతో సహనంతో నవ్వుతూ వివరణ ఇచ్చేవాడు. ఒకరోజు పొద్దునపూట బుద్దుడు తన శిష్యులకు వైరాగ్యబోధ చేస్తున్నాడు. "మమకారాన్ని వదులుకోవడమే వైరాగ్యం. మనుషులపై, వస్తువులపై, ఆస్తి అంతస్తులపై మమకారం ఉంటే.. అది మన సాధనకు ఆటంకం కలిగిస్తుంది. మనం చేయాల్సిందల్లా కేవలం కర్తవ్యపాలనే. దాన్ని మమకారంతో జతచేయకూడదు" అని వాళ్లకు చెప్పాడు. బోధ ముగిసింది. బుద్దుడు భిక్షాటనకు వెళ్లే టైమయింది. కానీ ఆయన భిక్షాపాత్ర కనిపించలేదు.

వైరాగ్యమే తొలిమెట్టు..

బుద్ధుడిలో వైరాగ్యం ఎంతుందో చూడాలని దాన్ని బయటి నుంచి వచ్చిన శిష్యుడే దాచాడు. 'భిక్షపాత్ర లేకుండా ఎలా వెళతాడో చూస్తా. ఇప్పుడు తెలుస్తుంది ఆయన వైరాగ్యం ఏపాటిదో' అనుకున్నాడు మనసులో, బుద్దుడు ఆచరించాకే.. తన అనుచరులను ఆచరించమంటాడని తెలిసిందేగా! ఆ రోజు కూడా బుద్ధుడు యథాప్రకారం భిక్షకు బయలుదేరాడు. ఆయన చేతిలో చిన్న ఆకు దొన్నె ఉంది. అందులోనే భిక్ష స్వీకరించి బౌద్ధవనానికి తిరిగొచ్చాడు. అందులో కొంచెం ఆహారం పక్షులకు వేసి.. మిగిలింది తిన్నాడు. 

రహస్యాలు తెలుసుకోవాలని వచ్చిన శిష్యుడికి, బుద్ధుడి గొప్పతనం అర్థమైంది. తన భిక్షాపాత్ర కోసం బుద్ధుడు కొంచెం కూడా వెతకలేదు. అసలు దానిపై ఆసక్తే చూపలేదు. అది పోయిందనే విచారం కూడా లేకుండా తన కర్తవ్యం నిర్వహించాడు. ఆ రోజు రాత్రే ధ్యానంలో ఉన్న బుద్ధుడి దగ్గరికి వెళ్లి.. ఆయన పాదాల దగ్గర భిక్షపాత్ర ఉంచి తాను ఎందుకు వచ్చానో.. ఎవరు పంపారో మొత్తం చెప్పి ఏడ్వడం మొదలుపెట్టాడు.'అయ్యా! ఈక్షణం నుంచి నేను గత బంధాలను తెంచుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి' అని రెండు చేతులతో మొక్కాడు.

 అప్పుడు బుద్ధుడు చిన్నగా నవ్వి ఆశీర్వదించాడు. తర్వాత 'జ్ఞానానికి వైరాగ్యమే తొలిమెట్టు' అని అతనికి చెప్పాడు. ఇది చెప్పి శతాబ్దాలు దాటింది. ఇప్పటికీ మనం అలాంటి వైరాగ్యం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి పరిస్థితి చెబుతోంది. అయినా.. మనం జరిగిపోయిన విషయాల గురించి, వదిలిపోయిన మనుషుల గురించి ఆలోచిస్తూ.. అమలు చేయాల్సిన కర్తవ్యాల్ని పక్కన పెడుతున్నాం. మమకారం వదిలి.. మన బాధ్యతల్ని పూర్తి చేసినప్పుడే నిజమైన జ్ఞానం మన ముందు వాలుతుంది.