ఆధ్యాత్మికం: తినే తిండిని బట్టే బుద్దులు.. ఙ్ఞానం వస్తాయి..!

ఆధ్యాత్మికం:  తినే తిండిని బట్టే బుద్దులు.. ఙ్ఞానం వస్తాయి..!

మానవుడు బతకాలంటే తినాలి. తినడానికి ఆహారం కావాలి.  ఆహారాన్ని సంపాదించేందుకు డబ్బు కావాలి.  ఇదంతా తెలిసిన విషయమే అయినా.. మనం సంపాదించిన డబ్బును పట్టి ఙ్ఞానం.. తెలివితేటలు.. బుద్దులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి.  సక్రమంగా సంపాదించిన డబ్బుతో ఆహారం తింటే మంచి ఙ్ఞానం వస్తుందని..అదే అక్రమంగా సంపాదించిన డబ్బుతో తిన్న వారికి అన్ని విధాల చెడు బుద్దులే ఉంటాయని మహాభారతంలో .. ఇలాంటి ఘటనలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు.

మనం భుజించే ఆహారమును అనుసరించే మన ఆలోచనలు చెలరేగుతాయి. దీనిని పురస్కరించుకుని భగవద్గీతలో పాత్రశుద్ధి ..పాకశుద్ధి ..పదార్థశుద్ధి ..అని చెప్పబడింది. పదార్థశుద్ధి అనగా కేవలం కల్తీలేని ఆహార పదార్ధమని  కాదు దాని అర్థం. ఎటువంటి మార్గములో ఆర్జించిన ధనముతో సేకరించబడిన ఆహార పదార్థమో, అటువంటి భావతరంగాల ప్రభావం ఆ ఆహారం భుజించినవాని పైన ఉంటుంది. ఆ ఆహారాన్ని ఎలాంటి సంపాదనతో తయారు చేశామో అలాంటి భావాలే కలుగుతాయి.

మహాభారత కాలంలో ద్రౌపదిని చెడపట్టే సమయంలో  అక్కడున్న పెద్దలు.. భీష్మాచార్యులు.. ద్రోణాచార్యులు.. ఇతర పెద్దలు కూడా దుర్యోధనుడిని  నియంత్రించలేకపోయారు.  అంటే ఆ సమయంలో వారు దుర్యోధనుడి సంపాదించిన పాపపు సొమ్ముతో వారు జీవనోపాధి పొందుతున్నారు.  అందువలన ఆ సమయంలో వారికి దుర్యోధనుడు చేసే పని పాపకృత్యమని వారు చెప్పలేకపోయారని పండితులు చెబుతున్నారు. 

Also Read:-జూదం.. బెట్టింగ్​.. పేకాట ఆడితే గరుడపురాణం ప్రకారం శిక్షలు ఇవే..!

మహాభారత యుద్ధము నందు భీష్ముడు అంపశయ్యపైన ఉన్నాడు. పాండవులు...  ద్రౌపదిని వెంటబెట్టుకుని వెళ్లి.... దుఃఖంతో దీన వదనులై భీష్ముని వద్ద చేతులు జోడించుకొని నిలబడి ఉన్నారు. భీష్ముడు వారిని ప్రేమతో దగ్గరకు రమ్మని పిలిచి...  ధర్మప్రబోధం చేయబోతుండగా ద్రౌపది ఫక్కున నవ్వింది. సభ్యత, సంస్కారం, సచ్ఛీలతకు ప్రతీక అయిన ద్రౌపది అటువంటి పరిస్థితిలో నవ్వడం చూసి పాండవులు నిర్ఘాంతపోయి ఆమె వైపు కోపంతో చూశారు. అది గమనించిన మహాజ్ఞాని అయిన భీష్ముడు చిరునవ్వుతో ద్రౌపదిని దగ్గరకు పిలిచి... పాండవులను ఉద్దేశించి మహాసాధ్వి అయిన ద్రౌపది అకారణంగా పరిహసించదు.దానికి ఏదో ఒకకారణం ఉంటుంది.  అప్పుడు బీష్ముడు తనకున్న పరిఙ్ఞానంతో ఆలోచించాడు.  

 ద్రౌపది నవ్వడానికి  ... ఆమె మనోభావాలు నాకు తెలుసని భీష్ముడు అన్నాడు. దుర్మార్గులైన కౌరవులు అమానుషంగా ప్రవర్తించినప్పుడు చెప్పని ధర్మసూత్రాలు...  సహజ ధర్మవర్తనులైన తన భర్తలకు ఇప్పుడు బోధించడం హాస్యాస్పదమని  భావించి  నవ్వింది. అది సహజం... ఆమె ప్రవర్తనలో కించిత్తు దోషం కూడా  లేదు. ఆనాడు దుర్యోధనుని కొలువులో ఉండటం చేత, ఆ దుష్టార్జనతో సంపాదించిన ఆహారంతో నా రక్తం కలుషితమయ్యింది. అప్పుడు ధర్మ బోధలు చేసే అర్హత నాకు లేదు.  అందుకు అప్పుడు ధర్మం గురించి ప్రస్తావించలేదు.

ఇప్పుడు  ( బీష్ముడు అంపశయ్యపై ఉన్న సమయంలో)  అర్జునుని శరాఘాతంతో నాలో ఉన్న కలుషిత రక్తం స్రవించి."ఇప్పుడు నేను స్వతంత్రుడను, ధర్మ బోధన చేసే అధికారాన్ని పొందాను అంటూ  పాండవులను సమాధానపరచి ప్రసన్నులను చేశాడు.  అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తయారైన నాలో ఉన్న రక్తం పోయింది.  ఇప్పుడు నాలో అక్రమసంపాదనతో ఏర్పడిన శక్తి లేదు.  అందువలన ఇప్పుడు ధర్మం గురించి చెబుతున్నానని  భీష్ముడు.. పాండవులకు .. ద్రౌపది సమక్షంలో    విన్నవించాడు.

చూశారా.. అక్రమ సంపాదన ... ఆ సంపాదనతో మనుగడ సాధించే వారి కష్టాలు ఎలా ఉంటాయో .. భీష్ముడి చివరి రోజుల్లో అనుభవించిన బాధను బట్టి తెలుస్తుంది.  అందుకే కాబోలు పూర్వజన్మసుకృతం అంటారు పెద్దలు.  ఇప్పుడు మరో జన్మవరకు వేచియుండటంలేదు.  మనం చేసిన పాపాలు.. అకృత్యాలు.. ఈ జన్మలోనే చాలామంది అనుభవిస్తున్నారు. అందుకే సమాజంలో జరుగుతున్న పరిణామలు సంపాదించే సొమ్మును బట్టే ఉంటాయి.  ఇప్పటికైనా ఈ సత్యాన్ని గ్రహించి డబ్బు సంపాదనను నీతిగా.. ఎలాంటి అవినీతి లేకుండా సంపాదించి సమాజాన్ని కాపాడుదాం..!