
శరీరంలో ఊపిరి ఉన్నంత వరకే ఇంట్లోవాళ్లు కుశలమా?.. బాగున్నారా? అని అడుగుతారు. ఆ ఊపిరి ఆగిపోయి.. చనిపోయాక ఆ శవాన్ని చూడటానికి సొంతవాళ్లు కూడా భయపడతారు.. అని ఆదిశంకరాచార్యులు ...భజగోవిందంలో అంటాడు. ఎండాకాలంలో చలివేంద్రాలు ఎలా వస్తాయో.. వర్షాలు పడగానే మాయమవుతాయి. అలానే మానవ జన్మకూడా చలివేంద్రం లాంటిదని చెబుతున్నారు.
మన మోహపు తెరలను చీల్చేందుకు ఆయన విసిరిన అక్షర తూణీరాలివి! అలాగని భార్యపై భర్త, భర్తపై భార్య విరక్తిని పెంచుకోవాలని ఆయన చెప్పడం లేదు. ఎవరికెవరు? ఎంతవరకు? మనకు స్పష్టంగా చెప్తున్నాడంతే! ఇది వినడానికి కొంచెం కఠినంగానే ఉన్నా.. సత్యం సత్యమే కదా మరి..!
Also Read :- వ్యాసుడు ఇక్కడే పురాణాలు రాశాడు.. ఎక్కడో కాదు.. తెలంగాణలోనే
నిత్యజీవితంలో మనల్ని కమ్మేస్తున్న మాయమబ్బులు. ఎంత గాఢంగా ఉన్నాయంటే, వేయి సూర్యుల ప్రకాశం కూడా వాటిని ఛేదించలేదు. అందుకే శంకరాచార్యులు, తన జ్ఞానబోధతో మనల్ని మేల్కొలుపుతూ హెచ్చరిస్తున్నాడు. ఈ శరీరానికి సంబంధించి అల్లుకున్న అనుబంధాలకూ, ఆశాపాశాలకూ మనమెంత బద్ధులమైపోతున్నామంటే, వాటికి అతీతంగా ఒక్క నిమిషం కూడా ఆలోచించే సాహసం చేయడం లేదు.
సగభాగమే సర్వస్వమా?
నిజానికి గృహస్థాశ్రమం కూడా మోక్షానికి మార్గమే! కానీ, కేవలం లౌకికమైన బంధాల్లోనే బందీలు కావడం వల్ల చాలామంది ఆ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడం. లేదు. దాంపత్య జీవితాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూడక పోవడం వల్ల చివరకు ఏ స్థితికి చేరుకుంటామో భజగోవిందంలో వివరించారు. జీవిత భాగస్వామిని కేవలం శరీరానికి అర్థభాగంగానే తలచి, భార్యను భర్త, భర్తను భార్య భోగ వస్తువులుగా భావిస్తే చివరికి ఆత్మీయతలు, అనుబంధాలు కూడా అశాశ్వతంగానే ముగిసిపోతాయి.
నాటకరంగంలో..
ఆధ్యాత్మిక సంపద మనకు దేని పట్లా ఆసక్తి లేకుండా చేస్తుందని, దేని పట్లా ఆశ లేకుండా చేస్తుందని చాలా మంది అపోహపడుతుంటారు. కాని లో లోపల ఆధ్యాత్మికత మన జీవితాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దుతుంది. ఎల్లకాలం ఈ లోకంలో ఉండమని తెలుసుకుంటే, ఇప్పటికన్నా గొప్పగా, సార్ధకంగా జీవించగలుగుతాం. ఎవరిపైనా అతి ప్రేమను పెంచుకోం. అలాగని ఎవరినీ శత్రువులుగానూ భావించుకోం. దారిలో నడుస్తుండగా.. మన వాళ్లంతా సహ ప్రయాణికులుగా పరిచయమయ్యారని గుర్తిస్తే, ఒకరి రాక మనల్ని ఆనందాల్లో తేల్చేయదు. మరొకరి పోక మనల్ని విషాదంలో ముంచెత్తదు. భార్యకు భర్త కావచ్చు. భర్తకు భార్య కావచ్చు.. కొన్నాళ్లు ఈ జీవితం అనే నాటకరంగంలో తమ తమ పాత్రల్ని పోషించడానికి వచ్చారంతే!
అతితో అనర్థం!
భాగస్వాములుగా ఒకరిపై మరొకరికి ప్రేమానురాగాలు ఉండకూడదని శంకరాచార్యులు ఉద్దేశం కాదు. కానీ, తన తోటిదే లోకంగా జీవిస్తూ ఒకరి నుంచి మరొకరు. అతిగా ఆశించవద్దని ఆయన గుర్తు చేస్తున్నాడు. నిత్య జీవితంలో చాలామంది దంపతుల మధ్య గొడవలు పొడసూపడానికి కూడా 'అతిగా ఆశించే గుణమే' కారణం. అతిగా ఆధారపడే తత్వమే కొన్నాళ్లు నిరాశకూ.. బాధకు గురిచేస్తుంది. అందుకే మనసుని ఉన్నతమైన ఆలోచనల వైపునకు, ఉదాత్తమైన ఆదర్శాల వైపునకు మళ్లిస్తే.. సంకుచితమైన బంధాల్లో మనసు ఇరుక్కుపోదు. అప్పుడు అది అశాశ్వతమైన శారీరక సుఖాలకే పరిమితం కాదు. నిజానికి ఈ ప్రాపంచిక బంధాలకు కారణం తాత్కాలిక వ్యామోహమే..!
"ఎవరికోసమైతే నువ్వు జీవితం అంతా యమ యాతనలు పడుతున్నావో, వాళ్లు నీతో వస్తారా? నువ్వు ప్రేమగా భావించే భాగస్వామే నువ్వు పోయాక వెంట రాకపోగా, 'ఇది పాచి పీనుగ అని ఈసడిస్తుంది" అని అంటాడు రామకృష్ణ పరమహంస .ఆలుమగలు ఆత్మబంధువులుగా మసలుకోవాలన్న విషయాన్ని మరిచి కేవలం భౌతిక సంబంధాలనే కొనసాగిస్తే జీవితాలు రసహీనమవుతాయి. భారతీయ సనాతన ధర్మంలో వివాహ వ్యవస్థ ఎంతో ముఖ్యం. దాన్ని మర్చిపోవడం వల్లే మానవ జీవితంలోని దాంపత్య ధర్మానికి ఆటంకం కలుగుతోంది.
–రామకృష్ణ పరమహంస–
ఏక్ దిన్ ఐసా హోజాయేగా కోయీ కాహూ కా నహీ ఘర్కే నారీకో కహే తన్కో నారీ నాహీ"
భావం: నిజమే! నువ్వు ఎవరికీ సంబంధించని రోజొకటి వస్తుంది. అప్పుడు నీ ఇంట్లోని నారి (స్త్రీ) నిన్ను వదిలేస్తుంది. నీ శరీరంలోని నరమూ నిన్ను వదిలేస్తుంది!
–-కబీర్ –
ఈ లోకం ఒక చలివేంద్రం
అవును మరి! లోకం ఒక చలివేంద్రం లాంటిది. మనుషులంతా దాహం తీర్చుకోవడానికి వచ్చిన బాటసారులు వాళ్లు దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్లిపోతున్నట్టు. మనం కూడా ఈ సంసారంలోకి వచ్చి మన పని కాగానే వెళ్లిపోతుంటాం. ఎప్పుడూ ఒక చోటే కలిసి ఉండం. ..కలుస్తూ ఉంటాం... విడిపోతుంటాం.
–- శ్రీమద్భాగవతం –
–వెలుగు,లైఫ్–