ఆధ్యాత్మికం : ఆశకు మించిన వ్యాధి మరొకటి లేదు.. దయకు మించిన ధర్మం లేదు.. అతిగా ఆశపడకే మనసా..!

ఆధ్యాత్మికం : ఆశకు మించిన వ్యాధి మరొకటి లేదు.. దయకు మించిన ధర్మం లేదు.. అతిగా ఆశపడకే మనసా..!

కడు పేదరికంతో బాధపడుతున్న ఓ అభాగ్యుడు తమ ఊరికి వచ్చిన ఒక సాధువుని దర్శించుకొని తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఎన్నో మహిమలున్న ఆ సాధువు అతని. కష్టాలు విని కరిగిపోయాడు. ఎలాగైనా అతనికి సాయం చేయాలని అనుకున్నాడు తన దివ్య దృష్టితో దూరంలో ఉన్న అడవిలో నాణాల రాశులున్నాయని తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్లి కావలసినంత సొమ్ము తెచ్చుకొని తృప్తిగా బతకమని పేదవాడికి చెప్తాడు.  ఈ విషయం  ఇంటిపక్కనున్న నూనె వ్యాపారికి తెలుస్తుంది. ధనవంతుడే అయినప్పటికీ అతనికి దురాశ పుట్టింది. నిరుపేద వేషం వేసుకొని, సాధువు దగ్గరకు వెళ్ళి మొసలి కన్నీరు కారుస్తాడు. సాధువుకి అతని దుర్బుద్ధి తెలిసిపోవడంతో గుణపాఠం చెప్పాలనుకుంటాడు.

అందుకే, నూనె వ్యాపారికి వందల అం కిలోమీటర్ల దూరంలో ఉన్న నిధుల జాడ చెప్తాడు. ఒకరోజు వ్యాపారి ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా సాధువు చెప్పిన చోటుకి వెళ్తాడు. అక్కడ నాణాల రాశులను చూసి ఆశ్చర్యపోతాడు. వాటిని సంచుల్లో నింపుకొని మూట కట్టుకోవడం మొదలు పెట్టాడు. ఎన్ని మూటలు కట్టుకున్నా ఆశ తీరడం లేదు. ఇలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. తాను యవ్వనంలో ఉన్నప్పుడు అక్కడ అడుగు పెట్టిన వ్యాపారికి... ముసలితనం కూడా వచ్చేస్తుంది. చివరకు తన శక్తికి మించిన నాణాల బస్తాలను తీసుకుని తన ఊరికి వస్తాడు. అప్పటికే అతని కొడుకులు, కూతుళ్లు చనిపోతాడురు. మనువలు ఈ లోభిని గుర్తు పట్టారు. రాజ్యాలు మారిపోయి దురదృష్టవశాత్తూ నాణాలు కూడా చెల్లకుండా పోతాయి. అప్పుడు ఈ మాత్రం దానికి ఇన్నేళ్లు కష్టపడ్డానా?" అని ఆ లోభి గుండె ఆగి చనిపోతాడు.

Also Read :- సీతాఫలం కేన్సర్ రానీయదు.. ఈ పండును వీళ్లు తినకూడదు..!

ఆశను మాత్రం వదలరు

ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు లెక్కకు మించి ఉన్నారు. ఆయువు తగ్గుతున్నా.  ఆశ మాత్రం ఎనిమిది చేతుల అక్టోపస్ లా అల్లుకుపోతోంది. పగలు, రాత్రి, ఉదయం.. సాయంత్రం , శిశిరం, వసంతం వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. అయినా మనిషి మాత్రం ఆశ వదిలిపెట్టడు' అని శాస్త్రాలు చెప్పాయి. ఆధునిక ప్రపంచంలో అంతం లేని ఆశలతో మనిషి పెడుతున్న పరుగులు విపరీత పరిణామాలకు దారి తీస్తున్నాయి.  ఒకవైపు కాలం తన ప్రతాపాన్ని చూపిస్తూ.. పాఠాలు నేర్పుతున్నా 'అవేం  మనకు కాదులే" అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. 

కాల నియమం

వెలుగులు చిమ్ముతూ సూర్యుడు పొద్దున ఎంతలా ఉదయించినా మాపటికి మౌనంగా అస్తపించాల్సిందే! వసంతం. .. ఎన్ని పూలవానలు కురిపించి, మురిపించినా శిశిరం రాగానే ఆకులు రాలి కొమ్మలు మోడువారాల్సిందే! చెట్లకైనా, మనుషులకైనా కాలనియమం ఒక్కటే. మానవుడు తప్ప.. సృష్టిలో అన్ని ప్రాణులూ ఈ శాశ్వత సత్యాన్ని మరిచిపోకుండా కాలనియమానికి కట్టబడి మసులుకుంటున్నాయి. మనిషి మాత్రం, 'నేను శాశ్వతం' అనే భ్రమతో కాలప్రవాహానికి ఎదురీదుతూ పిచ్చి అశలతో బతుకుతున్నాడు. 'ఆకాశంలో మేఘాలు ఎగిరి ఎప్పుడూ కలుసుకుంటూ విడిపోతూ ఉన్నట్లు. ... ఈ ప్రపంచంలోని ప్రాణికోటి మొత్తం కాల చక్రం వల్ల కూడుతూ, వీడుతూ ఉంటుంది. స్వేచ్ఛ అనేది లేదు కాలమే అన్నిటికీ మూలం...  కాలం చాలా విచిత్రమైంది. ఎంతటివారైనా ఈ కాలప్రవాహాన్ని దాటలేదు అని శ్రీమద్భావగతం చెప్తోంది..

ఆశతోనే అశాంతి

మనిషిలో అశాంతికి ప్రధాన కారణం  ఆశ.  జీవితానికి సంబంధించి మనిషి ఓ ఆశల పల్లకీని నిర్మించుకుంటాడు. రంగురంగుల పూలతో దాన్ని అలంకరించుకుంటాడు. అలాగే పల్లకీ సాగిపోవాలని కలలు కంటూ ఉంటాడు. కానీ, చాలా సార్లు ఆ కలలు నెరవేరనప్పుడు అశాంతిపాలవుతాడు. అందుకే 'ఆశించే స్థాయిలోనే మనసుని అప్రమత్తంగా ఉండాలి' అంటాడు. శంకరాచార్యులు. మన ఆయువెంత? దాంట్లో మనం అనుభవించేదింత" అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి.

సంతోషం ఎక్కడుంటుంది?

ఈ రోజుల్లో చాలామందికి శాంతి, సంతోషం ఎక్కడ లభిస్తాయో తెలియదు. వెలుగుతున్న లాంతరును చేతిలో పట్టుకొని, పక్కింట్లో నిప్పు కోసం అర్జించే అమాయకుల్లా మారిపోతున్నారు. చేతిలో దీపం ఉన్నా కూడా. అవివేకి, ఆ సోయి లేక చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కోసం పక్కవాళ్లను అడుగుతారు అలాగే ఇప్పుడు మనిషి కూడా.. సంతోషం మనసులో ఉంటే, దాని కోసం కార్లలో బ్యాంక్ ఎకౌంట్​లో, మేడల్లో, ఖరీదైన బట్టల్లో వెతుకుతున్నాడు. అలాగని వాటిని సంపాదించుకోవద్దని కాదు. కానీ, అవి ఉంటేనే సంతోషంగా ఉంటామనుకోవడం మాత్రం కచ్చితంగా అవివేకమే.. . .

చావు దగ్గరే..

అందరూ మరచిపోయే మరో ముఖ్యమైన విషయం చావు . అది  అది రోజురోజుకూ దగ్గరవుతుందని మనిషి గుర్తించడం లేదు. పోయినవాళ్లను చూసి పోతున్నవాళ్లు ఏడ్చినట్టు.... చనిపోయిన వాళ్ల ముందు నాలుగు కన్నీటి చుక్కలు కారు స్తారు. కానీ..  తానూ పోయే రోజు తప్పక వస్తుందనీ, ఆ లోపు తన కోసం తను బతకడమే కాకుండా  కొంతైనా ఇతరుల కోసం బతుకుదామని ఆలోచించరు. అందరూ వెళ్లిపోతారు.. నేను, నా పిల్లలు, నా మనవళ్లు, మనవరాళ్లు మాత్రమే శాశ్వతంగా ఉండి  ఈ ప్రపంచాన్ని అనుభవిస్తాం' అన్నంత ధీమాతో చాలా మంది. స్వార్థంగా జీవిస్తుంటారు.  పిల్లి ఎలుకను ప్రేమగా చూసినట్టు ఒక పక్క చావు ప్రాణిని మింగేయడానికి ఆశతో ఎదురు చూస్తూ ఉంది. అయినా ఓ మహాశయా! ముసలి నర్తకి  ఏమాత్రం తనకు అనందం లేకపోయినా నృత్యం మానలేకపోయినట్టు, ఈ 'ఆశ' అనేది పొందే తృప్తి ఏదీ లేకపోయినా ఎందుకు తన చపలత్యాన్ని మానలేకపోతోంది. ఆశ ఉన్నంత వరకు పాట్లు తప్పవు కదా? అని ఓ సారి శ్రీరాముడు విశ్వామిత్రుడితో అన్నాడు

ఆశలను తుంచేస్తేనే..

పురాణాలు చెప్పినా, మహానుభావులు చెప్పినా ఆశల పాశాన్ని తుంచేస్తేన మనిషికి మనశ్శాంతి..  గద్ద నోట్లో చేప ఉన్నంత కాలం కాకులు దాన్ని వెంబడిస్తూనే ఉంటాయి. చేపను జారవిడిచి కొమ్మపై వాలిన మరుక్షణమ దానికి విశ్రాంతి.. ప్రశాంతి ..అలాగే మనిషికి ఆశలున్నంత కాలం ఈ పరుగులూ తప్పువు, పడిపోవడాలూ తప్పువు. ఒక వయసు వరకు సంసారాన్ని ఓ చేతితో, పరమాత్ముడిని మరో చేతిలో పట్టుకోవాలి. అయినవాళ్లంతా ఓ స్థాయికి  వచ్చాక, రెండు చేతులతో పరమాత్ముడి పాదాలనే పట్టుకోవాలి.. అప్పుడు ప్రశాంతం, పరమానందం!

కళ్లు చల్లగా ఉండాలంటే అద్దాలు కళ్లకే పెట్టుకుంటాం. కానీ, ప్రపంచమంతా చల్లబరచలేం కదా! అలాగే లోకంలో కనిపించేవన్నీ అనుభవించాలన్న ఆశకన్నా, వాటిని కోరుకునే మనసునే కట్టడి చేయాలన్న జ్ఞానాన్ని పెంచుకోవాలి

–వెలుగు, లైఫ్​‌‌–