ఆధ్యాత్మికం : బతుకే ఓ పోరాటం.. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయంపై శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుత కథ..!

ఆధ్యాత్మికం : బతుకే ఓ పోరాటం.. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయంపై శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుత కథ..!

జీవితం పోరాటం లాంటిది.  పోరాడితేనే జీవితంలో విజయం సాధిస్తాం.. కారణం లేకుండా ఎవరూ ఏ పనిచేయరు.. అనుకున్నది సాధించాలన్నా.. ఆదిశగా ప్రయత్నం చేయాలన్నా ఎంతోకొంత పోరాటం చేయాల్సిందే.. ఆ పోరాటంలో చాలామంది చాలా రకాలుగా విమమర్శిస్తుంటారు.. అయినా అలాంటివి పట్టించుకోకుండా మనకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి.. ఉద్యోగం.. వ్యాపారం.. వ్యవసాయం ఇలా ఏది నిర్దేశించుకున్న మన గోల్​ను  రీచ్​ అవ్వాలి కదా..! ఇదే విషయంలో శ్రీకృష్ణుడు.. అర్జునుడికి చెప్పిన ధర్మశాస్త్రాన్ని ఒకసారి తెలుసుకుందాం. . . 

త్యక్త్వోత్తిష్ఠ అని లెమ్మని నిద్ర నుంచి లేపిన తరువాత ఏం చెయ్యాలో కూడా చెప్పాడు కృష్ణుడు. నిద్రిస్తున్నవారిని కారణం లేకుండా లేపకూడదు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ కారణం 'యుద్ధాయ కృతనిశ్చయః" అంటే యుద్ధం చేయటానికి గట్టిగా నిశ్చయించుకోమనటం అదే చెప్పాడు. ఏదైనా ఇతరులని చెయ్యమని చెప్పటానికి ఒక కారణం ఉండాలి. అదే విధంగా ఒక వ్యక్తికి ప్రేరణనిచ్చిన తరువాత ఏం చెయ్యాలో చెప్పకపోతే ఆ వ్యక్తి ఏం చెయ్యాలో తెలియక విలవిలలాడిపోవటం జరుగుతుంది. అందుకే కృష్ణుడు అర్జునుణ్ణి హృదయ దౌర్భల్యం వదిలి లెమ్మని చెప్పాక కర్తవ్యం బోధిస్తున్నాడు. 

అర్జునుడు యుద్ధభూమికి వచ్చింది యుద్ధం చేయటానికి, వచ్చాక ఎవరో ఏదో అంటారని, ఎవరికో ఏదో అవుతుందని, సందేహించటం ఎందుకు? అని ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణుడు. ఆ ఆలోచన అనవసరం అని కృష్ణుడు అర్జునుణ్ణి నెపంగా చేసుకుని చెప్పిన మాటలు ఈనాడు మనందరికి వర్తిస్తాయి. గిట్టనివారు ఏదో అంటారు అన్నాడు అర్జునుడు.
 
"వాళ్ళు నువ్వు ఏం చేసినా ప్రతికూలంగానే మాట్లాడుతారు. అది వాళ్ళ నిశ్చయం. వాళ్ళని మెప్పించటం... వాళ్ళ మెప్పుదల పొందటం జరిగే పని కాదు. అవాచ్యాలు (నోటితో పలకటానికి తగనివి) పలుకుతూనే ఉంటారు. నిందిస్తూనే ఉంటారు. నీ సమర్థతని కూడా తప్పు పడతారు." అంటాడు కృష్ణుడు. 

ఇది ఈనాటికి కూడా నిజమే కదా. విమర్శించే వారు ఏం చేసినా విమర్శిస్తారు. వాళ్ళ పని అదే. మనకి ఒక సామెత ఉంది, కొంచెం మొరటు. కానీ, ఎన్నో సందర్భాలలో నిజమే కదా అనిపిస్తుంది. అది “అత్తా, నీ కొంగు తొలగిందన్నా తప్పే.... తొలగలేదన్నా తప్పే" అన్నది. తప్పు పట్టటానికి సిద్ధంగా ఉన్నవారికి ఏదైనా ఆయుధమే. అయితే అటువంటి సమయాల్లో ఏం చెయ్యాలి? దీనికి సరైన సమాధానం చెపుతున్నాడు జగద్గురువు. "ఎట్లాగు ఏం చేసినా విమర్శిస్తారు కనుక... వాళ్ళని, వాళ్ళ మాటలని పట్టించుకోకుండా నువ్వు చెయ్యదలచింది. ..చెయ్యవలసినది చేసెయ్యటమే

కర్తవ్య నిర్వహణ ప్రధానం." అర్జునుడు ఆ ప్రదేశంలో నిలబడింది తన ధర్మ నిర్వహణ అయిన యుద్ధం చేయటం కోసం. యుద్ధం ధర్మమా? అది హింస కదా... అనే మీమాంస ఒడ్డున కూర్చున్న వాళ్ళకి రావటం సహజం. అర్జునుడు క్షత్రియుడు. శత్రురాజుల మీద యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టటం అతడి విధ్యుక్త ధర్మం. లేకపోతే ధర్మహాని, లేదా హింస జరుగుతుంది. 

ఈ మాట అందరికి సంబంధించింది. వాస్తవానికి జీవితం ఒక యుద్ధం. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆద్యంతాలు లేవు. దానిలో పాల్గొని తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించటం ప్రతి జీవికి, ముఖ్యంగా ప్రతి మానవుడికి కర్తవ్యం. యుద్ధం చేయటం ప్రధానం కానీ, గెలుపు ఓటమీ కాదు. ఎందుకు? అంటే యుద్ధభూమిలో అంటే జీవితంలో ఉన్నాం కదా. అంతే జీవితాన్ని జీవించాలి. అంతే కాని, ఇందులో విజయం లభిస్తుందా? లేదా అని నిర్ణయించుకొని జీవించటం ప్రారంభించం కదా. ఎవరు ఏ పని చేసినా అది పూర్తి చేయాలనే ఆశతో. చేస్తామనే నమ్మకంతో చేస్తారు. అంతే కానీ లెక్కలు వేసి, బేరీజు వేసి చెయ్యరు. అట్లా అయితే సమయం అంతా దానికే సరిపోతుంది

రణరంగంలో కాని, జీవిత రణరంగంలో కానీ ఇరు పక్షాలకి విజయం లభించదు అని తెలుసు కదా. అయినా వెనుకంజ వేయక ముందుకి సాగుతూనే ఉంటారు. ఫలితం పొందటంలో కాకపోయినా. అలుపెరగక పోరాడటంలో సఫలీకృతులౌతారు. 
ఈ పోరాటం అన్ని రంగాలలోనూ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మాతృ గర్భం నుండి వెలికి రాపటం దగ్గర నుండి, చిట్టచివరి ఊపిరి వరకు ప్రతి జీవి చేసే పని పోరాటమే.. చిన్నతనంలో చదువుతో, తరువాత ఉద్యోగంతో, కుటుంబ సమస్యలతో, సమాజంతో, బంధువులతో, ఆరోగ్యంతో... ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకదానితో పోరాటం సాగుతూనే ఉంటుంది. 

ఒక్క సారి పోరాటం ఆగితే ఇంకా ఏముంది? 

వందేళ్లు బ్రతికినా, ఏదో అనారోగ్యం వస్తే ఊపిరి కోసం ప్రాణి కొట్టు మిట్టాడుతూ ఉంటుంది చివరి క్షణం వరకు. అది జీవ లక్షణం. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగకపోయినా వాటిని వదిలిపెట్టకుండా చేస్తూనే ఉంటారు. ఓపిక లేకపోయినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. 'అవసరం లేకపోయినా ఎందుకు చేస్తారు?' అని అడిగితే. 'ఊరుకోలేము కదా' అనే సమాధానం వస్తుంది. అదే ఒక రైతుని అడగండి. 'లాభం లేకపోగా నష్టం వస్తోంది కదా, వ్యవసాయం ఎందుకు చేస్తున్నావు?' అని. 'అలవాటు, చెయ్యకుండా ఉండలేను' అని సమాధానం చెబుతాడు. 

'జీతం సరిగ్గా ఇవ్వటం లేదు కదా, ఉద్యోగం మానెయ్యకూడదు?' అని అడిగితే, 'ఊరికే ఎందుకు కూర్చోటం? ఎప్పుడో అప్పుడు ఇస్తారుగా' అనే సమాధానం వింటాం. తమకు తెలిసిన దానిని, తమ కర్తవ్యం అనుకున్న దానిని లాభ నష్టాలు, జయాపజయాల ప్రమేయం లేకుండా చేస్తూ ఉండటం చూస్తాం. అది కర్తవ్య నిష్ఠ అంటే. జీవన రణరంగంలో అలుపెరగక పోరాడటమే జీవన సాఫల్యం. 

ఎన్నికలలో నిలబడే అభ్యర్థులు అందరూ గెలవరు. కొంతమందికి గెలవరు  అని కూడా తెలుసు. అయినా ఎందుకు నిలబడతారు? ఎన్నికలలో నిలబడటానికి తమకి ఉన్న అధికారాన్ని, అర్హతని నిరూపించుకోవటానికి మాత్రమే. అందుకే కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధం చెయ్యటానికి నిశ్చయం చేసుకోమన్నాడు. మనం కూడా పాటించవలసింది అదే..     

–వెలుగు,లైఫ్​–