ఆధ్యాత్మికం : డబ్బు..సంపద ఉంటేనే గౌరవం.. సన్మానాలు

ఆధ్యాత్మికం : డబ్బు..సంపద ఉంటేనే గౌరవం.. సన్మానాలు

వాడికేమైంది.. దర్జాగా బతుకుతున్నాడు.. మూడు తరాల కూర్చొని తిన్నా తరగని  ఆస్తిని కూడబెట్టాడు.. అలాంటి వ్యక్తి .. నాకేం కావాల్సినంత సంపాదించాను. ఎవర్నీ పట్టించుకోవాల్సిన పనిలేదు. నా డబ్బేనన్ను కాపాడుతుంది' అనుకుంటారు. కానీ, జీవితం చివరి రోజుల్లో ప్రేమాభిమానాలు పంచేవాళ్లు లేక బాధపడుతుంటారు. నిజమైన సంపద ఇతరులకు సేవ చేయడం ద్వారానే లభిస్తుందని గుర్తించలేరు. 

భార్య.. భర్త.. తల్లి.. తండ్రి.. కొడుకు.. కూతురు బంధాలు మనిషిని స్వార్థం వైపు లాగుతాయి. 'నా వాళ్లే నాకు ముఖ్యం' అని దురాశ వైపు ఆలోచింపజేస్తాయి. సంపదలు కూడబెట్టేలా పురికొల్పుతాయి. చివరకు తనను తాను లేకుండా చేస్తాయి. ఈ విషయాల గురించి ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలు లోతుగా చర్చించాయి. తత్వవేత్తలు వివరంగా చెప్పారు. 

ప్రయోజనం కోసమే.. 

డబ్బు ఉన్నంత వరకే బంధువులు, స్నేహితులు, చుట్టూ ఉన్నవాళ్లు అనురాగాన్ని కురిపిస్తారు. ఆ డబ్బు పోతే పలకరించే వాళ్లు కూడా ఉండకపోవచ్చు. సంపదతో వచ్చేవన్నీ సంపదతోనే పోతాయి. మనుషులు, వస్తువులు, ఆస్తిపాస్తులు.. అన్నీ అంతే. పదవి, అధికారం, పెద్ద ఉద్యోగం... ఉన్నప్పుడు చుట్టూ పదిమంది పోగై తిరుగుతుంటారు. ...పొగుడుతుంటారు. ...సత్కారాలు, సన్మానాలు చేస్తారు... పదవిపోయాక మామూలు జీవితం మాత్రమే మిగులుతుంది. చెరువులో నీళ్లు ఉన్నప్పుడు కప్పలు చేరతాయి. నీళ్లు ఎండిపోతే ఎటు కప్పలు అటు అటుపోతాయి. మనిషి స్వభావం కూడా అంతే.. చివరకు ఎవరికి వాళ్లే మిగులుతారు. ఇదే విషయాన్ని రామదాసు 'దాశరథీ శతకం'లో 'తల్లిదండ్రులు, కొడుకులు, భార్య.. జీవితం మధ్యలో వచ్చినవాళ్లు... జీవితాంతం తోడు ఉండరు. పుట్టినప్పుడు, చనిపోయేటప్పుడు ఒక్కరే ఉంటారు. అందుకే, సంసారం, సుఖం, సంతోషం పూర్తిగా తోడు ఉంటాయి. అనుకోవడం పొరపాటు' అని చెప్తాడు. 

మేడిపండులాంటివే.. 

రైతుకు తను పండించే పొలంలో బంగారం దొరికింది. వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం కలిసొచ్చింది. దాంతో బాగా సంపాదించాడు. పెద్ద బంగళా, కారు, ఇంట్లో పని మనుషులు.. అన్నీ పెరిగాయి. దాంతో బంధువులు, స్నేహితులు ఎక్కువయ్యారు.  ఎప్పుడూ అతడితో కలిసి తిరిగేవాళ్లు. రైతుకు కుక్కలంటే ఇష్టం ఉండటం వల్ల విదేశాల నుంచి ఒక కుక్కను తెచ్చి పెంచుకునేవాడు. అతడి చుట్టూ ఉన్న వాళ్లు కుక్కను కూడా ప్రేమగా, అభిమానంగా, గౌరవంగా చూసేవాళ్లు. ఒకరోజు హఠాత్తుగా కుక్క చచ్చిపోయింది. దాని గురించి అందరూ తెగ జాలిపడ్డారు. కర్మకాండను పెద్ద ఎత్తున జరిపించారు. 

కొంతకాలానికి రైతుకు వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయి. సంపదంతా కరిగిపోయింది. మళ్లీ తనకున్న నాలుగు ఎకరాల పొలం సాగుచేసుకోవాల్సి వచ్చింది. కానీ ఒకప్పుడు. అతడి చుట్టూ ఉన్న జనం మాత్రం ఎవరూ మిగల్లేదు. ఇలాంటి మనుషుల గురించి, సంపదతో వచ్చే సుఖాలు, మనుషులు.. మేడిపండులాంటి వాళ్లని ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో చెప్తాడు. 

స్వార్థంతోనే.. 

భాగవతంలో బలిచక్రవర్తి తన తాత ప్రహ్లాదుడి మాటలు గుర్తు చేసుకుంటూ మనిషి సంపాదించుకునే సంపదంతా నిలకడ లేనిదని... అంతేకాదు మనిషిని నిజమైన ఆనందానికి దూరం చేసేదంటాడు. అలాగే బంధాలు సైతం మనిషిని స్వార్ధంగా తయారు చేసేవే కానీ, సంతోషంగా జీవించడానికి కాదంటాడు. ఎలా అంటే.. 'చుట్టాలు దొంగలతో సమానం, కొడుకులు అప్పులవాళ్లు, భార్యాభర్తలు ముక్తిని దూరం చేసేవాళ్లు. సంపదలన్నీ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. శరీరం కూడా అలాంటిదే. ఎవరైనా దగ్గరయ్యేది కేవలం వాళ్ల స్వార్థం కోసమే.. అందువల్ల స్వార్థంతో దగ్గరయ్యే ఈ బంధాలకు దూరంగా ఉండమంటాడు. డబ్బుతో వచ్చే సుఖాలు నిజమని నమ్మితే స్వార్థంతో బతకాల్సి వస్తుంది.. కుటుంబం, బంధాలు, సంపద.. పేరుతో మనిషి తనను తాను కుదించుకుంటూ. స్వార్ధానికి అలవాటు పడిపోతున్నాడు. స్వార్థం వదిలి అందరూ తన వాళ్లు అనుకోవడమే జీవితానికి మంచిది. 

ఎవరికి వాళ్లే.. 


వస్తువులు, మనుషులు, డబ్బు, అధికారం... మీద ఇష్టాన్ని పెంచుకున్నవాళ్లు, అంత తొందరగా వాటి నుంచి బయటపడలేరు. అవే తమ సర్వస్వం అనుకుని బతికేస్తుంటారు. ఒకవేళ వాటి నుంచి పూర్తిగా బయటకొస్తే, సమాజంలో బతకడం కష్టం. అందుకే వాటితో అంటీముట్టనట్లు ప్రవర్తించాలి.  శ్రీరామకృష్ణ పరమహంస ఇలాంటి వాటి గురించి చెప్తూ.. భార్యాపుత్రులు, తల్లిదండ్రులు.. అందరితో కలసిమెలసి ఉండాలి. అందరితో ఆత్మీయంగా -మెలగాలి. కానీ వాటిని పూర్తిగా మనసు దగ్గరకు రానివ్వకూడదు. వాళ్లెవ్వరూ పూర్తిగా తమ వాళ్లు కాదనే ఎరుకతో ఉండాలి. బంధాల్లో ఇరుక్కుపోతే పూర్తిగా కూరుకుపోతారు. బాధ, కోరిక, ఆవేశం, ఆశ.. లాంటివి ఎవరికి వాళ్లు వదిలించుకోవాలి. ఎప్పుడూ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. బిడ్డలకోసం డబ్బు కూడబెట్టడం, జీవితం చివరిలో, ఆరోగ్యం బాగలేనప్పుడు వాళ్లు చూడలేదని బాధపడడం లాంటి వాటి నుంచి బయటపడాలంటే ఈ లోకంలో ఎవరికి వాళ్లమే అనే ఆది శంకరాచార్యుల మాటలు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఎవ్వరూ మోహావేశాలకు లోనుకారు. 

సేవే మార్గం

-దేవుడికి దగ్గరవ్వాలని పూజలు, వ్రతాలు చేస్తుంటారు. కానీ, భౌతి కమైన సంపదలు, సుఖాల మీద ఆశ వదులుకోరు. వాటికోసం తప్పులు చేస్తుంటారు. తమ తప్పులు క్షమించమని దేవుడి దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. ఇతరులను ముంచైనా సరే.. సంపదలు, సౌకర్యాలు, సంతోషాల్లో మునిగితేలాలని తాపత్రయపడుతుంటారు. కానీ, ఆధ్యాత్మిక గ్రంథాలు... నీతి నియమాలతో ధర్మబద్ధంగా బతకమని చెప్తాయి. అంతే గానీ పుట్టిన పిల్లలను, కనిపించిన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేయమని చెప్పవు. అయితే వాళ్లకోసం ఖర్చు పెట్టడంతోపాటు, సంపాదించిన దానిలో కొంత సేవకోసం వినియోగించమని బోధిస్తాయి. నిస్వార్థం గా ఎవరికి వాళ్లు ఇతరులకోసం కష్టపడటాన్నే పుణ్యఫలంగా భావించమంటాయి. సంకుచితం, స్వార్థం వదిలేసి, తోటి వాళ్లంద రూ మనవాళ్లే అనుకుంటే చాలు, ఆ ఆలోచనే సంతోషాన్నిస్తుంది. ముందుకు నడిపిస్తుంది