
పరిశుభ్రత అవగానే ఎక్కువ మంది పరిసరాల పరిశుభ్రత గురించి మాత్రమే ఆలోచిస్తారు. లేదా వ్యక్తిగత శుభ్రత గురించి చెప్తారు. ఆధ్యాత్మిక భావనలో పరిశుభ్రత అంటే మనసులో ఎలాంటి మలినాలు లేకుండా చూసుకోవడం. మనసుకు ఎలాంటి మలినం అంటకుండా ఉండగలిగినప్పుడే మంచి ఆలోచనలు చేయగలుగుతారు. గొప్పస్థాయికి ఎడుగుతారు.
తోటి మనుషులతో స్నేహం, ప్రేమగా మెలుగుతారు. ఈర్ష్యా ద్వేషాలు, సుఖ దుఃఖాలకు లోనుకాకుండా బతకమని చెప్తాయి భగవద్గీత లాంటి గ్రంథాలు. పరిసరాలు శుభ్రంగా లేకుంటే రోగాలు వస్తాయి. అదే మనసును శుభ్రంగా ఉంచుకోకపోతే జీవితమే వృథా అవుతుంది. దేహానికి అంటిన మురికి కడుక్కుంటే పోతుంది. అదే మనసుకు అంటిన మురికి కడుక్కోడానికి ఏవీ ఉండవు. కేవలం మంచివైపు మారడం ద్వారానే అది సాధ్యమవుతుంది.
సదాచరణ : సక్రమపద్ధతిలో జీవించడం ఆచరణ అలా జీవిస్తూ దర్మం, న్యాయం, నీతి, విలువలతో బతకడమే సదాచరణ . మహాభారతంలో ధర్మవ్యాధుడు రోజూ మాంసాన్ని అమ్ముతూ తన వృత్తిని, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటూ తన బాధ్యతను అతిథులను గౌరవిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాడు. ఎన్నో యాగాలు చేసి, కఠోర తపస్సు చేసిన కౌశికుడు అతడి దగ్గరకు వచ్చి మనిషి ఎలా జీవించాలో నేర్చుకుంటాడు.
అంటే కేవలం ఒక్కడే బతకడం కాదు. చుట్టూ ఉన్న వాళ్లతో కలిసి బతకడమే సదాచరణ అని ధర్మవ్యాధుడి కధ తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా బతకాలంటే కేవలం డబ్బు మాత్రమే సంపాదిస్తే సరిపోదు. సరైన జీవన మార్గాన్ని ఎంచుకోవాలి. వృత్తి. ప్రవృత్తులతోపాటు, కుటుంబం, సమాజంతో కలిసి బతకాలి. అందుకోసం సమాజంలో ఉన్న విలువలతో జీవించాలి.
సమానం : దేవుడి ముందు అందరూ సమానమే అంటారు. పేద, ధనిక స్త్రీ పురుషులు చిన్న, పెద్ద తేడాలు ఉండవు. ప్రతి ఒక్కరిని ఒకేలా చూస్తాడు దేవుడని చెప్తాయి. వేదాలు కానుకలు, మొక్కులతో దేవుడి మెప్పు పొందుతారనుకోవడం పొరపాటని పురాణాలు చెస్తున్నాయి.. మనస్పూర్తిగా అన్నింటిని సమానంగా చూడగలిగినవాళ్లే దేవుడి దృష్టిలో ఉత్తములంటారు..
►ALSO READ | కన్యాపూజ సమయంలో ఆడపిల్లలకు ఇవ్వాల్సిన బహుమతులు ఇవే..!
శ్రీకృష్ణుడు తన దగ్గరకు వచ్చిన చిన్ననాటి స్నేహితుడు.. పేదవాడైన కుచేలుడిని అప్యాయంగా దగ్గరకు తీసుకుంటాడు. అతడు తెచ్చిన అటుకులను ఇష్టంగా ఉంటాడు. అతడి పేదరికాన్ని పోగొడతారు. అందుకే లోకంలో గౌరవం.. మర్యాద.. గుర్తింపు అనేవి డబ్బు, పదవి వల్ల వచ్చినా అవి ఎక్కువకాలం నిలబడవు. అవి ఉన్న వాళ్లు తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లను గౌరవించాలి. తమతో సమానంగా చూడాలి.
సహనం : దేవుడు భక్తులకు వరాలు ఇవ్వడానికి ముందు అనేక కష్టాలు పెడతాడు. సహనాన్ని పరీక్షిస్తాడు. కష్టాలు భరించిన వాళ్లకే ప్రత్యక్షమవుతాడని పురాణాల్లోని ప్రహ్లాదుడు, సావిత్రి, మార్కండేయుడు... లాంటి ఎన్నో కథల్లో ఉంది. ఉద్వేగాలు కలిగినప్పుడు, తప్పు చేస్తున్నామన్న అనుమానం వచ్చినప్పుడు సమస్యను వాయిదా వేయాలనుకున్నప్పుడు ...ఫలితం కోసం ఎదురు చూసేటప్పుడు కూడా అలాంటి సహనం అవసరం. తొందరపాటు పనికిరాదు. ఆవేశం ఆనర్ధం. సహనం సర్వజనామోదం అని పెద్దలు చెప్తారు. ఓర్పుతో ఎంతటి కార్యానైనా సాధించవచ్చు. కోపాన్ని తగ్గించుకోవచ్చు.. బాధ, ఆవేశం, ఓటమి కలిగినప్పుడు సహనంతో ఉండాలి. అలా ఉండి కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడే విజయం దక్కుతుంది
-వెలుగు,లైఫ్–