ప్రస్తుతం డబ్బు లోకాన్ని శాసిస్తుంది. ఒకప్పుడు విద్య లేని వాడు వింత పశువుతో సమానం అన్నారు. కాని ప్రస్తుతం హైటెక్ యుగంలో డబ్బు లేకపోతే హీనంగా బతకాల్సి వస్తుంది. అయితే డబ్బున్నంత వరకే విలువ ఉంటుంది. ఒకప్పుడు బాగా డబ్బు ఉండి.. తరువాత అన్నీ కోల్పోతే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆది శంకరాచార్యులు చెప్పిన ఆంతర్యాన్ని తెలుసుకుందాం. .
యవ్వనంలో వ్యాపారం మొదలు పెట్టిన ఓ బిజినెస్ మేన్ తక్కవ టైమ్ లోనే కోట్లకు పడగలెత్తాడు. సొసైటీలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకొని టాలెంట్ తో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. ఇక దాంతో ఆయన ఎనలేని డబ్బును సంపాదించాడు. అప్పటి నుంచి సంఘంలో ఆయన హోదాయే మారిపోయింది.
జనాలు ఆయన దృష్టిలో పడేందుకు... ఆయన్ను మంచి చేసుకునేందుకు అయినవారంతా పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా.. అయితే ఆ బిజినెస్ మేన్ కి కుక్కలంటే చాలా ఇష్టం... కుక్కులపై ఉన్న మక్కువతో ... ప్రేమతో విదేశాల నుంచి ఓ హైబ్రిడ్ కుక్కను తెప్పించుకొని.. ఆత్మీయంగా పెంచుకుంటున్నాడు. ఆ బిజినెస్ మేన్ ను ప్రసన్నం చేసుకొని ఏదైనా సాయం పొందాలని ఆశించేవాళ్లంతా ... ఆయన బలహీనత కుక్క... అని తెలుసుకొని వచ్చినప్పుడల్లా దానికి రకరకాల పదార్థాలు తెచ్చిపెట్టేవారు. అలా ఆయనకు దగ్గరవ్వాలని ప్రయత్నించారు. ఇలా గడుస్తుండగా... సడెన్ గా ఒక రోజు అది చనిపోయింది. ఆరోజు ఆ బిజినెస్ మేన్ ఇల్లు జాతరలా మారిపోయింది. పరామర్శలతో, పలకరింపులతో తడిసి ముద్దయిపోయింది. తన పట్ల వాళ్లంతా కనబరుస్తున్న సానుభూతికి, ఆత్మీయతకు పొంగిపోయాడు.. వాళ్లందరికి కోరుకున్నది ఇచ్చేశాడు.
Also Read :- ఎవరికి ఏ రంగు గులాబీ ఇవ్వాలో తెలుసుకోండి
అలా ఆయనను మంచి చేసుకొని బంధువులు, స్నేహితులు బాగుపడుతూ ఉన్నారు. కొన్నాళ్లకు ఆ శ్రీమంతుడి వైభవాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆస్తులన్నీ కర్పూరంలా కరిగిపోయాయి. బికారిలా మారిపోయాడు. రోగంతో మంచాన పడ్డాడు. గతంలో రాజభోగాల అనుభవించేటప్పుడు కనిపించిన వాళ్లెవరూ ఇప్పుడు ఆయన వైపు తిరిగి చూడటం లేదు. కుక్క చనిపోతేనే చూసిపోవడానికి బారులు తీరిన జనాలలో ఒక్కడు కూడా ఇప్పుడు.. ఆయన మంచిచెడులు తెలుసుకునేందుకు ప్రయత్నించడంలేదు. ఈ ప్రపంచంలో ఆయనొకడు ఉన్నాడని కూడా ఆ జనం మరిచిపోయారు.మరో ధనవంతుడి ఇంటి కుక్క బాగోగులు చూసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
మిసమిసలాడుతూ పైకి కనిపిస్తున్నా లోలోపల మాత్రం పురుగులతో లుకలుకలాడే మేడిపండు లాంటి పరిచారజనం ప్రేమాభిమానాల గుట్టు భజగోవిందంలో విప్పుతాడు ఆది శంకరాచార్యులు . డబ్బు సంపాదిస్తున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనం నీ పట్ల అనురాగాన్ని చూపిస్తారు. ముసలితనంలో నీ శరీరం శిథిలమై శక్తి విహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలకరించేవారు కూడా ఉండరని ఆది శంకరాచార్యులు తెలిపారు.
–వెలుగు, లైఫ్–