పెళ్లి వేడుకల్లో మందు వాడకుంటే పదివేలు బహుమతి

  • ప్రజల్లో స్వచ్ఛంద మద్య నిషేధ ఉద్యమానికి స్ఫూర్తి
  • కొట్లాటలు.. ప్రమాదాల నివారణకు ఉత్తరాఖండ్ దేవప్రయాగ్ పోలీసుల వినూత్న ఆలోచన

డెహ్రాడూన్: ప్రజల్లో స్వచ్ఛంద మద్య నిషేధ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించే నిర్ణయం ఇది. పోలీసులే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. కొట్లాటలు లేదా రోడ్డు ప్రమాదాలకు మద్యం ప్రభావం కారణమవుతున్న అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అనేక సర్వేల్లో కూడా మద్యం ప్రభావం చివరకు శాంతి భద్రతల సమస్యలు కూడా సృష్టిస్తున్నట్లు తేలింది. దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు మద్య నిషేధం కోరుతూ ఉద్యమించిన ఘటనలు అనేకం.  మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలు చేసిన విషయం తెలిసిందే. పాలకుల వైఖరి వల్ల నిషేధం సరిగా అమలు కాలేదు. ఇప్పటికీ దారుణమైన ఘటనలు జరిగినప్పుడు మహిళలు తమ ప్రాంతంలో మద్య నిషేధం డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మద్య నిషేధం కోసం మహిళలు రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్చందంగా.. పెద్ద ఎత్తున ఉద్యమించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపధ్యంలో మహిళలతోపాటు సామాన్యులందరూ సంతోషించేలా ఉత్తరాఖండ్ లోని తెహ్రి జిల్లాలో ఉన్న దేవప్రయాగ్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. అదే  పెళ్లి కార్యక్రమాల్లో పార్టీల్లో మద్యాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలంటూ పిలుపునిస్తూ ప్రచారం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఎక్కడైనా సరే పెళ్లిలో మద్యం వాడకపోతే తామే స్వయంగా చందాలు పోగు చేసుకుని 10,001 రూపాయల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఒక సంక్షేమ పథకంలా అమలు చేస్తామంటూ.. దీనికి  ‘భూలీ’ (గర్హ్వాలి భాషలో సోదరి) కన్యాదన్ పథకం అని పేరు పెట్టారు. నగదు బహుమతిని తమ పోలీస్ స్టేషన్ సిబ్బందే కూడబెట్టి బహుమతి గా అందించాలని నిర్ణయించారు.  తమ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వివాహాల్లో మద్యం పార్టీలు అనేక గొడవలకు.. కక్షలకు చివరకు శాంతిభద్రతల సమస్యకు దారితీస్తుండడంతో వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే ప్రజల ఆలోచనల్లోనే మార్పు రావాలని ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు దేవ్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహీపాల్ రావత్. ప్రజలతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తమ చర్యతో పెళ్లిళ్లు పూర్వంలో మాదిరిగా చాలా ఆనందంగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితులకు దారితీసే తగాదాలకు మద్యం వాడడమే  ప్రధాన కారణమని రావత్ చెప్పారు. గత ఏడాది అంటే 2020 మార్చి నెలలో లాక్ డౌన్ కు ముందు చమోలి జిల్లాలోని తారాలి బ్లాక్‌లోని ఒక గ్రామానికి చెందిన మహిళలు,పిథోరాగ జిల్లాలోని దీదీహాట్ డివిజన్ మహిళలు వారి ప్రాంతాలలో మద్యం నిషేధించాలని నిర్ణయించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎప్పటి నుంచో ఉంది. మద్య నిషేధం ఉత్తరాఖండ్ మహిళల దీర్ఘకాల డిమాండ్. 1984 లోనే అల్మోరా జిల్లాలోని చౌఖుటియా బ్లాక్‌లోని బస్బీరా గ్రామంలో మద్య నిషేధం అమలు చేశారు. అయితే ఓ వ్యక్తి నిషేధం ఉల్లంఘించి అక్రమంగా మద్యం బాటిళ్లు తీసుకుని రావడంపై గ్రామ మహిళలు నిలదీశారు. అతనిపై వారు స్థానిక పోలీసు అధికారి కామేశ్వర్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు పోలీసు అధికారిని పట్టుకుని ఘెరావ్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. దీని తర్వాత కూడా మద్య నిషేధం కోరుతూ అనేక ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 2014లో కన్వాలి రహదారి వద్ద మద్యం దుకాణం ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ డెహ్రాడూన్‌లో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అలాగే  2015 లో సోమేశ్వర్‌ ప్రాంతంలో మద్యం బార్ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టి ఉద్యమం నిర్వహించారు. అలాగే 2017 లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కార్యకర్తలు నైనిటాల్ నుండి గైర్సేన్ వరకు పాదయాత్ర మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు. మహిళల ఉద్యమాన్ని పట్టించుకోకుండా గోపేశ్వర్ ప్రాంతంలో కొందరు మద్యం కొనడానికి క్యూలో నిలబడగా వారిని బుజ్జగించడానికి బురద గడ్డిని ఉపయోగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పరిణామాల నేపధ్యంలో పోలీసుల తాజా నిర్ణయం ప్రజల్లో స్ఫూర్తిని కలిగిస్తుందని… స్వచ్ఛందంగా మంచి మార్పుకు నాందిపలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ

పేద విద్యార్ధికి దాతల అండ.. వీ6, వెలుగు కథనానికి స్పందన

మోడల్ ఆత్మహత్య ఎఫెక్ట్: మహారాష్ట్రలో మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ