
- టెండర్ ప్రక్రియ ఖరారు చేసిన రాష్ట్ర సర్కార్
- పనులు దక్కించుకున్న రాజస్థాన్ కంపెనీ ఈతర్
- 20 ఏండ్ల పాటు సిల్ట్ తొలగింపునకు అగ్రిమెంట్
- 100 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్, స్టాక్ పాయింట్
- భూమిని సేకరించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
- కొద్ది నెలల్లోనే రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో పూడిక( సిల్ట్) తొలగింపునకు ఎట్టకేలకు టెండర్ ఖరారైంది. రాజస్థాన్ కు చెందిన ఈథర్ కంపెనీ 20 ఏండ్ల అగ్రిమెంట్ తో పనులను దక్కించుకుంది. ప్రాజెక్టులో ఎప్పటికప్పుడు తీసిన పూడిక మట్టిని ప్రాసెసింగ్ చేయనుంది. ఇందుకు ప్రాజెక్టు సమీప ప్రాంతంలో యూనిట్ ని కూడా ఏర్పాటు చేసుకోనుంది. ఇప్పటికే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూడా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు.
ప్రాజెక్టులో రెండు నుంచి మూడు టీఎంసీల లోతు వరకు పూడిక పేరుకుపోయినట్లు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తుంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 7.630 టీఎంసీలుగా నిర్ధారించినా.. ఏటేటా పెరిగిపోయే పూడికతో నీటిమట్టం దాదాపు సగానికి పైగా తగ్గిపోయింది. ప్రస్తుతం 4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి మాత్రమే పరిమితమైంది. ప్రాజెక్ట్ ఎగువన దాదాపు15 – 18 కిలోమీటర్ల పొడవునా పూడిక ఉన్నట్లు సర్వే ద్వారా తెలుస్తుంది.
ప్రతి ఏటా ప్రాజెక్టులోకి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండగా.. భారీగా బురద, మట్టి వచ్చి చేరుతుండగా పూడిక పెరుగుతుంది. కడెం ప్రాజెక్టులో పూడిక తొలగింపు సాధ్యం కాదని గతంలో ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టంచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్ లో పూడిక సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిపుణులతో చర్చించి పరిష్కార మార్గాన్ని కనుగొంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ లతో పాటు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ లో సిల్ట్ తొలగించేందుకు నిర్ణయించిన విషయం తెలిసింది.
ఇందుకనుగుణంగా వెంటనే ప్రాజెక్టుల్లో పూడికతీత చర్యలకు శ్రీకారం చుట్టి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. గత జనవరిలో కడెం ప్రాజెక్ట్ పూడికతీత పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా టెక్నికల్ కారణాలతో లేట్ అయింది. ఈతర్ కంపెనీ టెండర్ దక్కించుకోగా.. ప్రభుత్వానికి టన్ను పూడిక మట్టికి రూ. 407 చెల్లించాల్సి ఉంటుంది.
మోడ్రన్ మెషీన్లతో సిల్ట్ తొలగింపు పనులు
మోడ్రన్ టెక్నాలజీని వినియోగిస్తూ ప్రాజెక్ట్ లో కంపెనీ పూడిక తీత పనులు చేయనుంది. నీటిమట్టం తగ్గుముఖం పట్టే నవంబర్, డిసెంబర్ నుంచి పనులు చేపట్టనుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు ఉండగా మోడ్రన్ మెషీన్ల ద్వారా వ్యాక్యూమ్ సిస్టంతో పూడికను తీయనుంది. ఇలా దాదాపు7 నెలల పాటు పూడిక తొలగింపు పనులు కొనసాగించనుంది. సమ్మర్ లో పూడికతీత పనులను మరింత స్పీడ్ గా చేపట్టనుంది.
ఆయకట్టు చివరి భూములకు సాగునీరు
పూడికతీత తర్వాత రెండు మూడేండ్లలో కడెం ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంవదని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు కింద 68 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకోగా రిజర్వాయర్ లో పూడికతో నీటిమట్టం తగ్గిపోవడం, కాల్వలకు మరమ్మతులు చేయకపోవడం వంటి కారణాలతో సగం భూములకు కూడా సాగునీరందండం లేదనే విమర్శలు రైతుల నుంచి వస్తుంటాయి. ప్రతి ఏటా వానాకాలంలో ప్రాజెక్టులోకి పుష్కలంగా వరద నీరు చేరుతుంది. అయినా రబీ పంటలకు మాత్రం పూర్తిస్థాయిలో సాగునీరు అందని పరిస్థితి తలెత్తుతుంది. త్వరలో పూడికతీత పనులు షురూ కానుండగా ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పూడికను ఇసుక, మట్టిగా వేరు చేసేందుకు..
ఈతర్ కంపెనీ సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే అధికారులు 100 ఎకరాల స్థలాన్ని నిర్మల్ మండలం ఎరవచింతల, రేవోజిపేట, సోమవారపేటలో సేకరించారు. ఇందులో 20 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, మిగిలిన 80 ఎకరాలను స్టాక్ పాయింట్ కు కేటాయించేందుకు నిర్ణయించారు.
ప్రాజెక్టులోంచి తీసిన పూడికను ప్రాసెసింగ్ యూనిట్ కు తరలించి ఇసుకగా, మట్టిగా వేరు చేస్తారు. అనంతరం వాటిని వేర్వేరుగా స్టాక్ పాయింట్ కు తరలిస్తారు. ఇసుకను సదరు కంపెనీ అమ్ముకునేందుకు కూడా ప్రభుత్వం లైసెన్స్ జారీ చేయనుం ది. మట్టిని రైతులకు పంట పొలాల కోసం ఇవ్వనుంది. అంతేకాకుండా ఇటుకల తయారీతోపాటు మట్టితో ఉత్పత్తయ్యే సామగ్రికి అమ్మనుంది.