- ఈ నెల మొదట్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంప్‌హౌస్
- భారీ మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపుతున్న ఆఫీసర్లు
- నీటి పంపింగ్ కోసం మరిన్ని మోటార్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు
- నెల రోజుల్లో పంపింగ్ పూర్తి చేసేలా ప్లాన్
నాగర్‌కర్నూల్, వెలుగు : పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్‌లోని వట్టెం పంప్‌హౌస్‌లోకి చేరిన వరద నీటిని బయటకు పంపే పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల మొదట్లో కురిసిన వర్షాలకు పంప్‌హౌస్‌లోకి నీరు చేరింది. దీంతో భారీ కెపాసిటీ గల మోటార్లను ఏర్పాటు చేసి వారం రోజుల నుంచి నీటిని బయటకు తోడుతున్నారు. అయినా నీరంతా బయటకు వెళ్లి పంప్‌హౌస్ పూర్తిగా తేలడానికి నెల రోజులైనా పడుతుందని సమాచారం.
నీట మునిగిన నాలుగు పంపులు, మోటార్లు
ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో భారీ వర్షాలు పడడంతో తూడుకుర్తి, శ్రీపురం చెరువులు నిండి నాగనూలు చెరువులోకి వచ్చే క్రమంలోవరద నీరు ఆడిట్ టన్నెల్ నుంచి మెయిన్ టన్నెల్‌లోకి వచ్చింది. వట్టెం అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్ కావడంతో పైనుంచి వచ్చిన వరదతో పాటు మెయిన్, ఆడిట్ టన్నెల్స్ నుంచి వచ్చిన వరద సర్జ్‌పూల్‌లోకి, అక్కడి నుంచి పంప్‌హౌస్‌లోకి చేరి నాలుగు బాహుబాలి మోటార్లు మునిగిపోయాయి. సర్జ్‌పూల్‌కు ముందు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తికాకపోవడంతో వరద ఆడిట్ టన్నెల్స్ నుంచి లోపలికి చేరింది.
పంప్‌హౌస్‌లోకి వరద వస్తున్నట్లు ఈ నెల 3న గుర్తించిన ఇంజినీర్లు ఆడిట్ టన్నెల్‌లో పనిచేస్తున్న వర్కర్లను సురక్షితంగా బయటకు రప్పించడంతో ప్రాణనష్టం తప్పింది. పంప్‌హౌస్‌లోకి చేరిన వరద కారణంగా నాలుగు పంపులు, మోటార్లు పూర్తిగా మునిగిపోయాయి. వేలాది లీటర్ల ఆయిల్ నీటిలో కలిసిపోయినట్లు సమాచారం.
భారీ మోటార్లతో డీవాటరింగ్
నాగనూల్ చెరువు వెనుక నుంచి సుమారు 11వేల క్యూసెక్కుల నీరు ఆడిట్ టన్నెల్ నుంచి పంప్‌హౌస్‌లోకి చేరినట్లు తెలుస్తోంది. ఈ ఉధృతి రెండు రోజుల పాటు కొనసాగడంతో అసలు ఎంత నీరు చేరిందన్న విషయంపై ఇంజినీర్లు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. సుమారు ఒక టీఎంసీ నీరు చేరి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. సుమారు 100 మీటర్ల లోతున ఉన్న సర్జ్‌పూల్‌లోకి చేరిన నీరు అంతే లోతు ఉన్న పంప్‌హౌస్‌లోకి చేరడంతో ఆ నీటిని బయటకు పంపడం సవాల్‌గా మారింది.
వట్టెం పంప్‌హౌస్‌లోని విలువైన మెషినరీ, విడిభాగాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. నాగనూల్, ఉయ్యాలవాడ, మెడికల్ కాలేజీ, కుమ్మెర దగ్గర ఆడిట్ టన్నెల్ నుంచి నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారు. 2,400 హెచ్‌పీ గల మూడు మోటార్లను ఏర్పాటు చేసి వారం రోజుల నుంచి నీటిని బయటకు పంపుతున్నారు. త్వరలో మరో నాలుగు మోటార్లు ఏర్పాటు చేస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు. ఆడిట్ టన్నెల్‌లో నాలుగు చోట్ల మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు.
తొమ్మిదేండ్లు సాగదీసిన బీఆర్‌ఎస్
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 18 నెలల్లో పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని 2015లో చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్ తన హయాంలో సగం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. నార్లాపూర్ – ఏదుల, ఏదుల – వట్టెం, వట్టెం – కర్వెన రిజర్వాయర్ల మధ్య మెయిన్ కెనాల్ పనులు పెండింగ్‌లో పడ్డాయి. నార్లాపూర్, ఏదుల పంప్‌హౌస్‌లలో రెండు పంపులు, మోటార్లు ఎలక్షన్ల ముందు నీటిని పంపింగ్ చేసి ప్రాజెక్ట్ పూర్తి చేశామని చెప్పుకునేందుకు ప్రయత్నించినా అది అట్టర్ ప్లాప్ అయింది.
నార్లాపూర్‌లో రెండు రోజులు నడిచిన ఒక పంప్ మూడో రోజుకే బంద్ అయింది. కరోనా ఎఫెక్ట్‌తో రెండేళ్లు, ఎన్‌జీటీ ఆదేశాలతో ఎనిమిది నెలలు, పెండింగ్ బిల్లులతో మరో మూడేండ్లు పనులు నత్తనడకన కొనసాగాయి. గతేడాది బడ్జెట్‌లో పాలమూరు ప్రాజెక్ట్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించడంతో అక్టోబర్ నుంచి పనులు నిలిపివేశారు.
25 రోజుల్లో కంప్లీట్ చేస్తాం
వట్టెం పంప్‌హౌస్‌లోకి చేరిన వరదను తోడేందుకు 2,400 హెచ్‌పీ కెపాసిటీ గల మోటార్లను వినియోగిస్తున్నాం. 25 రోజుల్లో మొత్తం నీటిని బయటకు పంపేలా ప్లాన్ చేశాం. పంప్‌హౌస్ వద్ద ఈఈ పార్థసారథి, ఆడిట్ టన్నెల్ వద్ద మరో ఈఈ రవీందర్ డీ వాటరింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు.
- సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఈ