డీవార్మింగ్​తో పొట్టలోని నట్టల కట్టడి

డీవార్మింగ్​తో పొట్టలోని నట్టల కట్టడి

పిల్లల కడుపులో క్రిముల వల్ల (పొట్టలో నట్టలు) కలిగే అనారోగ్య సమస్యలను అంతం చేయడానికి.. భారత ప్రభుత్వం 2015 నుంచి ‘జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం (ఎన్.డి.డి.)’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆనాటి నుంచి ప్రతి ఏటా రెండు సార్లు ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో ఆరు నెలలకోసారి ఎన్.డి.డి.రోజున అన్ని రాష్ట్రాలలో డివార్మింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తూ పిల్లలకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు (ఆల్బెండజోల్ టాబ్లెట్స్)  మింగించడం జరుగుతోంది. 

పిల్లలు తరచుగా కడుపునొప్పితోగానీ, కాళ్ళు, ముఖం ఉబ్బటంగానీ, ఆకలి మందగించడం, నీరసంగా, మందకొడిగా, బరువు తగ్గడం, రక్తహీనత, మలద్వారం చుట్టూ దురద మొదలగు ఏదైనా ఒక లక్షణంతో శారీరకంగా లేదా మానసికంగా అనారోగ్యంతో బాధపడుతుంటే కడుపులో నట్టలు ఉన్నట్టు అనుమానించవచ్చు. బడిలోపలి పిల్లలతో ప్రారంభించిన ఎన్.డి.డి. కార్యక్రమం ఆ తర్వాత బడిబయట పిల్లలకు, 1సం.చిన్నారుల నుంచి 19 సం.ల వయసు పిల్లలందరికీ డీవార్మింగ్ టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది. 

వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్) శాఖల సమన్వయం, సహకారం, సౌజన్యంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఎన్.డి.డి.రోజు,10 ఫిబ్రవరి 2025న 1 నుంచి19 సం.ల పిల్లలకు ఆల్బెండజోల్ 400 ఎం.జి. మాత్రలను మింగించడం జరుగుతుంది. 

నులిపురుగుల సంక్రమణ వేటి ద్వారా వ్యాపిస్తుంది?

 పరిసరాలు పరిశుభ్రంగా లేని ప్రాంతాలలో మానవ మలంలో ఉన్న హెల్మిన్తీస్ పరాన్నజీవుల గుడ్ల ద్వారా మట్టి కలుషితం అయి ‘మట్టి ద్వారా సంక్రమించే హెల్మిన్తీస్’ వ్యాప్తి చెందుతాయి. ఆరుబయట చెప్పులు లేకుండా వట్టి కాళ్ళతో మట్టిలో ఆడుకోవడం. అపరిశుభ్రమైన సురక్షితం కాని నీరు, ఆహారం తీసుకోవడం. భోజనం చేసే ముందు, మలవిసర్జన తర్వాత చేతులు సబ్బు నీటితో కడుక్కోపోవుట. 

బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయుట. పెరిగిన గోళ్లను కత్తిరించక పోవడం. వ్యక్తిగత పరిశుభ్రత,  పరిసరాల పారిశుధ్యం లోపించడం. అపరిశుభ్రమైన ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు తీసుకోవడం ద్వారా నులి పురుగులు నోటిద్వారా లేదా అరికాళ్ళ చర్మం ద్వారా సంక్రమిస్తాయి. 

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం..

10 ఫిబ్రవరి 2025 రోజున అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసిన ఒకటి నుంచి ఐదు సం.ల వయస్సు గల చిన్నారులకు మరియు 6 నుంచి 19 సం.ల వయస్సుగల బడి బయట పిల్లలకు అంగన్వాడీ/ఆశా కార్యకర్తలు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తారు. ప్రభుత్వ,  ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కాలేజీలలో నమోదు చేసిన 6 నుంచి 19 ఏళ్ళ పిల్లలందరికీ ఎన్.డి.డి. రోజు ఏ.ఎన్.ఎం.లు, ఉపాధ్యాయులు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తారు. 

ఆల్బెండజోల్  మాత్రల మోతాదు

 1 నుంచి 2 సం.ల చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర (200 mg) రెండు స్పూన్ల మధ్య నలిపి, నీటితో కలిపి మింగిస్తారు. 2 నుంచి 3 సం.ల పిల్లలకు పొడి చేసిన ఒక పూర్తి మాత్ర (400 ఎమ్.జి.) 3 నుంచి 19 సం.ల వయసు పిల్లలు ఆల్బెండజోల్ మాత్ర (400 ఎమ్.జి.) భోజనం చేసిన తర్వాత నమిలి నీటితో మింగాలి.  జబ్బులున్నవారు, దీర్ఘకాలికంగా మందులు వాడుతున్న పిల్లలు ఈ మాత్రలు వేసుకోరాదు. ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకోరాదు. ఎట్టి పరిస్థితుల్లో టాబ్లెట్ పిల్లవానికి ఇంటికి ఇవ్వకూడదు. ఆల్బెండజోల్ మాత్ర పిల్లలకు, పెద్దలకు కూడా సురక్షితమైనది.

- నాశబోయిన నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి-