నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలోని బెటాలియన్లలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని బెటాలియన్స్ అడిషనల్ డీజీ స్వాతి లక్రా చెప్పారు. బుధవారం నల్లగొండ పట్టణ పరిధిలోని అన్నెపర్తిలోని12వ బెటాలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంటీవో, టీఆర్జీ ఆఫీస్, ఫిష్ పాండ్, చిల్ట్రన్స్ పార్క్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బెటాలియన్ మెయింటెనెన్స్, నర్సరీ, పార్కులు బాగున్నాయని కమాండెంట్ సాంబయ్యను అభినందించారు.
త్వరలోనే పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో 300 మంది ఎస్సీటీపీసీలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందుకోసం గ్రౌండ్ సిద్ధం చేయడంతో పాటు క్లాస్ రూమ్స్, కిచెన్లు, లైబ్రరీలను అందుబాటులోకి తేవాలన్నారు. నిధుల కొరత లేదని, ప్రపోజల్స్ పంపితే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎస్పీ కే. అపూర్వరావు, బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సాంబయ్య, అడిషనల్ కమాండెంట్లు, అసిస్టెంట్ కమాండెంట్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు ఉన్నారు.