ఆన్‌లైన్‌ గేమింగ్ వెబ్‌సైట్లపై కొరడా.. 2400 అకౌంట్ల నుంచి రూ.126 కోట్లు ఫ్రీజ్

ఆన్‌లైన్‌ గేమింగ్ వెబ్‌సైట్లపై కొరడా..  2400 అకౌంట్ల నుంచి రూ.126 కోట్లు ఫ్రీజ్

బెట్టింగ్ యాప్స్, ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ పై ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సమయంలో.. జీఎస్టీ కౌన్సిల్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్ల మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఆన్ లైన్ గేమింగ్స్ పై బారిన పడి నష్టపోతున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ గేమ్స్ ద్వారా ఇంత సంపాదించవ్చు.. అంత సంపాదించవచ్చునని చెప్పి.. ఎందరినో నష్టాలపాలు చేస్తున్న వెబ్ సైట్స్, పోర్టల్స్ ను శనివారం (మార్చి 22) డీజీజీఐ (Director General of GST Intelligence) బ్లాక్  చేసింది.

ఆన్ లైన్ గేమ్స్ ఆఫర్ చేసి ఎందరినో నష్టాలకు గురిచేస్తున్న 357 వెబ్‌సైట్‌లు బ్లాక్ చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇల్లీగల్ గా కార్యకలాపాలు సాగిస్తున్న వివిధ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 అకౌంట్లను బ్లాక్ చేయటంతో పాటు126 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు  కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 

ఈ సందర్భంగా గేమింగ్ ప్లాట్ ఫామ్ కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అదేవిధంగా ఇల్లీగల్ ప్లాట్ ఫామ్స్ కు ప్రకటనలు ఇవ్వడంపై బాలీవుడ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు, సోషల్  మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను కూడా హెచ్చరించింది. 

మొత్తం 700 గేమింగ్ కంపెనీలను డీజీజీఐ పరిశీలిస్తోంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, పన్నులు ఎగవేస్తూ, నిబంధనలు అతిక్రమిస్తున్న కంపెనీలపై జీఎస్టీ కౌన్సిల్ నిఘా పెంచి విచారిస్తోంది. ఈ కంపెనీలు ఇతర బ్యాంకు అకౌంట్ల ద్వారా నిధులను ట్రాన్ ఫర్ చేస్తూ జీఎస్టీని ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు.