రాష్ట్ర సరిహద్దులపై డీజీపీ ఫోకస్

హైదరాబాద్‌, వెలుగు:  రాబోయే ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై డీజీపీ అంజనీకుమార్ ఫోకస్ పెట్టారు. నాలుగు రాష్ట్రాల డీజీపీలతో మంగళవారం సమీక్ష జరిపారు. లక్డీకపూల్ లోని డీజీపీ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, జాయింట్ ఆపరేషన్లపై చర్చించారు.  సమావేశంలో ఏపీ డీజీపీ రాజేంద్రప్రసాద్‌,మహారాష్ట్ర డీజీపీ రజనీష్‌ సేత్‌, ఛత్తీస్‌గడ్​ డీజీపీ అశోక్‌ జునేజ, సీఆర్పీఎఫ్  ఐజీ చారు సిన్హా, గ్రేహౌండ్స్‌ ఏడీజీ సంజయ్‌ జైన్‌, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతాల్లో చేయాల్సిన ఆపరేషన్స్‌, అందుకు అవసరమైన ట్రైనింగ్ అంశాలపై చర్చించారు. రాష్ట్ర సరిహద్దులను దాటుకుని వచ్చే మావోయిస్టులు, సానుభూతిపరులపై పటిష్టమైన నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు.