- సరెండర్ లీవ్స్, ఆరోగ్య భద్రత డబ్బులు రిలీజ్ చేశాం
- మెదక్‌లో పరేడ్ గ్రౌండ్, సెల్యూట్ బేస్ ను ప్రారంభించిన డీజీపీ జితేందర్
మెదక్, వెలుగు : ‘ఎలాంటి ఆందోళన వద్దు.. నేను ఉన్నది మీ కోసమే.. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను’ అని డీజీపీ జితేందర్ రాష్ట్ర పోలీసులకు భరోసా ఇచ్చారు. మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ ఆఫీస్(డీపీవో) ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పరేడ్ గ్రౌండ్, సెల్యూట్ బేస్, గ్యాలరీలను గురువారం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్‌రావుతో కలిసి ప్రారంభించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలోని పోలీసుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సరెండర్ లీవ్ లకు సంబంధించి రూ.200 కోట్లు, ఆరోగ్య భద్రతకు సంబంధించి రూ.75 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. ప్రాధాన్యతాక్రమంలో అవసరమైన చోట కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న చోట కొత్త బిల్డింగ్ ల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా పోలీస్ రిక్రూట్ మెంట్ కొనసాగుతోందని తెలిపారు. డయల్ 100 కు కాల్ చేస్తే, అర్బన్ ఏరియాలో 10 నిమిషాల్లో, రూరల్ ఏరియాలో 15 నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేందుకు వీలుగా 2 వేల వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు.
కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని, నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. సైబర్ క్రైమ్ బారినపడిన వారు వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని డీజీపీ సూచించారు. సైబర్ మోసగాళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.180 కోట్లు రికవరీ చేయగా, మరో రూ.300 కోట్లు నష్ట పోకుండా ఆపగలిగామన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుమాట్లాడుతూ పోలీసుల మెడికల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, పాత బకాయిలు రాలేదని, ప్రైవేట్ హాస్పిటల్స్ పోలీసులకు ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరిస్తున్నాయన్నారు.
టీఏ, డీఏలు కూడా ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మాసాయిపేటలో కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని, నార్సింగి, సిద్దిపేట జిల్లా రాయపోల్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పోలీస్ స్టేషన్లకు పక్కా భవనాలు నిర్మించాలన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథరెడ్డి, ఎండీ రమేశ్, మల్టీ జోన్–1 డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఏఎస్పీ మహేందర్పాల్గొన్నారు.