హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ మీద నమోదు అయిన కేసుపై తెలంగాణ డీజీపీ జితేందర్ మరోసారి స్పందించారు. ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 29) తెలంగాణ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కేసుపై జర్నలిస్టులు డీజీపీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నటుడు అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని.. ఈ కేసులో సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఇప్పుడు మేం ఏం మాట్లాడలేమని అన్నారు.
అలాగే.. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పోలీసుల వరుస ఆత్మహత్యల అంశంపైన డీజీపీ రియాక్ట్ అయ్యారు. ఈ ఏడాదనే కాదు.. ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో ఇలాగే కొందరు పోలీసులు సూసైడ్ చేసుకుంటున్నారని.. ఆర్థిక పరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని క్లారిటీ ఇచ్చారు. కొన్ని కేసుల్లో వర్క్ ప్రెజర్స్ వలన కూడా పోలీసులు ఆత్మహత్య లు చేసుకుంటున్నట్లు గుర్తించామని చెప్పారు. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోలీసులకు పిలుపునిచ్చారు.
Also Read : తెలంగాణ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్
కాగా, 2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఏ11 ముద్దాయిగా చేర్చారు.
2024 డిసెంబర్ 13న ఈ కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హై కోర్టును ఆశ్రయించగా అక్కడ బన్నీకి ఊరట దక్కింది. హైకోర్టు అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పుష్ప చంచల్ గూడ జైలు నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.