ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేస్తున్నరు :తెలంగాణ డీజీపీ జితేందర్‌‌‌‌

ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేస్తున్నరు :తెలంగాణ డీజీపీ జితేందర్‌‌‌‌
  • సారపాక ఐటీసీ గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లో పోలీస్‌‌‌‌ ఉన్నతాధికారుతో రివ్యూ

భద్రాచలం/బూర్గంపాడు, వెలుగు : మావోయిస్ట్‌‌‌‌ లీడర్లు ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేసి, తమ పబ్బం గడుపుకుంటున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్‌‌‌‌ అన్నారు. తెలంగాణ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ బార్డర్‌‌‌‌లో పనిచేసే పోలీస్‌‌‌‌ ఉన్నతాధికారులతో సోమవారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిస్ట్‌‌‌‌ల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలర్ట్‌‌‌‌గా ఉండాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల పోలీస్‌‌‌‌ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మావోయిస్ట్‌‌‌‌లు కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఆదివాసీలను అభివృద్ధికి, సంక్షేమానికి దూరం చేస్తున్నారన్నారు.

ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా, ఇతర సంక్షేమ పథకాలను అందించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. మావోయిస్ట్‌‌‌‌లు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అంతకుముందు భద్రాద్రికొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు ఎస్పీలు మావోయిస్టుల కదలికలు, ప్రస్తుత పరిస్థితులు, ఆపరేషన్స్‌‌‌‌ గురించి డీజీపీకి వివరించారు. ఇంటెలిజెన్స్‌‌‌‌ డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డి, మల్టీజోన్‌‌‌‌ 1 ఐజీపీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి, సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ ఐజీ చారుసిన్హా, ఐబీ అడిషనల్‌‌‌‌ డీజీ విక్రమ్​ఠాగూర్, ఐబీ స్పెషల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ రుత్విక్‌‌‌‌ రుద్ర, ఎస్పీలు రోహిత్ రాజ్, శబరీశ్‌‌‌‌, కిరణ్‌‌‌‌ ఖరే, గ్రేహౌండ్స్ ఎస్పీ రాఘవేందర్​రెడ్డి, ట్రైనీ ఐపీఎస్‌‌‌‌ల పాల్గొన్నారు. అనంతరం భద్రాచలంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.