- సీబీఐ వద్ద ప్రాసెసింగ్‌లో ఉంది: డీజీపీ జితేందర్
- అది అంతర్జాతీయ వ్యవహారం
- ఎన్నో ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాలేదని డీజీపీ జితేందర్ తెలిపారు. రెడ్‌కార్నర్ నోటీసులకు సంబంధించి ప్రక్రియ సీబీఐ వద్ద ప్రాసెసింగ్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీలు,ఇంటర్‌పోల్‌తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి నోటీసులు జారీ కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. గణేశ్ నవరాత్రులు, శోభాయాత్ర, మిలాద్ ఉన్ నబీ ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా మంగళవారం డీజీపీ మీడియాతో మాట్లాడారు.
లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, ఐజీలు రమేశ్, సత్యనారాయణ,చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి డీజీపీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తుపైనా ఆయన స్పందించారు. రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేయడం చాలా పెద్ద ప్రక్రియ అని తెలిపారు. దేశాల మధ్య అంతర్జాతీయ గైడ్‌లైన్స్, ఇంటర్‌పోల్ గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుందని, అలాగే ఒప్పందాలు పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఎన్నో స్థాయిల్లో ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుందన్నారు. ‘‘స్థానికంగా పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు ఇచ్చినట్లు రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ప్రాసెస్‌కు సమయం పడుతుంది.
సీబీఐలో పనిచేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి ఈ విషయాలు చెబుతున్నాను. ఈ కేసును హైదరాబాద్ సీపీ, వెస్ట్‌జోన్ డీసీపీల పర్యవేక్షణలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోంది. ప్రణీత్‌రావు టీమ్ ధ్వంసం చేసిన ఎస్‌ఐబీ డేటా బ్యాకప్ భద్రంగా ఉంది. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఈ దశలో ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేను. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. టెర్రరిస్టుల కదలికలపై నిఘా కొనసాగుతోంది” అని డీజీపీ వెల్లడించారు.
రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవు
జైనూర్‌లో ఇటీవల ఓ గిరిజన మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని డీజీపీ జితేందర్ అన్నారు. స్థానికంగా జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 38 మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో దళితులపై బహిష్కరణ ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కదలికలు ఇంకా ఉన్నాయని తెలిపారు. ఛత్తీస్‌ఘడ్, ఒడిశాలో పోలీసు ఆపరేషన్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి రాష్ట్ర బోర్డర్‌లోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారని, అయితే.. పోలీసు బలగాలు వారిని గట్టిగా తిప్పికొడుతున్నాయని అన్నారు.