- విధి నిర్వహణలో పోటీతత్వం ఉండాలి
- పోలీస్ డ్యూటీ మీట్-2024లో డీజీపీ జితేందర్
హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో పోలీసుల అంతిమ లక్ష్యం బాధితులకు న్యాయం చేయడమేనని డీజీపీ జితేందర్ అన్నారు. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఉత్తమ ఫలితాలను సాధించాలని తెలిపారు. పోలీస్ డ్యూటీలో పోటీతత్వం పెంచుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో బుధవారం పోలీస్ డ్యూటీ మీట్–2024 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సీఐడీ చీఫ్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ సహా పోలీస్ ఉన్నతాధికారులు డ్యూటీ మీట్‌లో పాల్గొన్నారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్స్ నుంచి 400 మంది పోలీసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్ డ్యూటీ మీట్ మొదటిసారి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్పోర్ట్స్, పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాల ద్వారా పోలీసుల్లో మరింత స్పిరిట్ పెరుగుతుందని చెప్పారు. డ్యూటీ మీట్‌లో నేర్చుకున్న స్కిల్స్‌ను కేసుల దర్యాప్తులో ఉపయోగించాలని పేర్కొన్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. న్యాయం జరుగుతుందనే భరోసాను బాధితుల్లో కల్పించాలని వెల్లడించారు.
సీఐడీ చీఫ్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ శాఖను మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజుల పాటు పోలీస్ డ్యూటీ జరగనుంది. శనివారం జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.