
- 30 మంది విధుల్లో నిర్లక్ష్యం చూపారని గుర్తింపు?
హైదరాబాద్, వెలుగు: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన ఘటనపై హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కమిటీ బుధవారం సాయంత్రం రాష్ట్ర సర్కార్‌కు నివేదిక అందించింది. సుమారు 12 పేజీలతో కూడిన నివేదికలో ఆపరేషన్ జరగడానికి ముందు నుంచి మొదలుకొని.. మరణాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల వరకూ పూర్తి వివరాలను కమిటీ పొందుపర్చింది. ఈ నెల 25న డీపీఎల్ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లు, సిబ్బంది, సర్జరీలు చేసిన అనంతరం మహిళల ఆరోగ్యాన్ని వారి ఇంటికెళ్లి పరీక్షించకుండా విధులను నిర్లక్ష్యం చేసిన ఆరోగ్య కార్యకర్తలు సహా సుమారు 30 మంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కమిటీ గుర్తించినట్టు తెలిసింది.
ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న ఎక్విప్‌మెంట్, డీపీఎల్ సర్జరీల కోసం డాక్టర్ జోయల్ టీమ్ తీసుకొచ్చిన ఎక్విప్‌మెంట్ స్టెరిలైజేషన్‌లో లోపాల వల్లే మహిళలంతా ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని కమిటీ పేర్కొన్నట్టుగా తెలిసింది. సర్జరీ జరిగిన మరునాడే ఓ మహిళ ఇబ్రహీంపట్నం హాస్పిటల్‌కు ఇన్ఫెక్షన్‌తో వచ్చిందని, ఆమెకు కూడా సరియైన ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా పంపించారని కమిటీ గుర్తించింది. ఇన్ఫెక్షన్‌ను గుర్తించి, అందరినీ అలర్ట్ చేసి ఉంటే నలుగురికి ప్రాణాపాయం తప్పి ఉండేదని పేర్కొంది. మృతుల్లో ఓ మహిళ ఇన్ఫెక్షన్‌తో ఉస్మానియాలో అడ్మిటైతే అక్కడి డాక్టర్లు పట్టించుకోకపోవడం, 18 గంటల తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు హాస్పిటల్‌కి షిఫ్ట్ చేయడం వంటి వివరాలను సైతం కమిటీ నివేదించింది. ఉస్మానియాలో ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే అంశాన్నీ పరిశీలించాలని సూచించింది. నివేదికలోని అంశాలు ఒకట్రెండు రోజుల్లో మీడియాకు వెల్లడయ్యే అవకాశం ఉంది.