కంగనా "ధాకడ్"కు తప్పని మార్కెట్ కష్టాలు

  • కంగనాకు సినిమా కష్టాలు
  • దారుణంగా పడిపోయిన ధాకడ్ మార్కెట్
  • బాక్సాఫీస్ వద్ద మూగబోయిన ధాకడ్
  • 8వ రోజూ అంతగా వసూలు కాని కలెక్షన్లు
  • కంగనా చేసిన పలు వ్యాఖ్యలే కారణమంటున్న విమర్శకులు

బాలీవుడ్ లో కాంట్రవర్షియల్ కు బ్రాండ్ అంబాసిడ్ గా పేరు పొందిన క్వీన్ కంగనా రౌత్ ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టే అనిపించడం కొత్తేమీ కాదు. మొదట్లో ఆమె డేరింగ్ కి అందరూ మెచ్చుకున్నా.. ఆ తర్వాత అగ్ర హీరోలపైనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది. కొన్నిసార్లు ఎవరేం అన్నా కూడా తనకెవరూ సాటి లేరనే విధంగా ప్రవర్తించడం, కామెంట్స్ చేయడం సైతం ఆమెను పలు వివాదాల్లో చిక్కుకునేలా చేశాయి.

ఇక వివరాల్లోకి వెళితే.. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ధాకడ్ మూవీకి మార్కెట్ పరంగా కష్టాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా ఆ సినిమాకున్న క్రేజ్ పడిపోయి, ఆ ప్రభావం కలెక్షనపై పడింది. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ అవేవీ మూవీని గాడిన పట్టించలేనట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం దాదాపు 100 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్టు టాక్ వచ్చినా.. ఇప్పటివరకూ కనీసం 5కోట్లు కూడా రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ చిత్రం ఏ రేంజ్ లో నష్టాలను ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభం నుంచే ఎవరూ ఊహించని రీతిలో దారుణ స్పందనను సొంతం చేసుకున్న ఈ మూవీకి.. ఏకంగా జనాలు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్నారనే  టాక్ కూడా వినిపిస్తోంది. 

ఈ సినిమాకు విడుదల రెండో రోజు నుంచే కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో 'ధాకడ్'కు కేటాయించిన షోలన్నింటిని క్యాన్సిల్ చేసి 'భూల్ భులయ్యా-2' తో రీప్లేస్ చేస్తున్నారని అంటూ బాలీవుడ్ లో ప్రచారమూ సాగుతోంది. నిజానికి 'ధాకడ్' సినిమాను 2100 స్క్రీన్స్‌లో విడుదల చేశారు. కానీ మే 22 నాటికిజనాలు లేని కారణంగా 250 నుంచి 300 స్ర్కీన్స్‌లో ఈ సినిమాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. కాగా తాజాగా ఈ సినిమా ఎనిమిదో రోజు కేవలం రూ.4,420 ల కలెక్షనను రాబట్టి అత్యంత దారుణ పరిస్థితిని చవిచూసింది. ఈ మూవీకి దేశ వ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయి, భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. 

 

ఇక మనికర్ణిక సినిమా అనంతరం జడ్జిమెంటల్ హై క్యా, పంగా, తలైవి దారుణంగా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తలైవి సినిమా అయితే ఫుల్ రన్ లో కేవలం3కోట్లను మాత్రమే అందుకుంది. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసినప్పటికీ కనీసం రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురావడం అత్యంత దారుణమైన విషయం. ఒకప్పుడు క్వీన్ సినిమాతో 100కోట్ల కలెక్షన్స్ అందుకొని బాలీవుడ్ బడా హీరోలకు ధీటుగా నిలబడిన ఈ భామను ప్రస్తుతం సినిమా కష్టాలు వేధిస్తు్న్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ భామ ఎదుర్కొంటున్న నష్టాలు, కష్టాలు.. ఆమె చేతులారా చేసుకున్నవేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఇది ఇలాగే కొనసాగితే ఆమెతో సినిమా తీయడానికి కూడా నిర్మాతలు ఆలోచిస్తారేమోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.