- గోల్డ్ బిజినెస్ డౌన్
- ధన త్రయోదశిపై బంగారం ధరల ఎఫెక్ట్
- వెలవెలబోయిన జువెలరీ షాపులు
- 30% తగ్గిన అమ్మకాలు
- పనిచేయని ఆఫర్లు, డిస్కౌంట్లు
హైదరాబాద్, వెలుగు: ధనత్రయోదశిపై బంగారం ధరల ఎఫెక్ట్ పడింది. ప్రజలు ధనత్రయోదశి రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఆరోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవికి పూజలు చేస్తే సిరిసంపదలు వస్తాయని నమ్మకం. కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా కొనేందుకు ఆసక్తి చూపుతారు. దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు పెడుతుంటారు. ఈసారి కూడా సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు పెట్టారు. కొన్ని దుకాణాలు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలుకు అవకాశం కల్పించాయి. అయితే, బంగారం ధరలు చుక్కలు చూపిస్తుండడంతో కొనుగోలుదారులను ఆకర్షించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. జనం మొగ్గుచూపలేదు. ఈసారి అమ్మకాలు 30 శాతం పడిపోయాయని వ్యాపారులు చెప్పారు. ఏటా జనం సెంటి మెంట్ తో వ్యాపారం చేసే వ్యాపారులకు పెరిగిన పసిడి ధరలు షాక్ ఇచ్చాయని వారు పేర్కొంటున్నారు.
Also Read : జియో పేమెంట్ సొల్యూషన్స్‌కు ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్
వాస్తవానికి ధనత్రయోదశి రోజు బంగారం దుకాణాలకు పసిడి ప్రియులు క్యూ కడతారు. కానీ, ఈసారి ధనత్రయోదశిని లైట్ గా తీసుకున్నారు. గోల్డ్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరడంతో బంగారం దుకాణాలన్నీ బోసిపోయి కనిపించాయి. అంతేకాకుండా ఈసారి ధన త్రయోదశి మంగళవారం వచ్చింది. మంగళవారం రోజు బంగారం కొనుగోలు చేయడానికి చాలా మంది వెనుకడుగు వేస్తారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం వరకు ధనత్రయోదశి ఉంటుందని, అప్పటికి అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సెంటిమెంట్ తో బంగారం కొనుగోలు చేయనివారు బుధవారం కొంటారని చెబుతున్నారు.
30 శాతం కూడా దాటని సేల్స్
ఈసారి బంగారం షాపుల్లో పండుగ వాతావరణం కనిపించలేదు. హైదరాబాద్ మార్కెట్ లో ధనత్రయోదశి అమ్మకాలు 30 శాతం కూడా జరగలేదని వ్యాపారులు తెలిపారు. నిరుటితో పోలిస్తే ఈసారి బంగారం ధర రూ.15 వేలు పెరగడంతో అమ్మకాలు తగ్గి ఉండవచ్చని పేర్కొంటున్నారు. కిందటేడాది 22 క్యారెట్ల బంగారం తులం రూ. 65 వేలు ఉండగా.. హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారం రూ.73,750 ఉంది. 24 క్యారెట్లు రూ.81,490కు చేరింది. సాధారణంగా ఏటా ధనత్రయోదశి.. బంగారం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఈసారి పెరిగిన ధరలతో బిజినెస్ ఆశాజనకంగా లేదని వ్యాపారులు వాపోయారు.