నిజామాబాద్అర్బన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పిన గృహలక్ష్మి పథకం మాటలకే పరిమితమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 16వ డివిజన్లో నిర్వహించిన గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొని కాలనీవాసులతో మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల పేర్లు మార్చి, రాష్ట్రంలో అమలు చేయడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు.
పేదోడికి సొంతింటి కళను ఆశగా చూపి ఇప్పుడు గృహలక్ష్మి పేరుతో కొత్త నాటకానికి తెరలేపారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ గొప్పల కోసం చెబుతున్న హామీల్లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు. ఇదే విషయాన్ని గడపగడపకు తిరిగి ప్రజలకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ ప్రవళిక, గణేశ్, రాంప్రసాద్, కాంతి, భీమన్న, రాజు పాల్గొన్నారు.