ధనుర్మాసం: తిరుప్పావై 12వ రోజు పాశురము.. మొద్దు నిద్దర వీడి మేల్కొని రారండమ్మా..

ధనుర్మాసం:  తిరుప్పావై 12వ రోజు పాశురము.. మొద్దు నిద్దర వీడి మేల్కొని రారండమ్మా..

త్రేతా యుగంలో  సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతియైన పది తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము... కీర్తిస్తున్నాము.... పాడుతున్నాము... మేమింత చేయుచున్ననూ నీవు నోరైన మెదుపుట లేదేమి తల్లీ! ఇది యేమి మొద్దు నిద్దరమ్మా! నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేవమ్మా.

    కనైత్తిళజ్గత్తెరుమై కన్ఱుక్కిరజ్గి,
    నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,
    ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్తజ్గాయ్!
    పనిత్తలైవీళ నిన్ వాశల్ కడైపత్తి
    చ్చినత్తినాల్ తెన్నిలజ్గైక్కోమానైచ్చెత్త
    మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
    ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరు ఱక్కమ్
    అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.


భావం : లేగదూడలుగల గేదెలు పాలుపితుకువారు లేక లేగదూడలను తలచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతిపెట్టునట్లుతోచి పాలు .... పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతయు బురదయగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచియుంటిమి.మీ ఇంటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచి ఉంటిమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతియైన రావణుని చంపిన శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా ! ఇంక మమ్మేలుకొనవా ! ఏమి ఈ గాఢనిద్ర !ఊరివారికి అందరికి నీ విషయము తెలిసిపోయినది.

 లెమ్ము ---- అని కృష్ణుని విడువక సర్వకాలములనుండుటచే స్వధర్మమును కూడా చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్నుడగు ఒక గోపాలుని చెల్లిలిని మేల్కొలిపినారు.పైన మంచు కురియుచున్నది క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని వున్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతూంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్చిన్నంగా పొంగిపొరలుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి, తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీవాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి వున్నామమ్మా!


నీ మొద్దు నిద్దుర విషయమంతా ఊరూ వాడ తెలిసిపోయిందిలే! ఇక నీ మొద్దునిద్దర చాలించి మేలుకో! (నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో) మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తిచేయటానికి సహాయపడు అంటూ  గోపికను లేపుచున్నారు. ఆ కృష్ణ సేవకు యీ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వానిని వెంటనే పరిత్యజించి కృష్ణసేవకే అంకితమయ్యే ధన్యజీవులీ గోకులంవారు. ఈ గోపిక కూడా ఇట్టి భావ సంపద కలిగినదే. శ్రీకృష్ణ మంత్రాన్ని అజపాజపంగా చేయటమే యీ జన్మ సార్ధక మంత్రం' కాబట్టి తైలధారవలెను, నదీ ప్రవాహంగాను మంత్రం మననం సాగిపోవాలని ఆండాళ్ తల్లి (యీ మాలికలో) వివరిస్తోంది