యాదగిరిగుట్టలో ఘనంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట నారసింహుడి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున 4:30 నుంచి 5:15 గంటల వరకు తిరుప్పావై కైంకర్యాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ఉత్తర భాగంలో ప్రత్యేక వేదికపై ఆండాళ్ అమ్మవారిని అధిష్టింపజేసి పాశురాలు పఠిస్తూ తిరుప్పావై వేడుకను జరిపారు.

మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే లక్ష్మీనరసింహస్వామిని గురువారం సాయంత్రం శ్రీమద్ అష్టాక్షరి పీఠాధిపతి శ్రీత్రిదండి అష్టాక్షరీ సంపత్కుమారా రామానుజ జీయర్ స్వామి దర్శించుకున్నారు. ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయంలో ఆలయ సిబ్బంది, భక్తులకు ఆయన అనుగ్రహ భాషణం, పండిత గోష్టి చేశారు. అంతకు ముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ ఏఈఓ గజవెల్లి రఘు లడ్డూ ప్రసాదం, పండ్లు అందజేశారు.