యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ఆదివారం షురూ అయ్యాయి. ఆలయ అర్చకులు తెల్లవారుజామున ప్రధానాలయ ముఖమండపం ఉత్తర భాగంలో ఆండాళ్ అమ్మవారిని అధిష్టింపజేసి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య వేదపారాయణాలు, మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ఉత్సవ సేవ నిర్వహించారు. జనవరి 15 వరకు ప్రతిరోజు ఉదయం ‘తిరుప్పావై’ కైంకర్యం ఉంటుందని ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం నిర్వహిస్తామని, 15న ఉదయం 11:30 గంటలకు అమ్మవారికి ఒడిబియ్యం పోసి ఉత్సవాలను ముగిస్తామని ఆయన చెప్పారు.
పాతగుట్టలో సుదర్శన నారసింహ యాగం
యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పాంచాహ్నిక దీక్షతో ఏకకుండాత్మక సుదర్శన నారసింహ యాగాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్ర పద్ధతిలో అర్చకులు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈనెల 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే సుదర్శన యాగానికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురారోపణతో శ్రీకారం చుట్టారు. ఈనెల 21న పూర్ణాహుతితో ఈ యాగం పరిసమాప్తి కానుంది. విశ్వశాంతి, లోక కల్యాణార్థం ఐదు రోజుల పాటు సుదర్శన నారసింహ యాగాన్ని చేపట్టినట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు.