వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

వెలుగు నెట్​వర్క్: ​ధనుర్మాస మహోత్సవంలో భాగంగా చివరి రోజు సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గోదారంగనాథుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గోదాదేవిరంగనాథుల కల్యాణాన్ని అర్చకులు జరిపారు. నారసింహుడిని పాండురంగనాథుడిగా, ఆండాల్ అమ్మవారిని గోదాదేవికి పూజలు చేశారు. దేవరకొండ పట్టణంలోని గరుడాద్రినగర్ లో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. 

ఆలయలో నిర్వహించిన గోదారంగనాథస్వామివారి కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే బాలూనాయక్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. నల్గొండలోని రామాలయంలో గోదారంగనాథస్వామివారి కల్యాణంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను మంత్రి సమర్పించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీగోదా శ్రీనివాస కల్యాణం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరింత శోభను తెచ్చింది. స్వామివారి కల్యాణాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. 

గోదారంగనాథస్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

గోదారంగనాథస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆకాంక్షించారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలని భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తామని చెప్పారు.  అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వెంకట్​రెడ్డిని ఘనంగా సన్మానించారు.