ధనుర్మాసం: పదవరోజు పాశురం... యోగ నిద్రను వీడి లేచి రారండమ్మా...

ధనుర్మాసం:  పదవరోజు పాశురం... యోగ నిద్రను వీడి లేచి రారండమ్మా...

వేదములను అధ్యయనం చేయటానికి సమర్ధుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్ధులైన ఒక నాయకుడో, నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలెకదా! ఆ వూరి యంతటికిని కృష్ణ సంశ్లేషమున సమర్ధురాలైన ఒక గోప కన్యక, యీ గోపకన్యలందరును కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనంతయు శ్రీ కృష్ణుడే పడునట్లు చేయ సమర్ధురాలైనది, శ్రీకృష్ణునికి పొరిగింటనున్నదియై, నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకొన్నదియై వున్నది. అట్టి ఆ గోపికను (యీ పదవ మాలికలో) లేపుచున్నారు.

 నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్
పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్! పణ్డోరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్
తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?
 ఆత్త అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!
తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.

భావం: నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! తలుపును తెరువుము, తలుపును తెరువకపోయినను మానెగాని, నోటినైనను తెఱచి పలుకవచ్చునుకదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటె వారి శ్రీ సూక్తులను వినటమే చాల ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి). పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపక రణాలను (పఱై) ఇచ్చునుకద!

పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము... నీవు మాకు శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను మేల్కొలుపు చున్నారు.

మేము రాకముందే నోమునోచి, దానిఫలముగ సుఖానుభవమును పొందిన తల్లీ ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాట ఐననూ పలుకవా ! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమియూలేని మావంటి వారము మంగళము పాడినను 'పఱ' అను పురుషార్థమును ఇచ్చెడి పుణ్యమూర్తి, ఒకనాడు మృత్యువు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఒడింపబడి తనసొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఇచ్చినాడా ! ఇంట అధికమగు నిద్రమత్తు వదలని ఓతల్లీ ! మాకందరకు శిరోభూషణమైనదానా ! నిద్రనుండి లేచి, మైకము వదిలించుకొని, తేరుకొని వచ్చి తలుపు తెరువుము. నీనోరు తెరచి మాట్లాడుము. ఆవరణము తొలగించి నీ దర్శనము ఇవ్వు. 

తనను పొందుట భగవానునికి ఫలము కాని, తనకు కాదు కనుక ఉద్వేగము పొందవలసినది పరమాత్మనే కానీ - తనకెందుకు అని నిశ్చలముగా ఉండెను. ఒకవేళ బ్రహ్మానుభవ సుఖము లభించినను దానియందు మమకారము లేకయుండును. ఆ సుఖము వానిదికదా ! తనకెందుకు సుఖమునందు మమకారము ?  శ్రీకృష్ణునికి పొరుగింటనున్నది, నిరంతరము క్రిష్ణానుభావమునకు నోచుకొన్నదియై ఉన్నది. అట్టి ఆ గోపికను (ఈ పాశురములో) నిద్దురలేపుచున్నారు.