ధనుర్మాసం: 11 వరోజు పాశురం.. నదీ స్నానానికి వేళాయే..!

ధనుర్మాసం: 11 వరోజు పాశురం.. నదీ స్నానానికి వేళాయే..!

 ధనుర్మాసంలో  పదకొండవ రోజు. ఆండాళ్లు అమ్మవారు  రంగనాథ స్వామిని  భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై అని అంటారు.  11 వ రోజు పాశురంలో ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదీ స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు  అవతారాలను వివరిస్తూ పరవశించి పోతుంది.  

    కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు
    శెత్తార్ తిఱలళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
    కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే
    పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్
    శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్
    ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
    శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ
    ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్

 భావం: ఓ గోపాలకుల తిలకమా... ఓ చిన్నదానా... లేత వయస్సు ఉన్న  పశువుల సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును... శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును...  ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా.... పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా ....  ఓ వనమయూరమా...  రమ్ము. నీ సఖులు, బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక, మాటాడక, ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు.

అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, ధ్యానములో  ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక అందరును అనుభవించునట్లు చేయవలెకాన, మా గోష్ఠిలో కలిసి యీ వ్రతము పూర్తిగావించుము అనుచున్నారు.