గోపిక కృష్ణపరమాత్మకు కూడా కుతూహలము రేకెత్తించు విలాసవతి. పరిపూర్ణముగ స్త్రీత్వముగల ప్రౌఢ, కృష్ణుడే తనవద్దకు వచ్చునని ధైర్యముతో పడుకొన్నది. అట్టి ఆమె లేనిదే తాము కృష్ణుని వద్దకు వెళ్ళుట యోగ్యముకాదని భావించి, ఆమెను మేలుకొలుపు తున్నారు.
కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.
తూర్పుదిక్కు తెల్లవారుతున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్లలందరును కూడా వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేరి, వెళ్ళుటవలన వారికి ప్రయోజనమని వెడుతున్నారు. అలా వెళుతున్నవారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీవాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదనా - ఓపడతీ ! లేచిరమ్ము ! కృష్ణ గుణములను కీర్తించి వ్రతమునకు ఉపక్రమించి వ్రతసాధనమగు పరను పొంది, కేశి అను రాక్షసుని చీల్చి చంపినవానిని, మల్లురను మట్టుపెట్టిన వానిని, దేవతలకు ఆదిదేవుడైన వానిని మనము వెళ్ళి సేవించినచో అయ్యో ! మీరే నావద్దకు వచ్చితిరే ! అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.
తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
ALSO READ : ధనుర్మాస ఉత్సవం : ఏడో రోజు పాశురం.. పక్షులు కూడా మాట్లాడుకుంటాయి..!
క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.