సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యందేనికి? అని 'ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.
కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే!
కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై
వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్ మత్తినాల్
ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి
కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్!!
భావం:- భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదా అని తెల్లవారుఝామున కలిసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆ మాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా !ఓ పిచ్చిదానా ! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులుగల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు, వారిచేతుల కంకణ ధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి, విజ్రుంభించి, ఆకాశామంటుచున్నవి. ఆధ్వనిని వినలేదా ?
ఓ నాయకులారా ! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కనపడుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువ వలయును.
ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! భాగవద్విషయానుభవము నెరిగినదానవు.
భగవదనుభవము నిత్యనూతనమై మొహపరచుచుండును. పక్షులు తెల్లవారుఝామున మేల్కొంటున్నాయి. ఈనాటి పాశురంలో గోదాదేవి భరద్వాజ పక్షులద్వార, అవిచేసే మధురధ్వనులు ద్వారా పొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భారద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే శాస్త్రవిషయాలు తెలుసుకోవలసిందేకదా ! వీటిని తెలుసుకొని భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవీ ఆటంకాలు కావు అని, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతము చేయుటకు రండి అని పిలుస్తోంది.