యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రధానాలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యకే ఉత్సవ సేవ నిర్వహించి ధనుర్మాసోత్సవాలు ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలహో రులో వేదపారాయణాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆండాళ్ అమ్మవారికి ఉత్సవ సేవ నిర్వహించారు. సోమవారం మొదలైన ధనుర్మాసోత్సవాలు 2025 జనవరి 14 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 5 నుంచి 5.45 గంటల వరకు ప్రధానాలయ ముఖ మండపం ఉత్తర దిశలో ఆండాళ్ అమ్మవారిని అధిష్ఠింపజేసి 45 నిమిషాల పాటు ‘తిరుప్పావై’ కైంకర్యాన్ని నిర్వహించనున్నారు. జనవరి 13న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 14న ఉదయం 11.30 గంటలకు అమ్మవారికి ఒడి బియ్యం పోసే వేడుకను చేపట్టనున్నారు. 14తో ధనుర్మాసోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు తెలిపారు