Raayan Movie Review: రాయ‌న్ మూవీ రివ్యూ..ధ‌నుష్ రా అండ్ ర‌స్టిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను మెప్పించిందా?

Raayan Movie Review:  రాయ‌న్ మూవీ రివ్యూ..ధ‌నుష్ రా అండ్ ర‌స్టిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను మెప్పించిందా?

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ ‘రాయన్’(RAAYAN). కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం జూలై 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. ధనుష్‌‌‌‌ హీరోగా నటిస్తున్న 50వ సినిమా ఇది. భారీ అంచనాల మధ్య రిలీజైన రాయన్ ఎలా ఉందో..డైరెక్టర్ గా ధనుష్ ఈ మేరకు తెరకెక్కించాడో రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే: 

కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. టౌన్‌కి వెళ్లొస్తామ‌ని చెప్పి మ‌ళ్లీ ఇంటికి తిరిగిరారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు (సందీప్‌కిష‌న్‌, కాళిదాస్ జ‌య‌రామ్‌), చెల్లి (దుషారా విజ‌య‌న్‌)తో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని సాఫీగా బతికేస్తుంటాడు. అతడి పెద్ద తమ్ముడు ముత్తు (సందీప్ కిషన్) పదే పదే గొడవలకు వెళ్తూ సమస్యలు తెచ్చిపెడుతుంటాడు. రాయన్ కు మాత్రం గొడవలంటే అస్సలు నచ్చదు. ఏ పరిస్థితుల్లో అయినా సంయమనం పాటిస్తూ గొడవలకు దూరంగా ఉండాలని తమ్ముళ్లిద్దరినీ ఎప్పుడు వారిస్తూ ఉంటాడు. వీరు నివసించే టౌన్‌ లోనే దురై (శ‌ర‌వ‌ణ‌న్‌), సేతు (ఎస్‌.జె.సూర్య‌) గ్యాంగ్స్ మ‌ధ్య ఎప్ప‌ట్నుంచో ఆధిప‌త్య పోరాటం కొన‌సాగుతుంటుంది. ఈ గూండాలు దురై, సేతు వల్ల కాతవరాయన్ జీవితం ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే..రాయన్‌ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? త‌న తమ్ముళ్లు, చెల్లెలు కోసం రాయ‌న్ ఏం చేశాడు? రాయ‌న్ కోసం వాళ్లు ఏం చేశారు? త‌దిత‌ర విష‌యాల్ని తెలుసుకోవాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే?

ధనుష్ డైరెక్టర్ గా తన ఫస్ట్ మూవీ అయిన 'పవర్ పాండి'లో ఒక నడివయస్కుడైన వ్యక్తి కథను ఎంతో హృద్యంగా చెప్పి ప్రేక్షకులను  మెప్పించాడు. ఇక ఇపుడు దర్శకుడిగా తన రెండో ప్రయత్నంలో జోనర్ మార్చి ఒక క్రైమ్ యాక్షన్ కథను ఎంచుకోవడం.. అందులో తనే హీరోగా నటించడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు మొదలయ్యాయి. రివెంజ్ డ్రామాతో ముడిప‌డిన గ్యాంగ్ వార్‌ కథలు, అందులో ఉండే పాత్రల మధ్య బలమైన సంఘర్షణ ఆ సినిమా విజయానికి కొలమానంగా నిలుస్తాయి. కథగా చూస్తే ‘రాయన్‌’లో కొత్త‌ద‌నం లేకపోయినా, కొన్ని మ‌లుపులు,ఫ్యామిలీ డ్రామా, క‌థా నేప‌థ్యం ప్ర‌త్యేకంగా మార్చేశాయి.

ఫస్టాప్ విషయానికొస్తే..రాయన్ బాల్యంతో స్టోరీ స్టార్ట్ అవ్వగా..ఆ తర్వాత ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం, కొన్ని అనుకోని పరిస్థితుల్లోని ఊరి నుంచి తప్పించుకుని రావడం..వంటి సీన్లతో టైటిల్స్ పడతాయి. ఈ ఫస్టాఫ్ లో చాలావ‌ర‌కూ ఆయా పాత్ర‌లు, వాటి ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేయడానికే ప‌రిమితమైంది.

ALSO READ | Raayan: ధనుష్ రాయన్ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలకు నో ఎంట్రీ సెన్సార్ సర్టిఫికెట్

రాయన్, అతడి షాప్, తమ్ముళ్లు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం..ఇలా బోరింగ్‌గా సాగుతూ ఉంటుంది.  హీరో ఒక మామూలు వ్యక్తిలా బతుకుతుంటాడు. అతడికి గొడవలంటే ఏమాత్రం పడవు. . ఒకవిధంగా భయం. తన తమ్ముళ్లు గొడవలకు వెళ్తున్నా వారిస్తాడు. అలాంటి వాడు ఒక సిచువేషన్ వచ్చినపుడు తనలోని ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు. ఇలాంటి టైంలో వ‌చ్చే ఆ స‌న్నివేశాలు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ల‌డంతోపాటు, సెకండాఫ్ పై ప్రేక్షకుల్లో ఆస‌క్తిని పెంచుతాయి. ఇక ఆ తర్వాత వచ్చే సీన్స్ ఆడియన్స్ దృష్టిని మరింత బలపరుస్తాయి. ధనుష్‌. రాయ‌న్‌కీ, త‌న చెల్లెలు దుర్గకీ మ‌ధ్య స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌. ముఖ్యంగా ఆస్ప‌త్రిలో ఉండే పోరాట ఘ‌ట్టాలు, సేతు మ‌నిషిని ఇంటికి పిలిపించి చంపి, టీ తాగ‌డం త‌దిత‌ర స‌న్నివేశాలకు థియేటర్లో ఆడియన్స్ చేత ఈలలు కొట్టిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రాయణః  వెండితెర మీద తన యాక్షన్ సీక్వెన్స్ తో రక్తసిక్తం చేసేశాడు.

అయితే కొన్ని సందర్భాల్లో ధనుష్ టేకింగ్ అదరహో అనిపిస్తుంది. హీరో ఎలివేషన్ కూడా సూపర్బ్ అనిపిస్తోంది. కానీ టేకింగ్ బాగుంటే.. ఎలివేషన్ పండితే సరిపోతుందా? లాజిక్ అనేది కూడా ముఖ్యం కదా? అనే ఫీలింగ్ కూడా కనిపిస్తోంది. ట్విస్టులు, ఎమోషన్స్ పై ధనుష్ ఇంకాస్తా దృష్టి పెట్టాల్సి ఉంటే రాయన్ మరోలా ఉండేది. 

ఎవ‌రెలా చేశారంటే:

స్టార్ హీరో ధ‌నుష్ తన సహజమైన న‌ట‌నతో ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి సీన్ లో కనిపించి మెప్పించాడు. ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. అండ‌ర్ ప్లే చేస్తూనే హీరోయిజం ప్ర‌ద‌ర్శించిన తీరు సినిమాకి పెద్ద అస్సెట్ అయింది. ఈ సినిమాతో తనలోని నటన మాత్రమే కాకుండా ఒక రా అండ్ రస్టిక్ డైరెక్టర్ ఉన్నాడనే విషయం అర్ధమవుతోంది. సందీప్‌కిష‌న్‌, కాళిదాస్ జ‌య‌రామ్ త‌మ్ముళ్లుగా ఒదిగిపోయారు. దుషారా విజ‌యన్ పాత్ర, ఆమె న‌ట‌న చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం.

ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా భ‌య‌పెడుతూనే చాలా చోట్ల న‌వ్వించాడు. శ‌ర‌వ‌ణ‌న్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి, ప్ర‌కాశ్‌రాజ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమర్‌ల పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే అయినా గుర్తుండిపోతాయి. ఎ.ఆర్‌.రెహమాన్ నేప‌థ్య సంగీతం. చాలా స‌న్నివేశాలు ఆయ‌న సంగీతంతో మరో స్థాయిలో పండాయి. ధ‌నుష్‌కి ద‌ర్శ‌క‌త్వం కంటే న‌ట‌న ప‌రంగానే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. సెకండాఫ్‌లో హాస్పిటల్‌లో జరిగే ఫైట్ సీన్‪‌లో దుశరా యాక్టింగ్‌కి విజిల్ వేయాలనిపిస్తుంది.  విలన్‌గా చేసిన ఎస్‌జే సూర్య యాక్టింగ్ బాగుంది. విలన్ గా తనలోని పవర్ ను చూపించాడు. శ‌ర‌వ‌ణ‌న్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి, ప్ర‌కాశ్‌రాజ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమర్‌ల పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే అయినా గుర్తుండిపోయేల నటించారు.

సాంకేతిక వర్గం:

ఎ.ఆర్‌.రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పుకోవాలి. రెండు పాటలు రా ఆడియన్స్ ను మెప్పిస్తాయి. చాలా స‌న్నివేశాలు ఆయ‌న సంగీతంతో మరో స్థాయిలో పండాయి. హీరోగా, డైరెక్టర్ గా రాయన్ సినిమాతో మరో కొత్త కోణాన్ని ధ‌నుష్‌ చూపించాడు.  సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం రాయన్ కు సరిగ్గా సరిపోయింది. సినిమాను చాలా స్టైలిష్ గాతెరకెక్కించాడు. సినిమా అంతటా ఒక సిగ్నేచర్ మూడ్ కనిపించేలా విజువల్స్ సాగుతాయి.