కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు టాలీవుడ్లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇటీవలే మారన్ సినిమాతో అలరించిన ధనుష్.. ఫ్యాన్స్కు మరో గిఫ్ట్ ఇచ్చాడు. హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' లో నటిస్తున్న ధనుష్ తాజాగా ఆ మూవీ గురించి అప్‌డేట్ పంచుకున్నాడు. ది గ్రే మ్యాన్ మూవీలో తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'ది గ్రే మ్యాన్.. జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌లో' అని క్యాప్షన్ రాశాడు. ఈ పోస్టర్‌లో కారు పైకప్పుపై నుదిటిపై రక్తంతో సీరియస్ లుక్‌లో ధనుష్ కనిపిస్తున్నాడు.
బాక్సాఫీసును షేక్ చేసిన అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్‌గేమ్ తదితర చిత్రాలను తెరకెక్కించిన ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో ‘ది గ్రే మ్యాన్’కు దర్శకత్వం వహించారు. ఇంగ్లీష్ యాక్టర్స్ ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్‌లతో కలిసి ధనుష్ ఈ మూవీలో యాక్ట్ చేశాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ ఏడాది జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2018లో వచ్చిన ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ చిత్రంతో హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ధనుష్కు.. ది గ్రే మ్యాన్ రెండో హాలీవుడ్ మూవీ.