గురువు 22.03.2023 నుంచి 21.04.2023 వరకు అర్ధాష్టమంలో తదుపరి 08.04.2024 ఉగాది వరకు పంచమంలో సంచారం. శని 22.03.2023 నుంచి 08.04.2024 ఉగాది వరకు తృతీయంలో సంచారం. రాహువు 22.03.2023 నుంచి 30.10.2023 వరకు లోహామూర్తిగా, 08.04.2024 ఉగాది పంచమంలో సంచారం. కేతువు 30.10.2023 నుంచి ఉగాది 08.04.2024 వరకు దశమ స్థానంలో రజితమూర్తిగా సంచారం.
ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. తెలియని విధంగా అనుకూలంగా అడ్డంకులు తొలగిపోతాయి. రైతు సోదరులు వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపార, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు ఆకస్మిక ఆదాయం. కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. రాజకీయ నాయకులకు శని బలంతో అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శ్రమ అనిపించినా తెలియకుండా అడ్డంకులు తొలగిపోతాయి. గతంలో వచ్చిన నష్టాలు తీరిపోతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. భూములు, ప్లాట్స్ కొనుటకు కొన్ని అవకాశాలు. విద్యార్థులకు అనుకూలం. వెండి, బంగారం, కాపర్, స్టీల్, సిమెంట్ రంగాల్లో ఉన్నవారు బాగుంటారు. చిన్న, పెద్ద పరిశ్రమల వారికి లాభసాటిగా ఉంటుంది. కెమికల్, ఫార్మా వారికి అధిక లాభాలు. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలకు అధిక లాభాలు రావు. నష్టాలు రావు. చిట్స్, ఫైనాన్స్, షేర్స్ వ్యాపారులకు ఏ రోజు, ఏమి జరుగుతుందో తెలియదు. మానసిక ఒత్తిడి. ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాజీపడి నష్టపోగలరు. తొందరపాటు మంచిది కాదు. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయట పడలేరు. ఏ విధంగా ఆలోచించినా లాభనష్టాలు బ్యాలెన్స్‌గా ఉన్నాయి. సంఘంలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. స్త్రీలను ‘అమ్మా’ అని సంబోధించాలి. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. టెన్షన్‌గా మాట్లాడొద్దు. ఉద్రేక పడేందుకు ఇది సమయం కాదు. చాలా విషయాల్లో సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం కావాలంటారు. సినిమా వారికి సామాన్యం. టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలం. మూలా నక్షత్రం వారు జాతి వైఢూర్యం ధరించాలి. చిత్రగుప్తుని దేవాలయంలో బుధవారం పూజలు చేయించాలి. వినాయకుడికి, సరస్వతీ దేవికి పూజలు తప్పనిసరిగా చేయాలి. అష్టోత్తర సహస్ర నామాలు చేయడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది. కనకధార స్తోత్ర పారాయణం చేయాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు జాతి కెంపు ధరించాలి. ఆదివార నియమాలు పాటించి, ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. సూర్య అష్టోత్తరం, సూర్య నారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. నవగ్రహ ప్రదక్షిణలు, జపములు, దానాలు, మహాన్యాస రుద్రాభిషేకం చేయించాలి. ప్రతి రోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు. అదృష్ట సంఖ్య 3.
ధనుస్సు రాశి మాస ఫలితాలు
చైత్ర మాసం: కుటుంబ సభ్యులకు మీరు అర్థం కారు. పిల్లల కోర్కెలు అర్థం కావు. అందరినీ కూర్చోబెట్టి పరిస్థితులు చేయి దాటిపోకుండా, రాజీ మార్గంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక సరస్వతీ దేవి జపం లేదంటే పూజలు చేయడం వల్ల సౌమ్యం ఏర్పడగలదు.
వైశాఖ మాసం: ఖర్చులను వాయిదా వేసుకోగలరు. చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మనస్తత్వం నచ్చకపోయినా అందరితో కలిసిపోయి ప్రశాంతంగా ఉండండి. చిత్రగుప్తుని దేవాలయంలో బుధవారం పూజలు చేయించండి.
జ్యేష్ఠ మాసం: వాహన ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి శకునం చూసి బయటకు వెళ్లాలి. తొందరపాటు నిర్ణయాలకు సమయం కాదు. అంకిత భావం కలిగి సామరస్య ధోరణితోనే రాణించగలరు. ఖర్చులను వాయిదా వేయండి. గ్రహారాధన అవసరం.
ఆషాఢ మాసం: జాయింటు వ్యాపారాలు భార్యాభర్తల బంధంలాగా ఉండాలి. ఏ చిన్న పని అయినా శ్రద్ధతో పూర్తి చేయాలి. మీ విషయాలు బయట వారికి తెలియనీయొద్దు. శివారాధనతో శాంతి ఉంటుంది.
అధిక శ్రావణ మాసం: ఎన్ని సమస్యలు ఉన్నా గుండె నిబ్బరంగా ఉంటుంది. పిల్లలతో వాదించడం వల్ల కుటుంబంలో చీలిక భావం ఏర్పడుతుంది. మాటకు మాట పెరగడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు.
నిజ శ్రావణ మాసం: బంధుమిత్రుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల వివాహ ప్రయత్నాలు ఫలించే సమయం. ఎవరి మనసులో ఏముందో గమనించి సమస్యలు రాకుండా ఆలోచించాలి.
భాద్రపద మాసం: వినాయకుడి పూజలు, లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల డబ్బుల ఇబ్బందులు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. తెల్లవారుజామున స్నానం చేయండి.
ఆశ్వయుజ మాసం: సామరస్య ధోరణి వల్ల కొత్త వ్యక్తుల పరిచయం. ఎవరికీ హామీ ఉండొద్దు. అమ్మవారి పూజలు చేస్తే సంతృప్తిగా ఉంటారు. నమ్మకంతో పని మొదలుపెడితే జరుగుతుంది.
కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. పైఅధికారులతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం. ఖర్చులు పెట్టే విషయంలో నేర్పు ఉండాలి. ఎదుటివారితో ఎలాంటి అహంకారం లేకుండా మాట్లాడితే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది.
మార్గశిర మాసం: తొందరపాటు లేకుండా భక్తితో గోవింద నామాలు చేయడం వల్ల ఎంతటి సమస్య అయినా ఇట్టే పరిష్కారం అవుతుంది. మీ ఓర్పే మీకు రక్ష. తక్కువగా మాట్లాడుతూ మౌనంగా ఉండటం వల్ల లాభం ఉంటుంది.
పుష్య మాసం: ఖర్చులు వాయిదా వేయండి. కుటుంబ సమస్యలు ఒక్కసారిగా మీదపడే అవకాశాలు ఉన్నాయి. వాదోపవాదాలకు సమయం కాదు. పిల్లల వల్ల బాధలు వస్తాయి. వారికి ఎలా ఉండాలో అర్థం కాదు. ప్రేమతో అందరినీ కలుపుకుని వెళ్లండి. దైవ పూజలు చేయండి.
మాఘ మాసం: గ్రహ సంచారంలో కొంత దోషం వలన సమస్యలు రావచ్చు. అలాగని భయపడొద్దు. నమ్మకంతో ముందుకు వెళ్లండి. భగవంతుడి నామ స్మరణతో అంతా మంచే జరగాలని కోరుకోండి.
ఫాల్గుణ మాసం: ప్రతి విషయంలో అనుకూలత ఉంటుంది. కార్యసాధన దిశగా ముందుకు సాగండి. అన్నింటా దైవబలంతో మీరు తలపెట్టిన కార్యాలు ముందుకు సాగుతాయి. పట్టుదలతో, ఉత్సాహంతో ముందుకు సాగండి. మధ్యలో ఆగిపోయిన పనులు నెరవేర్చుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.