- జిల్లాలో పెండింగ్‌లో 6,175 అర్జీలు
- నేటి నుంచి 86 టీమ్స్ ఫీల్డ్ విజిట్
- లిటిగేషన్ లేని వాటిని సెటిల్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
- మూడున్నరేండ్ల తర్వాత ముందడుగు
నిజామాబాద్, వెలుగు : పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమవుతుంది.ఈ నెల 9 వరకు వీలున్న ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు 2020, అక్టోబరు నుంచి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిశీలిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను వేరు చేశారు. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఇందుకోసం 86 టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.
పరిష్కారం దిశగా..
జిల్లాలోని 6,135 అర్జీలు పెండింగ్‌లో ఉండగా వీటి పరిష్కారం విషయమై ఆఫీసర్లు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు. భూమి రిజిస్ట్రేషన్ ముగిసి ధరణి రాకతో ముటేషన్లు ఆగిపోయిన 407 ఆర్జీలకు ఇప్పుడు మోక్షం లభించనుంది. వారంతా కొత్త పాస్‌బుక్స్ అందుకోనున్నారు.1633 జీఎల్ఎం (గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మేటర్) పరిష్కారం కానున్నాయి. ఫొటో కరెక్షన్, జెండర్, ఆధార్, క్యాస్ట్, డిజిటల్ సైన్, మిస్సింగ్ సర్వే నంబర్ తదితరాలు జీఎల్ఎం పరిధిలోకి వస్తాయి. వీటిని సులభంగానే పరిష్కరించే వీలున్నా గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.
633 సక్సెషన్ (డెత్ కేసు వారసులు), 69 ఎల్ఏజీ (ల్యాండ్ ఎక్వైరింగ్ పెండింగ్), 26 ఖాతా మెర్జింగ్(ఒకే గ్రామంలో రెండేసి రెవెన్యూ ఖాతాలున్న వాటిని ఒక్కచోట చేర్చి ఒకే పాస్‌బుక్ ఇవ్వడం), 33 టీఎం (నిషేధిత భూమి రికార్డులోకి పొరపాటున చేర్చిన సర్వే నంబర్లు) దరఖాస్తులను పరిష్కరించునున్నారు. అయితే నిషేధిత సర్వే భూములకు సంబంధించిన 365 ఆర్జీలను మాత్రం పక్కనబెట్టారు. 555 అర్జీలకు సంబంధించి పెండింగ్ కోర్టు కేసులుండగా వాటి జోలికి వెళ్లడంలేదు.
ఎకరం రూ.50 లక్షలలోపు రిజిస్ట్రేషన్ విలువ ఉన్న భూములకు సంబంధించిన దరఖాస్తులు జిల్లాలో, ఆపై విలువ ఉన్నవి సీసీఎల్ఏకు పంపాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే సీసీఎల్ఏకు రిఫర్ చేసే విలువైన భూములు జిల్లాలో లేనందున మెజార్టీ నిర్ణయాలు జిల్లా స్థాయిలోనే జరుగుతాయి.
కోర్టు వివాదం లేని వాటిపై ఫోకస్..
రకరకాల భూ వివాదాలకు సంబంధించి కలెక్టర్ వద్ద మొత్తం 6,135 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండగా వీటిలో నిజామాబాద్ డివిజన్లో 2,818, బోధన్‌లో 1,297, ఆర్మూర్ లో 2,020 ఆర్జీలు ఉన్నాయి. వీటిలో చాలా మేరకు మండల, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు పరిష్కరించేవే ఉన్నాయి. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ వీటి పరిష్కారంపై దృష్టి సారించలేదు. ఆఫీసర్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వకపోవడంతో వేల కొద్దీ అర్జీలు ఏండ్ల తరబడి మూలనపడ్డాయి. పూర్తిస్థాయిలో భూయాజమాన్య హక్కులు దక్కక అనేక మంది ఆందోళన చెందుతూనే ఉన్నారు.
2020, అక్టోబర్‌లో ధరణి పోర్టల్ ను తీసుకొచ్చాకే ఈ సమస్యలన్నీ వచ్చాయి. వేలాది మంది రైతులను గోస పెడుతున్న ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.యాజమాన్య హక్కులు దక్కకుండా పడుతున్న భూ యమజమానుల దరఖాస్తుల పరిష్కారానికి ఫస్ట్ ప్రయార్టీ ఇచ్చింది. కోర్టు వివాదాలు లేని ప్రతి ఆర్జీని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా కలెక్టర్ తహసీల్దార్, డీటీ, ఆర్ఐ, ఏఈవో, పంచాయతీ సెక్రెటరీ, కమ్యూనిటీ సర్వేయర్లతో టీమ్‌లను ఏర్పాటు చేశారు.