
- లక్షన్నరకుపైగా పెండింగ్ దరఖాస్తులు
- ఎన్నికల కోడ్ పేరిట స్పెషల్ డ్రైవ్‌కు బ్రేక్
- పరిశీలనకు నోచుకోని తహసీల్దార్ల రిపోర్టులు
- త్వరగా పరిష్కరించాలని కోరుతున్న భూబాధితులు
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిశీలన ఇంకా మొదలు కాలేదు. వివిధ భూసమస్యలపై సుమారు లక్షన్నరకుపైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా.. అందులో అత్యధికంగా కలెక్టర్ల లాగిన్లలోనే మూలుగుతున్నాయి. ధరణి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1న ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్.. లోక్ సభ ఎన్నికల కోడ్ రావడంతో అదే నెల 16న నిలిచిపోయింది.
దీంతో రెండు నెలల 20 రోజుల పాటు కోడ్ కారణంగా ధరణి అప్లికేషన్లను కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పక్కన పెట్టేశారు. తాజాగా కోడ్ ముగిసినా ఆఫీసర్లు అటువైపు చూడడం లేదు. దీంతో బాధిత రైతులు సోమవారం నుంచి మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగక తప్పని పరిస్థితి నెలకొంది.
ఆర్డీఓ, తహసీల్దార్ల స్థాయిలో క్లియర్
వివిధ భూసమస్యలకు సంబంధించి 2,46,536 దరఖాస్తులు బీఆర్ఎస్ సర్కారు హయాం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు స్పెషల్ డ్రైవ్ ద్వారా మరోసారి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో పెండింగ్ మ్యుటేషన్, గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్, నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్, పాస్ బుక్ డేటా కరెక్షన్, సక్సెషన్, పీవోబీ సమస్యలు, కోర్టు కేసులకు సంబంధించినవి ఉన్నాయి.
ఇందులో పట్టా, అసైన్డ్ భూముల విరాసత్ (పౌతీ), జీపీఏ, స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్, ఖాతా మెర్జింగ్ వంటి సమస్యలపై వచ్చిన అప్లికేషన్లను తహసీల్దార్లు క్లియర్ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్, ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, ఎన్నారైలకు సంబంధించిన భూముల సమస్యలతో పాటు కోర్టు కేసుల పరిష్కారం, మిస్సింగ్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తులను ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించారు.
లక్షన్నరకు పైగా అప్లికేషన్లు పెండింగ్
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా టీఎం 33 మాడ్యూల్లో పాస్ బుక్ డేటా కరెక్షన్ కోసం పెండింగ్‌లో ఉన్న 1,01,132 అప్లికేషన్లలో 27,047 అప్లికేషన్లు పరిష్కరించగా, ల్యాండ్ మ్యాటర్స్‌కు సంబంధించి 40,605 దరఖాస్తుల్లో 17,372 పరిష్కరించారు. అలాగే టీఎం 26 మాడ్యూల్లో కోర్టు కేసెస్ అండ్ ఇంటిమేషన్ కోసం పెండింగ్‌లో ఉన్న 27,622 అప్లికేషన్లలో 9,883 దరఖాస్తులను పరిష్కరించారు.
పీఓబీ సమస్యలపై వచ్చిన 26,539 దరఖాస్తుల్లో 5,786ను సెటిల్ చేశారు. ఇలా మొత్తం 2,46,536 దరఖాస్తుల్లో సుమారు 90 వేలకు పైగా పరిష్కారం కాగా కలెక్టర్ల స్థాయిలో పరిష్కరించాల్సిన అప్లికేషన్లు మరో లక్షన్నర పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటికి తహసీల్దార్లు, ఆర్ఐలు ఫీల్డ్ విజిట్ చేసి ఆర్డీఓల ద్వారా కలెక్టర్లకు నివేదికలు పంపారు. వాటన్నింటిని కలెక్టర్లు పరిశీలించి ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాల్సి ఉంటుంది. అందులోనూ కొన్ని రకాల అప్లికేషన్లను సీసీఎల్ఏ అప్రూవల్‌కు పంపాల్సి ఉంటుంది.
సమస్యల పరిష్కారానికి కలెక్టర్లపై ఒత్తిడి పెంచాలి
లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ధరణి స్పెషల్ డ్రైవ్ ను మళ్లీ మొదలుపెడితేనే పూర్తి స్థాయిలో భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మార్చి నెలలో కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించారు. కలెక్టర్ల దగ్గరే ఎక్కువ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్లపై ఒత్తిడి పెంచయినా రైతుల ఇబ్బందులు తీర్చాలి. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి.
మన్నె నర్సింహారెడ్డి, ధరణి సమస్యల వేదిక కన్వీనర్