6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినయ్​?

6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినయ్​?
  • 6 లక్షల ఎకరాల  అటవీ భూములు  ఎటుపోయినయ్​?
  • ధరణి పోర్టల్​లో లెక్కా పత్రం లేదు.. గుర్తించిన ధరణి కమిటీ 
  • అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్​ 53 లక్షల ఎకరాలు.. ధరణిలో ఉన్నది 47 లక్షల ఎకరాలే
  • ఆ 6 లక్షల ఎకరాల భూముల సంగతి తేల్చాల్సిందే
  • కమిటీ సమావేశంలో నిర్ణయం
  • సాగుకు యోగ్యంకాని 20 లక్షల ఎకరాలకూ రైతుబంధు వెళ్తున్నట్లు గుర్తింపు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాల ఫారెస్ట్​ ల్యాండ్​ ధరణి పోర్టల్​లో కనిపించడం లేదని ధరణి కమిటీ గుర్తించింది. ఈ భూములన్నీ ఎటు మారాయో.. ఎవరి పేర్ల మీద ఉన్నాయో తేల్చేందుకు సిద్ధమైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే సిఫారసులు చేయనుంది. ధరణి పోర్టల్​లోని సమస్యలు, పోర్టల్​ రీకన్​స్ట్రక్షన్​పై సీసీఏల్​ఏ కన్వీనర్​ నవీన్​ మిట్టల్​ ఆధ్వర్యంలో ఏర్పాటైన ధరణి కమిటీ శనివారం సెక్రటేరియెట్​లో ఫారెస్ట్​, అగ్రికల్చర్​ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఫారెస్ట్​ ల్యాండ్స్​పై విస్తృతంగా చర్చించింది. ఫారెస్ట్​ యాక్ట్​లో సెక్షన్​ 15  ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు  53 లక్షల ఎకరాలుగా ఉన్నది. 

అయితే ధరణి పోర్టల్​లో అటవీ భూముల లెక్క 47 లక్షల ఎకరాలు మాత్రమే చూపిస్తున్నది. ఇంకో 6 లక్షల ఎకరాల లెక్క తేలడం లేదు. ఇందులో కొన్ని భూములు అన్​సైన్డ్​ లిస్ట్​లో చూపిస్తున్నాయి. మరికొన్ని ఏ రకంగా నమోదయ్యాయో లెక్కా పత్రం లేదు. ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ దగ్గర ఉన్న భూముల లెక్కలతో.. ధరణి పోర్టల్​లో ఉన్న అటవీ భూముల లెక్కతో వివరాలు సరిచేసేందుకు వెంటనే యాక్షన్​ ప్లాన్​ రూపొందించాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్​వోఎఫ్​ఆర్​ పట్టాలు ఇచ్చిన వాటికి సంబంధించి చాలా చోట్ల సక్సెషన్​ సమస్యలు వస్తున్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది. 

ఆ భూములకూ రైతుబంధు?

రాష్ట్రంలో ప్రస్తుతం 72 లక్షల మంది రైతులకు 1.59 కోట్ల ఎకరాలకు రైతు బంధు తీసుకుంటున్నారని ధరణి కమిటీ భేటీలో వ్యవసాయ శాఖ వెల్లడించింది. వ్యవసాయ శాఖ తరఫున 2018 నుంచి ఆన్​లైన్​లో క్రాప్​ బుకింగ్​ చేస్తున్నామని, అయితే దాదాపు 20 లక్షల ఎకరాల్లో అన్​ కల్టివేటెడ్  ఉంటుందని పేర్కొంది. దీనికి కూడా రైతుబంధు అందుతున్నది.  బిల్డింగ్స్​కు, హైవేల్లో పోయిన ల్యాండ్స్​, ప్రాజెక్టుల్లో, రోడ్లకు, ఇతరత్రా ప్రభుత్వ అవసరాలకు మళ్లిన భూములు ఇందులో ఉన్నట్లు చర్చకు వచ్చింది. తమకు కేవలం బ్యాంకు లింకేజీ సౌకర్యం కల్పించారని, నాన్​ అగ్రికల్చర్​కు రైతుబంధు వెళ్లకుండా వెరిఫై చేసే అవకాశం లేదని ధరణి కమిటీకి వ్యవసాయ శాఖ వివరించింది.

 అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్ల(ఏఈవో)తో ఫీల్డ్  వెరిఫై చేసి ఏ ల్యాండ్స్​ సాగుకు యోగ్యం కావో ధరణి పోర్టల్​లో ఎంట్రీ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందని ధరణి కమిటీ అభిప్రాయపడింది. సమావేశంలో ధరణి కమిటీ సభ్యులు రేమండ్​ పీటర్​, లచ్చిరెడ్డి, కోదండరెడ్డి, భూమి సునీల్​, మధుసూదన్​తో పాటు వ్యవసాయ, ఫారెస్ట్​ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే  వచ్చే నెల 3న మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్​లో ధరణి కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఎండోమెంట్, వక్ఫ్, సర్వే అండ్ సెటిల్మెంట్ అధికారులతో భేటీ కానుంది.