దేశంలోనే ధరణి పెద్ద స్కామ్..బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు కొల్లగొట్టారు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

దేశంలోనే ధరణి పెద్ద స్కామ్..బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు కొల్లగొట్టారు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • సీబీఐ విచారణ ఎందుకు జరిపించట్లేదని ప్రశ్న..

హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి పెద్ద ఎత్తున భూములను కొల్లగొట్టిందని, ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్​ అని అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సాఫ్ట్​వేర్​తో బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలను తమ పేర్ల మీదకు మార్చుకున్నారని, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు బాధితులు అయ్యారని ఆయన తెలిపారు. ధరణి పోర్టల్ అన్యాయాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిందన్నారు. శుక్రవారం అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చలో ఏలేటి మాట్లాడారు.

ధరణిలో రూ. 2.5 లక్షల కోట్ల స్కాం జరిగిందని ఇటీవల డిప్యూటీ సీఎం అసెంబ్లీలో ప్రకటించారన్నారు. ధరణి స్కాంపై సీబీఐ విచారణ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ స్కామ్ లో అధికార పార్టీకి కూడా వాటా ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్కీ భాస్కర్ మూవీలోని ఓ సన్నివేశాన్ని ఏలేటి గుర్తు చేశారు. భూభారతి ప్లేస్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే మంచిదన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని, వేల ఎకరాల అసైన్డ్ భూములు మాయం అయ్యాయన్నారు.

ఓఆర్ఆర్ పై సిట్ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని, ధరణి లోపాలు, మాయమైన భూముల వివరాలు ఎందుకు బయట పెట్టట్లేదని ప్రశ్నించారు. ధరణితో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు దోచుకున్నారని.. వీటిని బయటకు తీసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారని ఏలేటి గుర్తు చేశారు.