బయటకొస్తున్న ధరణి తప్పులు.. భూ సమస్యలు కుప్పలు తెప్పలు.. ‘భూ భారతి’ పైలట్‌‌‌‌ గ్రామాల్లో అప్లికేషన్ల వెల్లువ

బయటకొస్తున్న ధరణి తప్పులు.. భూ సమస్యలు కుప్పలు తెప్పలు.. ‘భూ భారతి’ పైలట్‌‌‌‌ గ్రామాల్లో అప్లికేషన్ల వెల్లువ
  • సాదాబైనామా, కొత్త పాస్‌‌‌‌బుక్కులకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువ
  • ములుగు, కామారెడ్డి, నారాయణపేట, ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సులు
  • ములుగు జిల్లా నర్సాపూర్‌‌‌‌లో 650కి పైగా ఫిర్యాదులు

జయశంకర్‌‌‌‌భూపాలపల్లి/నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు: భూ భారతి పైలట్‌‌‌‌ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు కుప్పలు తెప్పలుగా బయటికొస్తున్నాయి. రైతుల నుంచి అప్లికేషన్లు వెల్లువెత్తుతుండడంతో ధరణిలో జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌‌‌‌ మండలంలోని నర్సాపూర్‌‌‌‌లో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 650కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో 308, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో 112, నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో 42 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా సాదాబైనామా, కొత్త పాస్‌‌‌‌బుక్‌‌‌‌లు ఇవ్వాలన్న అభ్యర్థనలే ఉన్నాయి. అసలు ఉన్న భూ విస్తీర్ణం కన్నా పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌లో తక్కువ విస్తీర్ణం నమోదు అయిందంటూ పలువురు అప్లికేషన్లు ఇచ్చారు.

ములుగు జిల్లా నర్సాపూర్‌‌‌‌లో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్‌‌‌‌ దివాకర టీఎస్‌‌‌‌ పాల్గొన్నారు. నర్సాపూర్‌‌‌‌ రెవెన్యూ గ్రామ పరిధిలో నర్సాపూర్‌‌‌‌, తిమ్మాపూర్, శాతరాజుపల్లి, కేశవాపూర్, రాజేశ్వరరావుపల్లి, ఇంచెంచెరువుపల్లి, సింగూర్‌‌‌‌కుంటపల్లి, పాపయ్యపల్లి గ్రామాలకు చెందిన రైతులు 650 అప్లికేషన్లు ఇచ్చారని తహసీల్దార్‌‌‌‌ గిరిబాబు తెలిపారు. ఇందులో పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌ రాలేదని 222, పాస్‌‌‌‌బుక్‌‌‌‌లో తప్పులు సవరించాలని 30, సర్వే నంబర్‌‌‌‌లో భూ విస్తీర్ణంలో తేడాలు సవరించాలని 37, సాదాబైనామా కింది కొనుగోలు చేసిన భూములకు పాస్ బుక్స్‌‌‌‌ ఇవ్వాలని 260, అసైన్డ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ పట్టా మార్పిడి, సర్వైవల్‌‌‌‌ డిటెక్షన్‌‌‌‌కు సంబంధించి 8, ఇతర సమస్యలపై 52 దరఖాస్తులు వచ్చాయి.

భర్త చనిపోయిన కోడలి పేరు మీదకు.. మామ పేరున ఉన్న భూమి మార్చడం, డైరెక్ట్‌‌‌‌గా మనవలు, మనవరాళ్ల పేరు మీద పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌ ఇవ్వాలని అప్లికేషన్లు వచ్చాయి. తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు పేరు మీద సగం భూమి ఎక్కించి, మరో కొడుకు పేరిట పాస్‌‌‌‌బుక్‌‌‌‌ ఇవ్వకపోవడం, 20 ఏండ్ల కన్నా ముందే సాదాబైనామా కింద భూమి కొన్నా.. ధరణిలో పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌ రాలేదన్న అప్లికేషన్లు వచ్చాయి. ఈ సదస్సులో ఏకంగా 650కి పైగా దరఖాస్తులు రావడంతో ఆఫీసర్లే ఆశ్యర్యపోయారు. 
    
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోతాయిపల్లి, బోనాల్‌‌‌‌ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి. పోతాయిపల్లిలో 261, బోనాలులో 47 ఫిర్యాదులు వచ్చాయి. సాదాబైనమాలు, వారసత్వ, ఫౌతీకేసులు, ఫారెస్ట్, రెవెన్యూ వివాదాలు, రికార్డుల్లో హెచ్చుతగ్గులు వంటి సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. సదస్సులో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ విక్టర్‌‌‌‌, ఆర్డీవో ప్రభాకర్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ చెప్పారు. పోతాయిపల్లిలోని సర్వే నంబర్‌‌‌‌ 162లో ఉన్న 185 ఎకరాల భూమిపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతోంది. 
    
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో జరిగిన భూభారతి సదస్సులో 112 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా సాదాబైనామా, పట్టాదారు పాస్‌‌‌‌బుక్‌‌‌‌లో విస్తీర్ణం ఎక్కువ, తక్కువలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ధరణి పోర్టల్‌‌‌‌ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, రెవెన్యూ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం కారణంగా ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు కావడం, భూమి లేకపోయినా పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌ ఇవ్వడం, భూమి ఉన్నా పాస్‌‌‌‌బుక్స్‌‌‌‌ ఇవ్వకపోవడం వంటి తప్పులు జరిగాయని బాధితులు వాపోయారు.
    
నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్, పెదిరిపాడులో గురువారం ‘భూ భారతి’ రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. రెండు గ్రామాల్లో కలిపి 42 అప్లికేషన్లు వచ్చాయి.  ఖాజీపూర్‌‌‌‌లో 25 అప్లికేషన్లు రాగా ఇందులో ఎక్కువగా విరాసత్, వారసత్వ భూములకు సంబంధించినవే ఉన్నాయి. పెదిరిగిపాడులో 17 అప్లికేషన్లు రాగా మ్యుటేషన్‌‌‌‌కు సంబంధించిన ఇష్యూలే ఎక్కువ ఉన్నాయి.

ప్రతీ దరఖాస్తును పరిశీలించి సమస్యను పరిష్కరిస్తాం 
భూ భారతి రెవెన్యూ సదస్సులో రైతులు ఇచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. మండల స్థాయి అధికారులు ధరఖాస్తు పరిశీలించడమే కాకుండా ప్రతి విషయాన్ని కలెక్టర్‌‌‌‌ స్థాయిలో పరిశీలించి భూములకు హద్దులు ఏర్పాటు చేస్తాం. భూములపై హక్కు పత్రాలు పొందడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది.

దివాకర టీఎస్‌‌‌‌, ములుగు కలెక్టర్‌‌‌‌

పాస్‌‌‌‌బుక్‌‌‌‌ కోసం ఆరేండ్లుగా తిరుగుతున్నా..
నా పేరు పోతరాజు కొమురయ్య, మాది కేశపూర్‌‌‌‌ గ్రామం. నేను 2019లో 1167/డి సర్వే నంబర్‌‌‌‌లో 1.22 ఎకరాల భూమిని కొన్నా. ధరణిలో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేశారు. కానీ కరోనా వల్ల అప్పుడు మ్యుటేషన్‌‌‌‌ కాలేదు. కరోనా తర్వాత మ్యుటేషన్‌‌‌‌ కోసం ధరణిలో అప్లై చేశాను. ఇంకా పాస్‌‌‌‌బుక్‌‌‌‌ ఇవ్వలేదు. రెండేళ్లకోసారి అప్లై చేసుకుంటున్నా పాస్‌‌‌‌ బుక్‌‌‌‌ రాలేదు. ఇప్పుడు భూభారతిలో అప్లై చేద్దామని వచ్చాను. దీని ద్వారా అయినా నా పేరున పాస్‌‌‌‌ బుక్‌‌‌‌ వస్తుందని ఆశిస్తున్నా.

16 ఏండ్ల కింద కొన్న భూమికి పట్టా కాలే
నా పేరు కల్లపల్లి సంపత్, నాది రాజేశ్వరరావుపల్లి గ్రామం. సర్వే నంబర్‌‌‌‌ 141/1లో 34 గుంటల భూమిని 2009లో మా నాన్న కల్లపల్లి రాజయ్య సాదాబైనామా కింద కొన్నాడు. 16 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్నాం. పాస్‌‌‌‌బుక్‌‌‌‌ కోసం మా నాన్న చాలా ఏండ్లుగా రెవెన్యూ ఆఫీస్‌‌‌‌ చుట్టూ తిరిగాడు. రెండు సార్లు ధరణిలో కూడా చేశాం. అయినా పాస్‌‌‌‌బుక్‌‌‌‌ రాలేదు. ఇప్పుడు మా నాన్న పేరిట పాస్‌‌‌‌బుక్‌‌‌‌ ఇవ్వాలని కోరుతూ మళ్లీ దరఖాస్తు ఇచ్చిన.