ప్రభుత్వ భూమి.. ఫ్యామిలీ పేరిట పట్టా!

ప్రభుత్వ భూమి.. ఫ్యామిలీ పేరిట పట్టా!
  • సూర్యాపేట జిల్లాలో ధరణి ఆపరేటర్ల అక్రమాలు 
  • హుజుర్ నగర్ లో 36.23 ఎకరాలు కుటుంబసభ్యులపై నమోదు చేసిన ఆపరేటర్ 
  • కోదాడలో డబ్బులు తీసుకుని   పట్టాలు చేసిన మరో ఆపరేటర్ 
  • కలెక్టర్ ఆదేశాలతో రికార్డుల తనిఖీల్లో వెలుగులోకి వాస్తవాలు 
  • ఇద్దరు ఆపరేటర్ల తొలగింపు

సూర్యాపేట, వెలుగు : ధరణి పోర్టల్ ను ఆసరాగా చేసుకుని రెవెన్యూ ఆఫీసర్లు, ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌‌ చేసి దండుకుంటున్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములను సైతం వదలడంలేదు. ఏదో ఒక  సాకు చూపుతూ రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు.  పైసలు ఇస్తేనే పని పూర్తి చేసే పరిస్థితి సూర్యాపేట జిల్లాలోని తహసీల్దార్ ఆఫీసుల్లో నెలకొంది. ఇటీవల జిల్లాలో రెవెన్యూ ఆఫీసర్లపై ఫిర్యాదులు వస్తుండడంతో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దృష్టి సారించారు. ఫిర్యాదులపై తహసీల్దార్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తుండగా ధరణి ఆపరేటర్ల  అక్రమాలు భారీగా బయటకు వస్తున్నాయి. 

కుటుంబ సభ్యులపై 36.23 ఎకరాలు పట్టా

జిల్లాలోని హుజూర్‌‌నగర్‌‌ మండలం బూరుగడ్డ రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వే నం. 439లో 164 .12 ఎకరాలు,  సర్వే నం. 604 లో  164 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి.  ఆయా సర్వే నంబర్లలో వేణుగోపాలస్వామి ఆలయం, గోపాలపురం శివారు, పెద్దచెరువు, నల్లచెరువు ప్రాంతాల్లో 36.23 ఎకరాల భూమిని కొందరు రైతులు సాగు చేస్తున్నారు. అక్కడ ధర ఎకరం రూ.50 లక్షలపైనే  ఉంది. కాగా.. ఆయా సర్వే నంబర్లలోని రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హుజూర్ నగర్ తహసీల్దార్ ఆఫీసులోని ధరణి ఆపరేటర్ జగదీశ్ ​తన కుటుంబ సభ్యుల పేరు మీద పట్టా చేశాడు.  సర్వే. 439/55/5లో 8.38 ఎకరాలు, 604/116లో 7.32 ఎకరాలు.. మొత్తం 15.07 ఎకరాలను పచ్చిపాల ప్రియాంక పేరు మీద చేశాడు.

అదేవిధంగా సర్వే నం. 604/ 58లో 4.38 ఎకరాలను తన సోదరి మడిపల్లి స్వప్న పేరు మీద మార్చాడు. అలాగే  హుజూర్‌‌నగర్‌‌ రెవెన్యూ సర్వే నం. 602/102/1లో 0.01 గుంట, 608/16లో 8.0 ఎకరాలు, సర్వే నం. 1,041/144లో 6.25 ఎకరాలు,  సర్వే నం. 1,041/368/3/2/5లో 0.10 గుంటల భూమిని ఆపరేటర్ జగదీశ్​ తన తల్లి ఇందిర పేరు మీద పట్టా చేశాడు. ఇలా మొత్తంగా 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని జగదీశ్ తన ఫ్యామిలీ మెంబర్స్  పేరు మీద ధరణి పోర్టర్‌‌లో నమోదు చేశాడు.

ప్రభుత్వ భూమి పట్టా మార్పుపై వచ్చిన ఫిర్యాదుతో  కలెక్టర్‌‌ ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాసులు విచారణ జరిపి.. నాలుగు రోజుల కిందట నివేదిక అందించారు. అందులో.. 2019 నవంబరు నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో భూమి బదలాయింపు జరిగినట్లు తేలింది. ఆయా భూములపై రైతు బంధు , రైతు రుణమాఫీ  కూడా పొందుతున్నట్టు వెల్లడైంది. దీంతో కలెక్టర్‌‌ ఆదేశాలతో ధరణి ఆపరేటర్‌‌ జగదీశ్ ను తొలగించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు జగదీశ్ ను అరెస్ట్‌‌ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

“ హుజూర్‌‌నగర్‌‌ తహసీల్దార్‌‌ ఆఫీసులో ధరణి ఆపరేటర్‌‌ వత్సవాయి జగదీశ్​తన కుటుంబసభ్యులు, బంధువుల పేరు మీద 36. 23ఎకరాల ప్రభుత్వ భూమిని నమోదు చేశాడు. ఆపై రైతుబంధు, రైతు రుణమాఫీ సైతం పొందాడు. 2019--– 20లో ఆఫీసులో పనిచేసిన ఉన్నతాధికారుల అండదండలతోనే ఆపరేటర్‌‌ జగదీష్‌‌ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడైంది.’’ 

“ కోదాడ తహసీల్దార్ ఆఫీసులోని ధరణి ఆపరేటర్ వెంకయ్య నాలా కన్వర్షన్ కోసం రైతుల వద్ద రూ. లక్షల్లో డిమాండ్ చేశాడు. దీనిపై కొద్ది నెలల కింద రైతులు జిల్లా కలెకర్ట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టగా ఆపరేటర్ వెంకయ్య అవినీతి బాగోతం బయటపడింది.’’  

తహసీల్దార్  ఆఫీసు ఖర్చుల పేరిట వసూళ్లు

కోదాడ మండలంలో  32 ఎకరాల వ్యవసాయ భూమి నాలా కన్వర్షన్ కు ధరణి ఆపరేటర్  డబ్బులు అడుగుతుండటంతో కొందరు రైతులు కలెక్టర్‌‌ తేజస్‌‌ నందలాల్‌‌ పవార్‌‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి కోదాడ తహసీల్దార్ ఆపరేటర్‌‌ వెంకయ్యను గత జులై 24న సస్పెండ్‌‌ చేశారు. అయితే.. ధరణి ఆపరేటర్  కలెక్టర్ కు రాసిన రిపోర్ట్ జిల్లాలో సంచలనంగా మారింది. ఆఫీస్ ఖర్చులకు రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇలా నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలతో స్టేషనరీ, ఏసీలు, ఫర్నిచర్ కొన్నట్టు.. ఇదంతా తహసీల్దార్ కు తెలిసే చేశామంటూ ధరణి ఆపరేటర్‌‌ వెంకయ్య కలెక్టర్‌‌కు పంపిన లేఖలో పేర్కొన్నాడు. ధరణి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే రైతుల నుంచి వసూలు చేసి ఆఫీసు ఖర్చులు, అవసరాలు తీరుస్తున్న ట్లు ఆపరేటర్ పేర్కొనడం  చర్చనీయాంశమైంది. ఆఫీసులో జరిగే అవినీతి, అక్రమంగా వసూలు చేసిన డబ్బుల గురించి కూడా  ఆయన లేఖలో వివరించారు.  దీంతో కోదాడ రెవెన్యూ ఆర్ఐను సస్పెండ్ చేయగా తహసీల్దార్ ను బదిలీ చేశారు.  

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదు. భూముల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. హుజూర్ నగర్ లో ప్రభుత్వ భూములను కుటుంబ సభ్యుల పేరుపై బదలాయింపు సమయంలోని అధికారులపైన విచారణ కొనసాగుతుంది. నివేదిక ఆధారంగా త్వరలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.  
-  తేజస్ నంద్ లాల్ పవార్, సూర్యాపేట జిల్లా కలెక్టర్