- రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 713 మంది సిబ్బంది
- పట్టించుకోని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ
- బిల్లులు ఇవ్వకుండా 9 నెలల జీతం ఆపిన గత ప్రభుత్వం
కరీంనగర్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 713 మంది ‘ధరణి’ పోర్టల్ ఆపరేటర్లకు10 నెలలుగా జీతాలు పడలేదు. బీఆర్ఎస్ప్రభుత్వం తొమ్మిది నెలల జీతం పెండింగ్పెట్టగా, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ప్రభుత్వంలో మరో నెల జీతం పెండింగ్ పడింది. దీంతో ఆపరేటర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, అప్పులు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కార్మిక శాఖ నిబంధనల ప్రకారం తమకు కనీసం వేతనంతోపాటు పీఎఫ్/ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, తమని పట్టించుకోని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
2018లో నియామకం
రాష్ట్రంలోని భూరికార్డుల ప్రక్షాళన కోసం 2018, మే నెలలో అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఈ సెంట్రిక్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రిక్రూట్చేసుకుంది. తహసీల్దార్ ఆఫీసుతోపాటు జిల్లా కలెక్టరేట్లు, సీసీఎల్ఏలోని ధరణి హెల్ప్ డెస్కుల్లో వారిని నియమించింది. అలా రాష్ట్ర వ్యాప్తంగా 713 మంది ఆపరేటర్లు పని చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లందరికీ పారాడిగ్మ్ ఐటీ సొల్యూషన్స్ ద్వారా జీతాలు అందుతున్నాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో డేటా ఎంట్రీ చేసిన వీరే.. ధరణి పోర్టల్ రెడీ అయినప్పటి నుంచి రిజిస్ట్రేషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలుత వీరికి రూ.రూ.9,875 జీతం ఇవ్వగా, ప్రస్తుతం రూ.11,070 ఇస్తున్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఏనాడు నెలనెలా జీతం తీసుకున్నది లేదని, ఎప్పుడూ ఆర్నెళ్ల నుంచి 8 నెలల జీతాలు పెండింగ్ లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 నెలల జీతం పెండింగ్ పెట్టారని, తమ ఇబ్బందులను కొత్త ప్రభుత్వమైనా పట్టించుకోవాలని ఆపరేటర్లు కోరుతున్నారు.
నో.. పీఎఫ్, ఈఎస్ఐ
ప్రభుత్వ విభాగాల్లో సిబ్బందిని నియమించిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. కానీ ధరణి ఆపరేటర్లకు ఆ సౌకర్యాలు లేవు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే తమ జేబులో నుంచే ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. లేబర్ లా ప్రకారం తమకు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయాలని ఆపరేటర్లు కోరుతున్నారు.
సీఎం రేవంత్ స్పందించి జీతాలు చెల్లించాలి
మాకు జీతాలు రాక 10 నెలలవుతోంది. మా కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కొత్త ప్రభుత్వమైనా పెండింగ్ జీతాలు ఇవ్వాలి. సీఎం రేవంత్స్పందించి, ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగుల్లాగే మాకు కూడా ప్రతి నెలా 5వ తారీఖులోపు జీతాలివ్వాలి. ధరణి కంప్యూటర్ ఆపరేటర్లలో మహిళలు కూడా ఉన్నారు. వారికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.
-చెన్నగాని పురుషోత్తం, రాష్ట్ర అధ్యక్షుడు, ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్