![భూభారతి రూల్స్‌కు ధరణి పోర్టల్ బ్రేక్.. యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు..!](https://static.v6velugu.com/uploads/2025/02/dharani-portal-breaks-bhubharati-rules_VdULKptGq1.jpg)
- భూభారతి రూల్స్‌కు ధరణి పోర్టల్ బ్రేక్..!
- నెల గడుస్తున్నా చట్టానికి రూల్స్ మొదలుపెట్టని అధికారులు
- 40–-45 రోజుల్లో తెస్తామని గతంలో వెల్లడి
- రూల్స్‌కు ధరణి పోర్టల్
- సాఫ్ట్‌వేర్‌కు లింక్ పెట్టి ఆలస్యం
- యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు
హైదరాబాద్, వెలుగు: భూ భారతి చట్టానికి రూల్స్ మరింత ఆలస్యం అవుతున్నాయి. నెలన్నర గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా అధికారులు కసరత్తు చేయడం లేదని తెలుస్తున్నది. భూ భారతి చట్టం అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా 45 రోజుల్లోగా రూల్స్తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పకడ్బందీగా ఉంటాయని తెలిపింది. పోర్టల్‌లో కూడా 35 మాడ్యుల్స్‌ను ఆరుకు కుదిస్తామని.. ఎలాంటి గందరగోళం లేకుండా రైతులకు యూజర్‌ఫ్రెండ్లీగా కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అదే ధరణి పోర్టల్ భూ భారతి రూల్స్‌ను ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికిప్పుడు కొత్త పోర్టల్‌ను రెడీ చేసే అవకాశం లేకపోవడంతో ఉన్న ధరణి పోర్టల్‌లోనే మార్పులు చేయాలని నిర్ణయించారు. దీంతో సాప్ట్‌వేర్‌లో మార్పులు చేయడం ఇబ్బంది అవుతుందంటూ భూ భారతి రూల్స్‌ను కూడా లేట్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రూల్స్‌ను తీసుకొస్తే వెంటనే అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్‌కు భూ భారతి రూల్స్‌కు సంబంధం ఉన్నందున రూల్స్ ఫ్రేమ్ చేశాక.. పోర్టల్‌లో మార్పులు చేయకపోతే ఉపయోగం ఉండదనే పేర్కొంటున్నారు.
అయితే పోర్టల్‌కు సంబంధం లేకుండా కూడా కొన్ని మార్గదర్శకాలు అమలు చేయొచ్చని సమాచారం. అయితే అటు ధరణి సాఫ్ట్ వేర్లో మార్పులు చేస్తూ ఇటు భూభారతి చట్టానికి రూల్స్ తీసుకురావడంలో వేగంగా ముందుకు వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ధరణి పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా వస్తే చాలా మంది రైతులకు తిప్పలు తప్పుతాయని అంటున్నారు. పైగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకువచ్చే కసరత్తును ప్రభుత్వం ప్రారంభించి వదిలేసింది. రూల్స్‌లో గ్రామ అధికారులకు కూడా రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించాల్సి ఉన్నది.
ధరణిని సెట్ చేసేందుకు తిప్పలు
రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రైవేట్ఏజెన్సీ నుంచి పూర్తిగా ఎన్ఐసీ అధీనంలోకి గత డిసెంబర్ నెలఖారులో తీసుకువచ్చింది. అప్పటి నుంచి సర్వర్ ప్రాబ్లమ్స్‌తో ఎన్ఐసీ సతమతవుతున్నది. అప్పటి నుంచి ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి.. ప్రైవేట్ కంపెనీ ఎన్ఐసీకి పూర్తిగా సహకరించడం లేదు. ఇప్పటికిప్పుడు కొత్త పోర్టల్ సొంతంగా తయారు చేద్దామంటే అదీ కుదరని పరిస్థితి నెలకొన్నది. ధరణి మాదిరి కొత్త పోర్టల్ తయారు చేయాలంటే కనీసం 7 నెలల టైం పడుతుందని అంటున్నారు.
Also Read :- కొత్త రేషన్ కార్డులకు మీసేవలోనూ దరఖాస్తులు
ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌లో భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా మార్గదర్శకాలు తీసుకువచ్చి మార్పులు చేయాల్సి ఉన్నది. ఇప్పుడున్న చిన్న, చిన్న సమస్యలను పరిష్కరించడమే కష్టంగా ఉన్న టైంలో భూ భారతి రూల్స్ తెచ్చి.. ధరణి సాప్ట్‌వేర్‌లో అందుకు అనుగుణంగా మార్పులు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఆన్లైన్లో పహాణీ రికార్డుల నిర్వహణ వంటివన్నీ కొత్త చట్టం ప్రకారం చేయాల్సి ఉంది. అయితే ఇందుకు రూల్స్ ప్రధానం కానున్నాయి. 13బీ, 38ఈ, ఓఆర్‌సీ, లావణి పట్టా వంటి మార్గాలలో భూమి వచ్చినప్పుడు పాస్ పుస్తకాలు ఆర్డీఓ ద్వారా ఇచ్చే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తోంది.
దీనికి రూల్స్ కావాలి. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న సుమారు 9 లక్షల పైగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు సంబంధించి కూడా రూల్స్‌లోనే స్పష్టత దొరకనుంది. గ్రామ కంఠం, ఆబాదీలకు కూడా హక్కుల రికార్డు, ట్రిబ్యునళ్లు, అప్పీళ్ల వ్యవస్థ, ఏ రైతైనా ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకోలేని పరిస్థితి ఉంటే, అలాంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సాయం అందించడం వంటివి భూ భారతి చట్టం రూల్స్ లో ముఖ్యమైనవి ఉన్నాయి.