ధరణి పోర్టల్ పాత దానికే పైపై పూతలు

ధరణి పోర్టల్​తో కొత్తగా సమస్యలు తీరిందేం లేదు

సీఎం కేసీఆర్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ధరణి పోర్టల్ అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ కాదు. ఎలాంటి వివాదాలు లేని భూముల వివరాలు ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంటాయేగానీ అన్ని సమస్యలకు అదే పరిష్కారం చూపదు. వాస్తవానికి భూరికార్డుల అప్ డేషన్, కంప్యూటరైజేషన్ అనేది కేసీఆర్ ప్రకటించిన్నట్లు కొత్త కార్యక్రమం కానేకాదు. 2008లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. దస్తావేజుల్లో ఉన్న రికార్డులను కంప్యూటరీకరించాలని రాష్ట్రాలను ఆదేశించింది. 2014లో బీజేపీ ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ను డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్2.0 గా మార్చింది. ఇందుకు కావాల్సిన నిధులను కూడా విడుదల చేసింది. దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల్లో భూరికార్డుల డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ 90 శాతం పైగా పూర్తయ్యింది. దేశం మొత్తంలో ఒక్క తెలంగాణలోనే భూరికార్డుల డిజిటలైజేషన్ చేపట్టినట్లు సీఎం ప్రకటించడం హాస్యాస్పదం. ధరణితో ఆయన రాసిన కొత్త చరిత్ర ఏం లేదు. భూముల సమస్యలు, వివాదాలు, అధికారుల అవినీతి, నాయకుల కబ్జాలు ఏమాత్రం సమసిపోలేదు.

వీఆర్వోలను తీసేస్తే అవినీతి పోతుందా?

రెవెన్యూ శాఖలో అవినీతికి కారకులుగా ముద్ర వేసి వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. వీఆర్వోలే అవినీతిపరులు ఆ శాఖలోని మిగతా ఉద్యోగులు, ఇతర శాఖల్లోని వాళ్లు సుద్ధపూసలన్నట్లు ప్రచారం చేసింది. కానీ, వాస్తవాలు మరోలా ఉన్నాయి. వీఆర్వోలతోపాటు ఏసీబీకి చిక్కిన తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు, అడిషనల్ కలెక్టర్లు పదుల సంఖ్యలో ఉన్నారు. పోలీస్, మున్సిపల్, ఇంజనీరింగ్ శాఖల్లోనూ భారీగా ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం వీఆర్వో వ్యవస్థను రద్దుతో మొత్తం అవినీతిని కూకటివేళ్లతో పెకిలించినట్లుగా గొప్పలు చెప్పుకుంటోంది. అవినీతి రోగానికి పైపై పూతలు పూస్తూ భూముల సమస్యలకు పరిష్కారం చూపకుండా ‘ధరణి’తో దాటవేయాలని చూస్తోంది.

ధరణిలోకి ఎక్కని భూముల సంగతి ఏంది ?

భూముల సమస్యలకు, వివాదాలకు సర్వరోగ నివారిణిగా ధరణిని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. తీరా అందులో వివరాలు చూస్తే భూరికార్డుల ప్రక్షాళనలో పట్టాదారు పాస్ బుక్స్ జారీ చేసిన భూముల వివరాలు మాత్రమే ఉన్నాయి. మిగతా భూముల వివరాలు అందులో కనిపించడం లేదు. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న 16 వేల కేసులు పరిష్కరానికి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించి 2 నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. ఇవి కాకుండా అప్లికేషన్లు ఇచ్చి.. పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది రైతులకు ఏ పరిష్కారం చూపుతుందో అర్థం కావడం లేదు. పార్ట్ బీ కేటగిరీలో చేర్చిన 13 నుంచి 15 లక్షల ఎకరాల సంగతి ఏమిటన్నది ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రపంచంలోని అన్ని చట్టాలను అవపోసన పట్టి కొత్త రెవెన్యూ చట్టం రూపొందించానని చెబుతున్న సీఎం కేసీఆర్.. వివాదాల్లో ఉన్న భూముల సంగతి మాత్రం పట్టించుకోకపోవడం దారుణం.

అప్పుడు అనధికారికంగా.. ఇప్పుడు అధికారికంగా..

గతంలో గ్రామాల్లో ఎకరం భూమి పట్టా చేయాలంటే భూముల మార్కెట్ రేటును బట్టి ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు లంచం వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ పనిని ప్రభుత్వం ధరణి పోర్టల్ రూపంలో మొదలుపెట్టింది. ఇన్నాళ్లు ఉచితంగా చేసిన మ్యుటేషన్ కు ఇక నుంచి ఎకరాకు రూ.2,500 ఫీజు చెల్లించాలని, పాస్ బుక్ కు రూ.300, కొరియర్ చార్జీలకు రూ.200, మీ సేవలో దరఖాస్తుకు రూ.145 ఇలా ఒక్కో ఎకరం మీద రూ.3వేల వరకు వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఇవి గాక అంతగా చదువుకోని రైతులు డాక్యుమెంట్ రైటర్లకు మరికొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ భూములకు రక్షణ ఎలా?

ధరణి పోర్టల్ లో ప్రొహిబిటెడ్ ఆస్తుల జాబితాను ప్రకటించినప్పటికీ.. వాటిని రక్షించడం ఎలా అనే విధానం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పొలిటికల్ లీడర్లు.. అవినీతి అధికారుల అండతో ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసి ప్రైవేట్ సర్వే నంబర్లపై అమ్మి సొమ్ము చేసుకున్నారు. సర్వే నంబర్ ప్రైవేట్ ది పొజిషన్ ప్రభుత్వ భూమిలో ఉన్న ఇలాంటి స్థలాలకు ఎల్ఆర్ఎస్ కూడా అయ్యింది. చాలా మంది ప్రజలు ఇలాంటి స్థలాలను తెలియక కొనుక్కొని నష్టపోయారు. అందుకే ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను సర్వే చేసి, యుద్ధప్రాతిపదికన ఫెన్సింగ్​ వేసి రక్షించాలి. తద్వారా ప్రజలు మోసపోకుండా చూడడమేగాక అక్రమంగా ప్లాట్లు అమ్ముకునే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా కట్టడి చేసినట్లవుతుంది.

మ్యుటేషన్​లో అక్రమాలు జరుగుతున్నాయ్

మ్యుటేషన్​ అప్లికేషన్​ పెండింగ్ లో ఉన్న భూములపై ధరణి పోర్టల్ లో పాత ఓనర్ల పేర్లే కనిపిస్తున్నాయి. గతంలో భూమిని వేరొకరికి అమ్మిన కొందరు వ్యక్తులు.. ఇదే అదనుగా మరొకరికి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్​ చేసేందుకు స్లాట్ బుక్​ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వెలుగు చూశాయి. దీంతో మ్యుటేషన్​ పెండింగ్​లో ఉన్నవాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. రోజుకో జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు మ్యుటేషన్ క్లియరెన్స్ పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఏడాది, రెండేండ్ల కింద భూమి అమ్ముకున్న సదరు వ్యక్తులు ఇప్పుడు ధర పెరిగిందనే ఆశతో మోసపూరితంగా వేరొకరికి రిజిస్ట్రేషన్​ చేస్తే బాధ్యులెవరు?. ఇలాంటి అప్లికేషన్లు సుమారు లక్ష ఉంటాయని రెవెన్యూ అధికారులే చెపుతున్నారు. వీళ్ల పేరిట మ్యుటేషన్ చేసే వరకూ ధరణిని నిలిపివేయాలి.

– నారగోని ప్రవీణ్, తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్

For More News..

‘లోకల్ ఫర్ దివాళీ’కి ప్రధాని మోడీ పిలుపు

కరోనాపై ఫైట్‌కు బైడెన్​ టాస్క్‌‌ఫోర్స్‌‌

నేనోడిపోలే.. కుర్చీ దిగ