ధరణి వల్ల బక్క పేద రైతులకు లాభం కన్నా.. నష్టమే ఎక్కువగా జరుగుతోంది. తప్పుల తడక రికార్డుల నమోదు, అధికారుల తప్పిదాలతో వాళ్లు నేటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పైగా అధికారులు చేసిన ఆ తప్పులను ధరణిలో సరిదిద్దుకోవడానికి రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలనడం అన్యాయం. ధరణి సమస్యలపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ చిన్న చిన్న పరిష్కారాలనే చూపగలిగింది. ఇంకా లక్షలాదిమంది రైతులు భూ రికార్డుల సవరణలో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల సేవలు ఆన్లైన్ చేయడం.. భూములు కొనుగోలు చేసే రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసింది తప్ప సాధారణ రైతులకు కష్టాలే మిగిల్చింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రజా కమిటీలను ఏర్పాటు చేసి తప్పులను సరిదిద్దాలి. దశాబ్దాలుగా ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రికార్డులను సరిచేసే విధానం ఉండేది. దాన్ని కొనసాగించాలి.
రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ ధరణితో పరిష్కారమవుతాయని, రైతులు ఏ అధికారుల దగ్గరికీ వెళ్లే బాధలు ఇక ఉండవని చెప్తూ.. ‘ధరణి’ పోర్టల్తెచ్చింది. 2020 సెప్టెంబర్9న ముఖ్యమంత్రి శాసనసభలో పాస్ పుస్తకం–1971 సవరణ చట్టం ప్రవేశపెట్టి ఆమోదం పొందడంతో పాటు గవర్నర్ఆమోదముద్ర కూడా వేయించుకున్నారు. రెవెన్యూ హక్కుల రికార్డును డిజిటల్ పద్ధతిలో నిర్వహించడానికి, అవినీతిని రూపుమాపడానికి ఈ సవరణ చట్టం ఉపయోగపడుతుందని శాసనసభలో ప్రకటించారు. 25 సెక్షన్లతో 1971 రెవెన్యూ చట్టానికి సవరణ తెచ్చారు. మొత్తం రెవెన్యూ చట్టానికి కీలకమైన సవరణ తెచ్చినట్లు చెప్పినా.. అందులో సెక్షన్ 26ను మాత్రమే సవరించారు. ఈ చట్టం వల్ల భూముల కొనుగోలుదార్లకు ఎలాంటి తగాదాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ చట్టంలో భూమి కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో లేకున్నా భూమి కొనుగోలు చేయవచ్చు. వారసుల పేర్లతో డిగ్రీ పొందినవారికి పాస్ పుస్తకం జారీ చేయవచ్చు. వారసుని పేరు మార్చడానికి కూడా రిజిస్ట్రేషన్ డ్యూటీ చెల్లించాలి. ఈ చట్ట ప్రకారం గత పాస్ పుస్తకం రద్దయిపోయింది. కొత్త పాస్ పుస్తకంలో తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు ఎలాంటి మార్పులు చేయడానికి వీలులేదు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో అమ్మకం, కొనుగోలు రిజిస్ట్రేషన్లు చేయడానికి తహసీల్దార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతకుముందున్న రెవెన్యూ పదవులను(విఆర్డి) రద్దు చేశారు. రైతులు, భూ యజమానులు ఈ చట్ట మార్పిడితో తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయని భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి?
లక్షల్లో తప్పులు.. లోపాలు
ధరణి వెబ్ సైట్ అమలులోకి వచ్చిన తర్వాత లోపాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. దాదాపు 37,828 పాసుపుస్తకాలు చనిపోయిన పట్టాదారుల పేరుమీద వచ్చాయి. ఆధార్ తప్పుగా నమోదైనవి 27,520 ఉన్నాయి. పాసుపుస్తకాల్లో ఫొటోలు తప్పుగా ఉన్నవి18,206, పట్టాదారు పేరు తప్పుగా రాసినవి17,069 అని తేలింది. వ్యవసాయేతర భూములకు 7,431 పాసుపుస్తకాలు ఇచ్చారు. 45,803 పాసుపుస్తకాల్లో తక్కువ విస్తీర్ణం పడింది. కాగా ఎక్కువ విస్తీర్ణం రాసిన పాసుపుస్తకాలు 37,998 ఉన్నాయి. ఒకే ఖాతాను రెండుచోట్ల రాసినవి 34,815, సర్వే నెంబర్లలో తప్పులొచ్చినవి12,682, అమ్ముకున్న అసైన్డ్ భూములకు వచ్చిన పాసుపుస్తకాలు 4,116, అటవీశాఖతో వివాదాలున్న భూములకు పాసుపుస్తకాలు ఇచ్చినవి10,879 కాగా మొత్తం భూవివాదాలు 2,65,653 బయటకువచ్చాయి.
సాదాబైనామాలు పెండింగ్‌లోనే..
సాదాబైనామాలకు ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తామని 2016 జూన్ 3న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో రెగ్యులరైజేషన్ కోసం11,19,112 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 6, 18,368 దరఖాస్తులకు సంబంధించి 2,68,610 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. మిగిలిన దరఖాస్తులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వారసత్వ మార్పిడి చాలావరకు జరగలేదు. వారసులు చనిపోయినప్పటికీ మార్పులు చేయకపోవడంతో చనిపోయిన వారి పేరు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. రెవెన్యూ చట్ట ప్రకారం చనిపోయిన వారి పేర్లు రికార్డుల నుంచి తొలగించాలి. అలాగే బదిలీ నిషేధించిన ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక భూమిలో కొంతభాగం అమ్మితే మిగిలిన భూమిని అమ్మకుండా నిషేధపు రిజిస్టర్ 22ఏ లో చేర్చారు. ఈ విధంగా లక్షలాదిమంది నిత్యం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ సవరణల కోసం తిరుగుతున్నారు.
సబ్‌కమిటీ వేసినా..
తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారులు తమకు రికార్డులు మార్చే అధికారం లేదని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ధర్నాలు, పికెటింగులు, ప్రదర్శనలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆర్థికమంత్రి హరీశ్ రావు నేతృత్వంలో మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా కేబినెట్ ఉపకమిటీ వేసింది. ఈ కమిటీ నాలుగుసార్లు సమావేశమైంది. కొన్ని సంస్థలతో పాటు ప్రజలను, ప్రజాప్రతినిధులను విచారణ చేస్తే 20 రకాల లోపాలు కనిపించినట్లు కమిటీ ప్రకటించింది. వీటిని 7 మాడ్యూల్స్ గా(పట్టాదారు పేరు, వివరాలు సరిచేయడం, మిస్సింగ్ సర్వే నెంబర్లను సరిచేయడం తదితర అంశాలను)సరిచేయడానికి కలెక్టర్లకు బాధ్యత ఇవ్వాలని కేబినెట్ కమిటీ సిఫారసు చేసింది. మిస్సింగ్ సర్వే నెంబర్లపై దాదాపు 34,666 ఫిర్యాదులు వచ్చాయి. దీనికోసం ప్రత్యేకంగా మాడ్యూల్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వానికి సూచించింది. భూ విస్తీర్ణం సరిచేయడానికి 16 వేల ఫిర్యాదులు వచ్చాయి. బదిలీ నిషేధిత భూముల జాబితాలో పొరపాటుగా చేర్చిన సర్వే నెంబర్లకు సంబంధించి రాష్ట్రవ్యాపితంగా 1,00,902 దరఖాస్తులు రాగా, అందులో 84,949 దరఖాస్తులను కలెక్టర్లు పరిష్కరించారు. మిగిలినవి పెండింగులో ఉన్నాయి. 1,74,661 ఎకరాల భూమి విషయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దినట్లు కమిటీ చెప్పింది. ఇలా కొన్ని పరిష్కరించినా, మెజార్టీ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి.
ఆఫీసర్ల తప్పులకు రైతులకు శిక్షనా?
ఏప్రిల్ 29న ధరణి పోర్టల్ లో 11 రకాల సమస్యలను పరిష్కరించడానికి, పాసుపుస్తకంలో సవరణలు చేయడానికి ఒక మాడ్యూల్‌ను రూపొందించారు. దీని కింద దరఖాస్తు చేసుకునేవారు ఆ 11 సమస్యలకు రూ.1,000 ప్రభుత్వానికి ఫీజు చెల్లించాలి. ఈ-సేవలో మరో రు.650 అదనంగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి రికార్డులో జరిగిన తప్పులన్నీ అధికారుల లోపాల వల్ల జరిగినవే. అధికారులు చేసిన తప్పులకు శిక్షగా రైతులు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తున్నది. అయితే ఈ మాడ్యూల్ లో లేని అంశాలకు విడిగా రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలి. ఎన్ని మాడ్యూల్స్ నిర్ణయిస్తే అన్ని అంత మొత్తం రైతులు చెల్లించాలి. అట్లయితనే సవరణకు తీసుకుంటారు.
సవరణల్లోనూ అవినీతి..
సవరణల్లో కూడా పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన 11 అంశాల్లో పేరు మార్పు, జెండర్ మార్పు, భూమి కేటగిరీ తప్పుగా నమోదైతే మార్పు, ఆధార్ నెంబర్ సవరణ, భూమి, పట్టా, సీలింగ్, భూదాన్, అసైన్డ్ వంటివి తప్పుగా నమోదై ఉంటే సరిదిద్దడం, భూమి వర్గీకరణలో మెట్ట, మాగాణి తప్పుగా నమోదు సవరణ, భూమి రకం, ఏ రకంగా సంక్రమించిందో వివరాలు తప్పుగా నమోదైతే సరిదిద్దడం, ల్యాండ్ ఎంజాయిమెంట్, సొంతమా?, వారసత్వమా? ఎవరు అనుభవిస్తున్నారు, పరిధి దిద్దుబాటు, వాస్తవ విస్తీర్ణం కన్నా పాసుబుక్ లో తప్పుగా నమోదైతే సరిదిద్దడం, మిస్సింగ్ సర్వే నెంబర్లు, పాస్ పుస్తకంలో కనిపించని సర్వే నెంబరును తిరిగి రాయడం, నోషనల్ ఖాతా నుంచి పట్టాకు బదిలీ, ఏ కారణం చేతనైనా1బి ఖాతాలో చేర్చిన తర్వాత పట్టా భూమిగా నమోదు చేసుకునేందుకు అవకాశం, తదితర సవరణలకు అంగీకారం తెలుపుతూ మీ-సేవలో దరఖాస్తులు చేసుకోమన్నారు. పత్రికా ప్రకటన చూసి వేలమంది మీ-సేవలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం తమకు ఎటువంటి జీవో రాలేదని, ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టలేదని నిరాకరిస్తున్నారు.
బాధ్యులు ఎవరు?
రాష్ట్రంలో 22 లక్షల రెవెన్యూ రికార్డుల అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో చెప్పింది. ఫలితంగా భూయజమానులు లక్షలకొద్దీ ఫీజు రూపంలో చెల్లించి సవరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చేసిన తప్పులకు రైతులను బాధ్యులను చేయడం, ఇబ్బందులకు గురిచేయడం న్యాయమా? గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో బహిరంగ విచారణలు జరిపి రికార్డులు సరిచేయాలి. ఎలాంటి రుసుము లేకుండా వాటిని చక్కదిద్దాలె. గతంలో తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో 16,160 రెవెన్యూ కేసులు ఉండగా వాటిని ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కరించామని చెప్పిన ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను ఎత్తివేసింది. వాస్తవానికి ఈ ట్రిబ్యునల్ ఏకపక్షంగా పరిష్కరించింది. ఈ తీర్పులపై పునర్విచారణ జరిపి రెండు పక్షాలను పిలిచి పరిష్కరించమని హైకోర్టు ఆదేశించింది. ఆ పని ఇంతవరకూ జరగలేదు. కోర్టుల చుట్టూ తిరిగి రైతులు పెద్దఎత్తున ఆర్థికంగా నష్టపోతున్నారు. సవరణలు చేసే అధికారం వివిధ స్థాయిల్లో తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు కల్పించాలి. కలెక్టర్‌కు పాసుపుస్తకం సవరణ చేసే హక్కు లేకపోవడం విచారకరం.
- సారంపల్లి మల్లారెడ్డి,ఉపాధ్యక్షుడు, ఆల్ ఇండియా కిసాన్‌సభ