విశ్లేషణ: ధరణి పోర్టల్ రద్దు చేయాలె

ధరణి పోర్టల్‌‌‌‌ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతతోపాటు పదినిమిషాల్లోనే క్రయవిక్రయాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ దిశలో మాత్రం ధరణి పూర్తిస్థాయిలో సేవల్ని అందించలేకపోయింది. దీనివల్ల రైతుల ఇబ్బందులు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. అవినీతి నెపం మోపి వీఆర్వో వ్యవస్థ రద్దు చేసింది. కానీ వారిని ఏడాదిగా కూర్చోబెట్టి జీతాలిస్తోంది. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌లు కూడా రిజిస్ట్రేషన్‌‌‌‌ల కోసం డబ్బులు డిమాండ్ చేసిన సంఘటనలు ఎన్నో. ధరణితో పాటూ రెవెన్యూ కోర్టుల్ని రద్దు చేసిన ప్రభుత్వం రైతుల న్యాయపరమైన వివాదాల్ని త్వరగా పరిష్కరించడానికి కనీసం జిల్లా స్థాయిలో కూడా ఎలాంటి ట్రిబ్యునల్‌‌‌‌లనూ ఏర్పాటు చేయలేదు.

ఒక సర్వే నెంబర్​లో కొంత ప్రభుత్వ భూమి ఉన్నా, లేక ఏదైనా కోర్టు వివాదం ఉన్నా ఆ మొత్తం సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌ను నిషేధిత జాబితాలో చేర్చారు. నిషేధిత భూముల జాబితా నుంచి తమ భూముల్ని తొలగించాలని ఇప్పటికే ధరణి పోర్టల్‌‌‌‌లో 60 వేల ఫిర్యాదులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. నిషేధిత జాబితాతో పాటు ఇతర అనేక అంశాల్లో ధరణి తప్పిదాలను ప్రభుత్వం ఇటీవల ఒప్పుకోవడంతో పాటు వాటిని సరిదిద్దడానికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ధరణిలో సవరణల కోసం, కొత్తగా ప్రవేశపెట్టాల్సిన అంశాల కోసం సబ్ కమిటీ తీసుకుంటున్న చర్యలు మాత్రం ఆచరణలో కనిపించడం లేదు. ఇటీవల హైకోర్టు సైతం ధరణి సాంకేతిక సమస్యలపై తీసుకున్న చర్యల్ని చెప్పాలని ఆదేశించింది. తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్​ సైతం ధరణి అక్రమాల వల్ల రైతుల ఆత్మహత్యలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికైనా ధరణి పోర్టల్‌‌‌‌ను రైతుల అవసరాల మేరకు సవరించి, సాంకేతిక సమస్యల్ని పరిష్కరించాలి. ధరణి పోర్టల్‌‌‌‌ను పూర్తిగా రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌‌‌‌లు కొనసాగిస్తే ఇంకా మంచిది...పసునూరి శ్రీనివాస్, మెట్​పల్లి, జగిత్యాల జిల్లా