ధరణి సమస్యల పరిష్కారాలు

ధరణి సమస్యల పరిష్కారాలు

టైటిల్ గ్యారెంటీ చట్టంగా పరిగణిస్తున్న రికార్డ్ అఫ్ రైట్స్ చట్టం గ్యారెంటీగా కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వ భూమి కాదు అని చెప్పే పరిస్థితి లేదు. సెక్షన్ 22లో నిషేధిత భూముల విస్తీర్ణం కూడా ఎప్పటికప్పుడు మారవచ్చు. కొత్తవి రావచ్చు, కొన్ని తీసివేయవచ్చు. ధరణి పోర్టల్ ద్వారా నిర్ణయాలు ఉంటాయి.  ఈ నిర్ణయ ప్రక్రియ పారదర్శకంగా, పద్ధతి ప్రకారం ఇప్పటికైతే  లేదు. 23 లక్షల ఎకరాల అటవీ భూమికి రెక్కలు తొడిగిన అవినీతి ధరణి పోర్టల్ ద్వారా ఇంకా రహస్యంగా అవినీతికి పాల్పడదు అని గ్యారెంటీ ఎవరు ఇస్తారు? మోసపూరిత లావాదేవీలను అరికట్టడానికి, విశ్వసనీయత,  ఖచ్చితత్వం, సామర్థ్యాన్ని పెంపొందించడానికి తీసుకువచ్చిన సమీకృత భూ రికార్డు నిర్వహణ వ్యవస్థ ధరణి అవే రకం లావాదేవీలకు ఆలవాలం అయ్యింది.

(నిన్నటి తరువాయి)

దాదాపు 25 ఏండ్ల క్రితమే భూమి రికార్డులు ఒక దగ్గర లేవని, భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఏకీకృత మార్కెట్ లేదని దేశంలో భూముల రికార్డులు కంప్యూటరీకరణ మొదలుపెట్టారు.  క్రమంగా కంప్యూటర్లలో భూమి రికార్డులు నిక్షిప్తం అయ్యాయి.  గ్రామాలవారీగా ఉండాల్సిన మాన్యువల్ రికార్డులు కనుమరుగయ్యాయి.  రికార్డులు పాక్షికంగా ఉన్నాయి. మ్యాపులు లేవు. విస్తీర్ణం ఉండి, సర్వే నంబర్ ఉండి లొకేషన్ తెలియని భూమి రికార్డులు ఉన్నాయి. 

ఉదాహరణకు ఒక ఊర్లో 100 ఎకరాలు ఉంటే, పాసు పుస్తకాలలో ఉన్న భూమి విస్తీర్ణం కూడితే 120 ఎకరాలు వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ రికార్డులే దిక్కు.  అందులో ఎన్ని తప్పులు, లోపాలు ఉన్నాయో తెలియదు. అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగినప్పుడు, మ్యుటేషన్ చేయడానికి రికార్డు చరిత్ర కోసం ప్రయత్నాలు చేసినప్పుడు ఇట్లాంటి విషయాలు బయటపడుతున్నాయి. ఇదే అదనుగా దౌర్జన్యంగా భూములను ఆక్రమిస్తున్న ముఠాలు పెరిగిపోతున్నాయి. పేపర్ మీద, పుస్తకాలలో, దస్తావేజులలో ఉండే రికార్డు అందరికి కనపడతాయి.

 ఈ పేపర్ రికార్డులు మార్చడం అంత సులువుగా కాదు. కానీ, కంప్యూటర్లో  భూమి రికార్డులను మార్చటం చాలా సులువు. మార్చినట్టు ఎవరికీ తెలియదు కూడా. మార్చినట్టు గుర్తించినా సరిదిద్దడం ఇంకా తలనొప్పిగా మారింది. దీనిని అధికారులు, రాజకీయ నాయకులు,  డబ్బు, పలుకుబడి ఉన్న వర్గాలు తమకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందుతున్నారు. ఒక వ్యక్తి (CCLA) దగ్గరికి అన్ని ఫిర్యాదులు చేరుతున్నాయి. 20 లక్షలు పైబడి ఉన్న ఈ ఫిర్యాదులను ఒక అధికారి ఏమి ఆధారంగా నిర్ణయిస్తాడు. ఎప్పటికి పరిష్కరిస్తాడు? ఇట్లాంటి పరిస్థితి అవినీతికి ఆస్కారం ఇస్తుంది. 

కోర్టుల్లో భూవివాదాలు

2007లో చేసిన ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం దేశంలో ఉన్న కోర్టు కేసుల్లో మూడింట రెండు వంతుల వరకు భూమి సంబంధిత వివాదాలు ఉన్నాయి. తెలంగాణ పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూమి హక్కుల చట్టం, 2020 వచ్చింది. కంప్యూటరీకరణ ద్వారా ధరణి వచ్చింది. ఇప్పటికి అవే సమస్యలు వస్తున్నాయి - భూమి టైటిల్స్, రికార్డుల నిజనిర్ధారణ, యాజమాన్య వివాదాలకు సంబంధించినవి. తెలంగాణ హైకోర్ట్ లో ధరణి వల్ల దాదాపు 2 లక్షల కొత్త కేసులు వచ్చాయని ఒక అంచనా.  భూమి రికార్డులలో వివిధ రకాల సమాచారం (ఆస్తి మ్యాప్‌‌లు/ నక్షాలు, సేల్ డీడ్‌‌లు) ఉంటుంది. 

ఇదివరకు, ఇవి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ ఫైళ్ళ నుంచి ఇప్పుడు ఒక్కటే శాఖ...ఒక్కటే రికార్డు (ధరణి)..ఒక్కడే అధికారి. భూమి రికార్డులలో ఇదివరకు ఖాస్తు సమాచారం తీసేసింది. నక్షాలు అయితే మరిచిపోయారు. ఫలితంగా, భూమి రికార్డులలో చాల లోపాలు ఉంటున్నాయి. భూరికార్డులను నవీకరించడానికి ఎన్నో యేండ్ల నుంచి సర్వేలు చేపట్టలేదు. లేదా పూర్తి చేయలేదు. క్షేత్ర స్థాయిలో వాస్తవ సరిహద్దులను గుర్తించే మ్యాప్‌‌లను ఉపయోగించలేదు. అందువల్ల, అనేక రికార్డులలో ఉన్న వివరాలు క్షేత్రంలో ఉన్న పరిస్థితికి సరిపోవడం లేదు. వీటిని యెట్లా సరి చేస్తారు? ముసాయిదా 2024లో స్పష్టం చెయ్యాలి. 

ధరణిలో లోపించిన పారదర్శకత

శాసనసభలో మాట్లాడుతూ అప్పటి సీఎం రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెద్ద కంప్యూటర్  తెర ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆపరేటర్ చేస్తున్న పనిని వీక్షించవచ్చు అని హామీ ఇచ్చారు. డిజిటల్ రికార్డుల ప్రక్రియలో ప్రధాన లోపం కంప్యూటర్ తెర కనపడకపోవటం.  గ్రామంలో ఇదివరకు పహణి పుస్తకం ముందట ఉండేది. అందులో దిద్దుబాట్లు, మార్పులు కనపడేవి. కంప్యూటర్ రికార్డులు వచ్చినాక ప్రజలకు అందులో ఏమున్నదో కనపడదు.  ఆపరేటర్లు, అధికారులు చూపించరు.

భూమి రికార్డుల లావాదేవీల విషయంలో అవినీతి తగ్గాలంటే ఈ కంప్యూటర్  ప్రక్రియలు ప్రజలకు కనపడాలి.  భూముల రికార్డు ఒక పబ్లిక్ రికార్డు.  ప్రైవేటు రికార్డు కారాదు. 1971 ఆర్ఒఆర్ చట్టంలో భూ రికార్డులు పౌరులు పరిశీలించే హక్కు కల్పించింది. 2020 ఆర్ఒఆర్ చట్టంలో ఇది లేదు. 2024 ఆర్ఒఆర్ ముసాయిదాలో దీనిని పబ్లిక్ రికార్డుగా, ప్రజల ఆస్తిగా పరిగణిస్తూ, వారికి అందుబాటులో ఉండాలి.  

వివిధ చట్టాలను మార్చాలి. సంస్థాగత వ్యవస్థను పునఃవ్యవస్థీకరించాలి. 2017లో వీటన్నింటి గురించి మాట్లాడిన తెలంగాణ ప్రభుత్వం, 3 ఏండ్ల తరువాత రికార్డ్ అఫ్ రైట్స్ చట్టాన్ని కొంత మేర మార్చి ఆమోదించింది. రికార్డుల ప్రక్షాళన 98 శాతం పూర్తి అయ్యింది అని ప్రకటించి ధరణి పోర్టల్ ప్రారంభించింది. తెలంగాణ పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూమి హక్కుల చట్టం, 2020, ప్రజల ముందు పెట్టకుండా, శాసనసభలో చర్చించకుండా ఆమోదించింది. 

భూ రికార్డుల ప్రక్షాళన పారదర్శకంగా చేయాలి

ప్రజాశ్రేయస్సు లోపించిన తొందరపాటు నిర్ణయాలు, పరిణామాలు 2020 తరువాత తెలంగాణ వ్యాప్తంగా రైతులను ఒక కుదుపు కుదిపింది. అనేక కుటుంబాల్లో క్షోభ మిగిల్చింది. లక్షలలో ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికీ అవి పరిష్కారం కాలేదు. డిసెంబర్ 2023లో ఏర్పడిన కొత్త తెలంగాణ ప్రభుత్వం చట్టం సవరణకు పూనుకుంది. ముసాయిదా 2024 ప్రజల ముందు పెట్టింది. ఈ ముసాయిదా 2024 చట్టం ముందు సవాలు ధరణి,  ధరణికి దన్నుగా చేసిన 2020 చట్టం చేసిన అవకతవకలు, గందరగోళం, తప్పులు, జరిగిన అవినీతి, తీసుకున్న నిర్ణయాలు పరిగణనలోనికి తీసుకుంటూ, పాత చట్టాలను సవరిస్తూ, భూ రికార్డుల ప్రక్షాళన పారదర్శకంగా, ప్రజల ఆమోదంతో చేసే ప్రక్రియను కూడా ప్రతిపాదించాలి. 

ధరణి పేరు మారుస్తూ తెస్తున్న భూమాత పోర్టల్ ధరణికి భిన్నంగా ఏ విధంగా ఉంటుందో వివరాలు ప్రభుత్వం ఇవ్వాలి.  ప్రైవేటు సంస్థ అధీనంలో ఇప్పటికే ఉన్న భూమి రికార్డులు ప్రభుత్వం ఎప్పుడు, ఏ విధంగా తన అధీనంలోకి తెచ్చుకుంటుంది?  ఇప్పటికే ‘బయటకు’ మళ్ళిన రికార్డులు ఎవరు, ఎక్కడ, ఏ విధంగా ఉపయోగించారు, మార్చారు అనే విషయం మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేయాలి. రైతుల పాసు పుస్తకాలలో, భూమి విస్తీర్ణంలో, పేర్లలో చేర్చిన మార్పులను సరి చేయడం, భూ రికార్డులను ప్రక్షాళన చేయడం వంటి పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి.  CCLA ఆఫీసు కేంద్రంగా ధరణి సాధనంగా జరిగిన అవినీతి, రికార్డుల టాంపరింగ్ మీద విచారణ చెయ్యాలి. CCLAను పక్కనపెట్టి  ముగ్గురు సభ్యులతో కూడిన భూమి కమిషన్  ఏర్పాటు చేయాలి. 

ప్రైవేటు సంస్థతో ఒప్పందంలో అనేక లోపాలు


ధరణితో ప్రధాన సమస్య ప్రైవేటు సంస్థ నిర్వహణ. గత తెలంగాణ ప్రభుత్వం  ప్రైవేటు సంస్థతో 2018లో జరిగిన ఒప్పందంలో అనేక లోపాలు ఉన్నాయి.ప్రైవేటు వ్యక్తులకు ధరణి రికార్డులు అప్పగింత ఒక పెద్ద కుంభకోణంగా పేర్కొనవచ్చు. పాస్ పుస్తకాల్లో  భూమి విస్తీర్ణం తగ్గడానికి ఈ సంస్థే కారణం. భూమి రికార్డులు అన్నీ పేరుకే  ప్రభుత్వ డేటాబేస్​లో ఉన్నా, దాని మీద అజమాయిషీ ఏ ప్రభుత్వ అధికారి, ప్రభుత్వ సంస్థ చేయడం లేదు. ఈ ప్రైవేటు సంస్థ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నది ఆనాటి ప్రభుత్వం. అది క్రమంగా చేతులు మారింది. 

ఈ సంస్థకున్న ఏకైక ‘ఆస్తి’ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త భూమి రికార్డులు. ప్రజల ఆస్తి అయిన భూమి రికార్డులు ప్రజలకు అందుబాటులో లేవు.  కానీ, ప్రైవేటు సంస్థకు ఒక వరంగా మారినాయి. ధరణి నుంచి భూమాత పోర్టల్ మారితే సంస్థ మారుతుందా? సంస్థతో ముడిపడిన సంబంధాలు మారతాయా? ఈ సంస్థకు చెందిన కంప్యుటర్ ఆపరేటర్లు భూ రికార్డుల అవినీతిలో భాగస్వాములు అని జనం నమ్ముతున్నారు. వీరి మీద, వీరి వ్యవహారం మీద, ఆస్తుల మీద విచారణ చేయాల్సి ఉన్నది.

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​